Bapatla Agriculture College Platinum Jubilee: వ్యవసాయ విద్యా చరిత్రలో బాపట్ల వ్యవసాయ కళాశాలది ఓ విశిష్ట అధ్యాయం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని మొట్టమొదటి వ్యవసాయ కళాశాలగా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన ఈ కళాశాల ప్రస్థానం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది. అప్పటి తాలూకా బోర్డు అధ్యక్షుడు ఆనరరీ లెఫ్టినెంట్ శ్రీ పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి, వ్యవసాయ సంచాలకులు రావు బహద్దూర్ శ్రీ డా.బి.వి.నాథ్, మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్‌కు సలహాదారైన శ్రీ శొంఠి వెంకట రామమూర్తి మరియు వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎస్.ఎస్.పాత్రుడు గార్ల కృషితో 1945 సం.లో ఈ కళాశాల స్థాపించబడిరది. దక్షిణ భారత దేశంలో స్థాపించబడిన ద్వితీయ కళాశాలగా అరుదైన గుర్తింపు పొందడమే గాక ప్రారంభించిన నాటి నుంచి ఉన్నత విద్యా ప్రమాణాలతో అంచలంచెలుగా ఎదుగుతూ, అప్రతిహతంగా సాగుతూ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి తరగని వన్నె చేకూర్చింది.
ఈ వ్యవసాయ కళాశాల 96 మంది విద్యార్థులతో శ్రీ సి. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ప్రిన్సిపాల్‌గా జులై 16 వ తేదీన ప్రారంభమై నేడు డా. వి. శ్రీనివాస రావు అసోసియేట్ డీన్‌గా సంవత్సరానికి 280 మంది విద్యార్థులకు విద్యావకాశాన్ని కల్పించే స్థాయికి ఎదిగింది. ఆశావహ దృక్పథంతో ఆరంభమై నేడు అన్నదాతల సౌభాగ్య ప్రదాయినిగా విలసిల్లుతోంది. కోస్తా తీర ప్రాంతమైన బాపట్ల తరచుగా తుఫాను తదితర ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే భూభాగం కావడంతో విద్యార్థులను వ్యవసాయ సాంకేతిక విద్యలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యను బోధిస్తుంది.
ఆంధ్ర విశ్వ విద్యాలయము యొక్క అంతర్భాగ కళాశాలగా ఏర్పడిన ఈ కళాశాల 1964 సం.లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విలీనం కావించబడిరది. తదుపరి అది 1996 సం.లో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంగా నామకరణం చెందింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థి డా. ఏ. విష్ణువర్ధన్ రెడ్డి ఈ విశ్వ విద్యాలయ ఉపకులపతి హోదాలో ఉండటం ఈ కళాశాల ఘనతను చాటుతుంది.
ఈ కళాశాల 28.53 హెక్టార్లలో విస్తరించబడి ఉండటమేకాక అనుబంధంగా 116 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాన్ని కలిగి ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రం అండర్ గ్రాడ్యుయేట్ సేద్య సంబంధిత ఆచరణాత్మకమైన తరగతులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన మరియు విత్తనోత్పత్తి అంశాలలో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల బి.యస్సీ. కోర్సులో సుమారు 280 విద్యార్థులు ఈ కళాశాలలో ప్రవేశం పొందుతున్నారు. 65 మంది విద్యార్థులు మాస్టర్స్ ప్రోగ్రాం లోను, 26 మంది విద్యార్థులు డాక్టోరల్ ప్రోగ్రాంలోను విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలో వ్యవసాయ శాస్త్రాలకు సంబంధించి 12 విభాగాలు, 91 మంది బోధన మరియు 234 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.
8 విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందించబడుతున్నాయి. 1200 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి కల్పించేందుకు పరిశుభ్రమైన పర్యావరణంలో 9 హాస్టళ్లు (బాలికలకు 4, బాలురకు 5) చక్కని నివాస ప్రాంగణాలుగా ఉన్నాయి. 63 శాతం విద్యార్థినుల సంఖ్యా బలం మరియు 40 శాతం మహిళా బోధనా సిబ్బందితో కొలువైన అరుదైన కళాశాల ఇది.
బి.యస్సీ డిగ్రీలో ప్రవేశానికి అఖిల భారత ప్రవేశ పరీక్ష కాలేజీకి బహుళ సాంస్కృతిక రూపాన్ని ఇస్తుంది. కళాశాలలో నిర్మించబడిన అద్భుతమైన నిర్మాణాలలో డా.బి.వి.నాథ్ ఇండోర్ ఆడిటోరియం ఒకటి. అత్యున్నత ప్రమాణాలతో 900 సీట్ల సామర్ధ్యంతో, ఎయిర్ కండిషనింగ్ గ్రీన్ రూమ్స్ తో పూర్తి స్థాయి ఆధునిక సాంకేతిక సౌండ్ సిస్టంతో నిర్మించబడిరది. క్రికెట్, బాస్కెట్ బాల్, బాల్ బాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకై సువిశాలమైన ఆటస్థలం, వాటికి అనుబంధంగా పెవిలియన్ నిర్మించబడిరది.
3 ఓపెన్ జిమ్స్ కలిగివున్న మల్టి పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ఈ కళాశాలకు అదనపు ఆభరణం. ఈ ఏడాది క్రీడలు, ఆటలు, సాంస్కృతిక మరియు సాహిత్య విభాగాలలో జరిగిన పోటీలలో అన్నింటిలోనూ క్లీన్ స్వీప్ చేసి, ప్లాటినం జూబ్లీ ఉత్సవ కానుక అందించింది. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రయోగశాలలు, విజ్ఞాన వనరుల కేంద్రం, కేంద్ర పరికరాల విభాగం వంటి అంతర్జాతీయ సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తూ వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతోంది.
రికార్డు స్థాయిలో సుమారు 80,000 పుస్తకాలతో విలసిల్లే విద్యార్థి విజ్ఞాన కేంద్రాన్ని కళాశాలకు గొప్ప సంపదగా భావించవచ్చు. ఇది వివిధ రకాలైన మేగజైన్లు, పీరియాడికల్స్ మరియు జనరల్స్ తో విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల విస్తృత పరిశోధనలకు ఆలంబనగా ఇ-వనరులను కలిగి ఉంది. డిజిటల్ లైబ్రరీ వంటి ఉత్తమోత్తమ విద్యా సౌకర్యాలతో పరిఢవిల్లుతుండుటచే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థ నుండి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డును అందుకుంది. అంతేకాకుండా ఉన్నత విద్యా ప్రమాణాలలో మన వ్యవసాయ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయిలో 11 వ స్థానంలో నిలువగా, పరీక్షల ఉత్తీర్ణతలో బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకుని సరిక్రొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1994 – 1998 సం.లలో వరుసగా మూడు సంవత్సరాలపాటు అత్యుత్తమ ర్యాంకులను సాధించి, రికార్డు నెలకొల్పడంతో నాటి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఎస్.ఎస్.మెహతా కళాశాలకు 30 లక్షల రూపాయల నిధులను బహూకరించి అభినందించారు.
బాపట్ల వ్యవసాయ కళాశాల ర్యాగింగ్ నిబంధనలను కఠినంగా అమలుపరుస్తుంది. విద్యార్థులు ఈవ్ టీజింగ్ వంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను రూపొందిస్తుంది. ప్రముఖుల ప్రసంగాలతో వారిలో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తుంది. అందుకే ఈ కళాశాల ర్యాగింగ్ రహిత కళాశాలగా పేరు పొంది, తల్లిదండ్రుల అభిమానాన్ని విశేషంగా చూరగొంది.
వివిధ రంగాలలో కళాశాల విశిష్టమైన పాత్ర :
1. మానవ వనరుల అభివృద్ధి :
సాంకేతికంగాను మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కళాశాల యొక్క దార్శనికత అద్భుతమైనది. కోర్సు సమయంలో అన్ని అంశాలలోను శిక్షణ పొందే విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరంలో వ్యవసాయంలోని కష్ట నష్టాలను, ఇబ్బందులను గ్రహించడానికి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే చర్యలను సూచించడానికి ఒక సెమిస్టర్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు కేటాయించబడిరది. మార్కెట్ ఆధారిత అసైన్మెంట్లతో ఒక నెల వ్యవధిలో పారిశ్రామిక ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టబడిరది.
స్టూడెంట్ రెడీ ప్రోగ్రాంలో భాగమైన విద్యార్థులు తమ డిగ్రీ ప్రోగ్రాం తరువాత వారు స్వయంగా సొంత వాణిజ్య సంస్థను స్థాపించేలా శిక్షణ ఇవ్వడానికి నిర్దేశించబడిరది. (గ్రామీణ అవగాహన కృషి అనుభవం) కార్యక్రమం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు గ్రామ పరిస్థితుల సహజ పరిస్థితులను, వ్యవసాయ కుటుంబాలతో కలిసి పని చేయడం, వారి సమస్యలను గుర్తించడం మరియు అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి వివిధ విస్తరణ సాధనాలను ఉపయోగించడంలో మెరుగైన శిక్షణ ఇస్తుంది. (వ్యవస్థాపకులు నైపుణ్యాభివృద్ధి) యూనిట్ల ద్వారా అనుభవపూర్వక అభ్యాసాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి మరియు విలువలను పెంపొందించడానికి అభ్యాసకులతో ప్రత్యక్ష అనుభవాన్ని పెంపొందిస్తుంది.
(గ్రామ దత్తత కార్యక్రమం) ద్వారా పేరలి గ్రామాన్ని దత్తత తీసుకుని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేస్తుంది బాపట్ల వ్యవసాయ కళాశాల. మూడు సంవత్సరాలపాటు గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలో శిక్షణా సదస్సులను మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. అందులో భాగంగా పేరలి గ్రామాన్ని దత్తత తీసుకుని మొక్కల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, తక్కువ ఖర్చుతో అత్యాధునిక వ్యవసాయ సాంకేతికను ప్రచారం చేయడం, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి పలు అంశాల ద్వారా అన్నదాతల సౌభాగ్యం కోసం నిరంతరం కృషి చేస్తుంది. దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధిగా మొక్కవోని దీక్షతో కృషి చేస్తూ గ్రామీణుల కుటుంబాల్లో కొత్త వెలుగులను ప్రసాదిస్తుంది.
ఇటీవలి కాలంలో పథకంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కాన్సాస్ యూనివర్సిటీ, ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ మరియు జాతీయ సంస్థలైన వంటి సంస్థల్లో నైపుణ్యాభివృద్ధి కొరకు విద్యార్థులను శిక్షణ నిమిత్తం అవకాశం కల్పిస్తున్నారు. కోచింగ్ సెల్, ఓరియెంటేషన్ అందించటం ద్వారా అంతర్జాతీయ సంస్థలలో తదుపరి అధ్యయనాల కోసం జాతీయ రాష్ట్ర పోటీ పరీక్షల కోసం సమాయత్తపరుస్తున్నారు. ప్లేస్ మెంట్ సెల్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ మరియు బహుళ జాతి కంపెనీలలో అధిక సంఖ్యలో ఉపాధి పొందడంలో కళాశాల ఎప్పుడూ ముందంజలో ఉంటోంది.
2. పరిశోధన మరియు సాంకేతికత :
అత్యంత ప్రాచుర్యం పొందిన %దీూు%-5204 వరి రకం గురించి తెలియని వారు ఉండరు. ‘‘సాంబ మసూరి’’ గా కూడా పేరొందిన ఈ రకం వరిని సృష్టించిన శాస్త్రజ్ఞులు ఈ కళాశాలకు చెందిన వారు కావడం గర్వించదగ్గ విషయం. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ వరి రకంగా గుర్తింపు పొందిన ఈ రకం మార్కెట్ లో అపరిమితమైన డిమాండ్ ఉన్న వరి రకం. 4000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతుల విత్తన అవసరాలను తీర్చడానికి వ్యవసాయ కళాశాల క్షేత్రం ప్రతి ఏటా సుమారు 1200 క్వింటాళ్ళ మూల విత్తనాన్ని వివిధ వరి రకాల్లో ఉత్పత్తి చేస్తుంది. విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన క్రమపద్ధతిని ఏర్పాటు చేసి పరిశోధనలో వారిని చివరి హద్దుల వరకు తీసుకెళుతుంది ఈ కళాశాల.
పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి జోనల్ సమావేశాల్లో గుర్తించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు తమ పరిశోధనా కార్యక్రమాలను సమగ్ర పరిశీలన అనంతరం గ్రహించి తీసుకుంటారు. వారు పరిశోధించిన పలు వ్యాసాలు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడతాయి. ఈ విధంగా ప్రచురించబడిన పలు వ్యాసాలు ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రు అవార్డు, అత్యుత్తమ డాక్టోరల్ థీసిస్, ఉత్తమ థీసిస్ వంటి అవార్డులను పొంది కళాశాల ఖ్యాతిని ఇనుమడిరపజేశాయి.
3. సామాజిక సేవలో కళాశాల :
విద్యతోపాటు సమాజం పట్ల తమ బాధ్యతను కూడా వివరిస్తూ విద్యార్థులను సమాజ సేవలో భాగస్వాములను చేయడంలో కూడా ప్రధాన భూమిక వహిస్తుంది వ్యవసాయ కళాశాల బాపట్ల. జాతీయ సేవా పథకం ద్వారా ప్రత్యేక సేవా శిబిరాలను ఏర్పాటు చేస్తూ పచ్చదనం పరిశుభ్రత, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత ప్రచారం, మహిళా సాధికారత, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి పలు సేవ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది.
4. కళాశాల అభివృద్ధిలో విశ్వవిద్యాలయ పాత్ర :
బాపట్ల వ్యవసాయ కళాశాలలో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది. 2021 లో ప్రారంభించబడిన డిగ్రీ తరగతులు మరియు వివిధ విభాగాల అవసరాలను తీర్చడానికి 50 కోట్ల వ్యయంతో ఎనెక్స్ భవన నిర్మాణానికి అవకాశాన్నిచ్చింది. అంతేకాకుండా డిజిటల్ క్లాస్ రూములు, క్రొత్త నివేదిత బాలికల హాస్టల్, ప్రాంతీయ గ్రంథాలయం, ఇన్డోర్ స్టేడియం, ఓపెన్ జిమ్ లు నిర్మించడానికి ఆర్ధిక మరియు హార్దిక సహకారాన్ని అందించింది. విద్యార్థుల కొరకు జాతీయ మరియు అంతర్జాతీయ శిక్షణా కార్యక్రయాలను ఏర్పాటు చేస్తూ మానవ వనరుల అభివృద్ధిలో వారిని విశ్వ స్థాయి విశ్వ విద్యాలయాల స్థాయిలో నిలిపేందుకు ప్రోత్సహిస్తుంది.
5. పూర్వ విద్యార్థుల ట్రస్ట్ :
కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలనే సత్సంకల్పంతో 2014 లో స్థాపించబడిరది. ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, కళాశాల అభివృద్ధికై వారు చేసే వితరణ తదితర విషయాలు సమగ్రంగా ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడతాయి. పూర్వ విద్యార్థుల ఉదారతతో, వారు సమర్పించు నిధులతో పాఠ్యాంశాలు మరియు సహ పాఠ్యాంశాలు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులను సత్కరించేందుకు 16 ప్రతిభా పురస్కారాలు ప్రకటించబడ్డాయి. పూర్వ విద్యార్థుల పరస్పర సహకార సమాచారం నిమిత్తం వారి సౌకర్యార్థం రూపొందించబడినది.
6. ప్లాటినం జూబిలీ సంవత్సర కార్యక్రమాలు :
బాపట్ల వ్యవసాయ కళాశాల 1971 సం.లో రజతోత్సవం, 1994 సం.లో స్వర్ణోత్సవం మరియు 2005 సం.లో వజ్రోత్సవం ని జరుపుకుని నేడు అమృతోత్సవం కి సంసిద్ధమవుతోంది. 75 వ వార్షికోత్సవ వేడుక జనవరి 21, 2023 న జరగనున్న శుభ సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటుచేయబడ్డాయి. పలు కిసాన్ మేళాలు, బోధనేతర సిబ్బందికి క్రీడల పోటీలు, అగ్రికల్చరల్ సైన్సెస్, వర్క్ షాపులు, శిక్షణ కార్యక్రమాలు, వివిధ అంశాలపై జాతీయ సెమినార్లు, అవగాహనా సదస్సులు నిర్వహించబడ్డాయి. దత్తత గ్రామంలో వ్యవసాయ పద్ధతులు, సస్య రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు అనితర సాధ్యమైన ర్యాంకులు పొంది, అత్యున్నత స్థానాన్ని అలంకరించి కళాశాలకే వన్నె తెచ్చారు. సినిమా వంటి కళా రంగాల్లో రాణించి కళామతల్లి ముద్దుబిడ్డలనిపించుకున్నారు. రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విభిన్న రంగాల్లో విశేషంగా కృషి చేసిన మహోన్నతులకు కేంద్ర ప్రభుత్వం బహూకరించే పద్మశ్రీ పురస్కారాలను ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులైన డా.ఎన్.జి.పి. రావు, డా. ఎస్.వి.ఎస్.శాస్త్రి, డా. ఐ.వి.సుబ్బా రావు గార్లు పొంది, కళాశాల వైభవాన్ని పరిమళింపజేశారు.
అంతేకాకుండా పూర్వ విద్యార్థులైన డా.ఎన్.జి.పి.రావు, డా.జి.ఎల్.కౌల్, డా. ఏ. పద్మరాజు, డా.ఐ.వి.సుబ్బారావు మరియు డా.ఏ.విష్ణువర్ధన్ రెడ్డి గార్లు విశ్వ విద్యాలయ ఉప కులపతులై తమ విద్యా పీఠానికి చెరగని వన్నె చేకూర్చారు. ఈవిధంగా బాపట్ల వ్యవసాయ కళాశాల ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తూ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ దేశ విదేశాల్లో తన ఖ్యాతిని ఎగురవేస్తుంది. రైతు జన సంక్షేమమే ధ్యేయంగా అన్నదాతల సౌభాగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది.