మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యువతదే పైచెయ్యి. అయితే ఇదొకప్పటి మాట. నేడు గ్రామీణ ప్రాంత రైతులు సైతం సాంకేతికను వినియోగించుకోవడంలో ముందువరసలో ఉన్నారు. ఏ పంట సాగు చేయాలి, ఏ విత్తనాలు వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి తదితర విషయాలపై నేటి రైతాంగానికి కూడా మంచి అవగాహన ఉంది. వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతాయని వారు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం ఏటా రైతన్నలకు సబ్సిడీ ద్వారా ఆధునిక వ్యవసాయ యాంత్రిక పరికరాలను అందిస్తూ ఉంటుంది. దీంతో పొలం పనులు త్వరితగతిన సాగుతుండడంతో రైతులకు అదనపు శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది. అధునాతన వ్యవసాయ యంత్రాల వినియోగంతో తెలుగు రాష్ట్రాల్లో పంటల సాగు తీరు క్రమంగా మారుతోంది. కూలీల కొరత పెరుగుతున్నందున నవీన యంత్రాల కొనుగోలుకు, వినియోగానికి కొన్నిచోట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు కంపెనీలు పెద్దయెత్తున కొత్త యంత్రాలను తయారు చేస్తున్నాయి.
వరి కోత యంత్రం…ఒకప్పుడు వరిని కోతలకు పదుల సంఖ్యలో రైతుల అవసరం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ రైతులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వరిని కోసేందుకు పలు కంపెనీలు తమ సంస్థ నుంచి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వరి కోతలకు యంత్రాలను వాడుతున్నచోట కోత అనంతరం పొలంలో గడ్డి ముక్కలు ముక్కలుగా పడుతుంది. రైతులు పొలంలోనే తగలబెట్టేస్తున్నారు. దీంతో కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి గడ్డిని మోపులుగా చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. గుండ్రంగా.. బేళ్లు మాదిరిగా గడ్డిని కట్టలు కడుతుంది. ఈ యంత్రం ఖరీదు దాదాపుగారూ.3.30 లక్షల వరకు ఉంది. గంటా ఇరవై నిమిషాల సమయంలో ఎకరా విస్తీర్ణంలో మోపులు తయారు చేస్తుంది.
చెరుకును కత్తిరించే యంత్రం..సంప్రదాయ చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. మారిన పరిస్థితుల్లో కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కూలీ రే ట్లు రైతుకు గుదిబండగా మారుతుంది. సరైన సమయంలో చెరకు గడలను కత్తిరించి మిల్లుకు చేరవేస్తేనే చక్కెర శాతం అధికంగా వస్తుంది. అలాగే గడ కింది భాగంలో చెరకు రసం అధికంగా ఉంటుంది. అయితే కూలీలు అంత వరకు కత్తిరించలేరు. ప్రస్తుతం గడను కింది వరకు కత్తిరించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చిన్న ముక్కలుగా చేస్తాయి వెంటనే మిల్లుకు తరలించుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. * ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో యంత్రం ధర రూ. 95 లక్షల వరకు ఉంది. రైతులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి రాయితీ ద్వారా పొందే అవకాశం ఉంది.
మందుల పిచికారీ యంత్రం… రెండువైపులా రెక్కలు విప్పుకుని సుమారు ఇరువైపులా ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేసే యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. 10 నిమిషాల వ్యవధిలోనే ఎకరం తోటలో పురుగుల మందు పిచికారి చేస్తుంటాయి. పురుగుమందు పోస్తే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉండదు. ఈ యంత్రం ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది.. అదేవిధంగా రైతులు డ్రోన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే ఉపయోగించే డ్రోన్ల వాడకం నేడు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది.
#AgricultureEquipment #FarmerBenefits #AgricultureLatestNews #EruvaakaDailyUpdates