క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహార పంట . ప్రస్తుతం పాశ్చత్య దేశాలలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహారంగా మంచి గిరాకి ఉన్న పంట. ఈ పంటలో 14 -18 % మాంసకృత్తులు, లైసిన్ మరియు మిధియోనైన్ అనబడే అరుదైన అమైనో ఆమ్లాలు ,విటమిన్లు బి & ఇ, సూక్ష్మపోషకాలైన ఇనుము , కాల్షియం,మెగ్నీషియం మరియు పీచు పదార్దం కలవు. క్వినోవా వెడల్పాటి ఆకులు గల ఏక వార్షిక ఆహార పంట. ఈ పంట సుమారు 1 – 1.5 మీ.ఎత్తు పెరుగుతుంది. క్వినోవాను ప్రధానంగా విత్తనం కొరకు సాగుచేస్తారు. వీటి విత్తనాల్లో మంచి పోషక విలువలు ఉన్నప్పటికి ,విత్తన పై పొరలో “సాపోనిన్లు “ ఉండటం వలన చేదు రుచి వస్తుంది. కావున విత్తనపై పొరను తప్పనిసరిగా తొలగించాలి.
క్వినోవా విత్తనాలకు ఇప్పుడు ఇప్ప్పుడే మనదేశంలో కూడా డిమాండ్ ఉంది. కావున ఈ పంటసాగులో కొన్ని మెళకువలు పాటించవలసిన అవసరం వుంది.
విత్తన సమయం:- సాధారణంగా క్వినోవా పంట పూత దశలో చల్లటి వాతావరణం ఉండాలి. కావున ఈ పంటను యాసంగిలో నీటి వసతి క్రింద అక్టోబరు మొదటి పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. పంట పూత మరియు విత్తనం ఏర్పడే సమయంలో వర్షాలకు గురైతే దిగుబడి మరియు నాణ్యత గణనీయంగా తగ్గుతుంది.
నేలలు:- ఈ పంటను ఎర్రనేలలు, నీరు ఇంకే మరియు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు . చౌడు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం కావు .
విత్తన మోతాదు:- ఎకరానికి 1 – 1.5 కిలోలు , విత్తేటప్పుడు విత్తనం మరియు సన్నని ఇసుక 1:3 నిష్పత్తిలో కలిపి విత్తుకోవాలి .
విత్తే పద్ధతి:- ఈ పంటను నేరుగా వెదజల్లె పద్దతిలో విత్తుకోవచ్చు లేదా నారుమడి తయారు చేసుకొని 21 – 25 రోజుల మొక్కలను నాటవచ్చు. వరుసల మధ్య 45 సె.మీ ,మొక్కల మధ్య 20 సె.మీ దూరం పాటించాలి .
ఎరువులు:- ఎకరానికి 50 కిలోల నత్రజని , 20 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వెయ్యాలి. నత్రజని ఎరువు సగం మోతాదు విత్తేటప్పుడు ,మిగతా సగం 35 – 40 రోజుల దశలో వెయ్యాలి.
నీటి యాజమాన్యం:- క్వినోవా సాగుకు 350 – 400 మి.మీ నీరు అవసరం అవుతుంది. కావున పంటకాలంలో నేలను బట్టి 4 – 5 తడులు ఇవ్వాలి. పూత దశలో గింజ కట్టే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.
సస్య రక్షణ :- ఆకు తొలిచే పురుగు మరియు పూత దశలో రెల్ల రాల్చే పురుగు ఆశిస్తే మోనో క్రోటోఫాస్ 2.0 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి. రసం పీల్చు పురుగులు ఆకులపైన, కాడల పైన ఉదృతి ఎక్కువైతే,డైమిదోమేట్ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.
పంట కోత & నూర్పిడి:- ప్రాంతాన్ని బట్టి క్వినోవా రకాలు 80 – 120 రోజుల్లో కోతకు వస్తాయి. కోత సమయానికి మొక్కలు ఆకులు ఎండి పొలంలోనే రాలిపోతాయి.ఆ తర్వాత పంటను కోసి నూర్పిడి చేసుకొని గింజలు వేరు చేసుకోవాలి. విత్తనాల పై పొరను తొలగించుకోవడానికి ప్రత్యేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరానికి సుమారుగా 6 – 8 క్వింటాళ్ళ దిగుబడి నమోదు కాబడినది. మార్కెటింగ్ కొరకు వ్యాపారులను సంప్రదించి ఒప్పందం ఉన్నచో ఈ పంటసాగు లాభదాయకం.
డి. స్రవంతి , పి . లక్ష్మణ్ రావు , పి .నీలిమ , డా .పి శ్రీలత , కె .గోపాల కృష్ణ మూర్తి , ఎస్. మధుసూదన్ రెడ్డి మరియు డా . యం. మాధవి , వ్యవసాయ కళాశాల , ఆశ్వారావు పేట