చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

పొగాకులో పురుగుల యాజమాన్యం – సమగ్ర సస్య రక్షణ

0

పొగాకులో పురుగుల యాజమాన్యం

ప్రపంచంలో పండించే వాణిజ్య పంటల్లో పొగాకు ఒకటి. దీని ద్వారా ప్రభుత్వానికి మంచి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. కొన్ని రకాల లద్దె పురుగులు పొగాకును నారుమడి లోనూ మరియు ప్రధాన పొలంలోనూ ఆశించి నష్టము కలిగిస్తాయి. వాటి వివరాల్లోకి వెళ్లితే….

నారుమడిలో ఆశించే పురుగులు

  1. పొగాకు లద్దె పురుగు: దీని పేరే పొగాకు లద్దె పురుగు. అంటే ఇది పొగాకు పంటను బాగా ఇష్టపడుతుంది. ఇది పొగాకు నారుమడిలోను మరియు ప్రధాన పొలంలోనూ ఆశిస్తుంది. తొలి దశలోని లద్దె పురుగులు లేత ఆకు పచ్చ రంగులో నల్లని తల కలిగి ఉంటుంది. బాగా పెరిగిన లద్దె పురుగులు సిమెంట్ రంగు లేదా కాఫీ రంగులో తెల్లని V ఆకారం కలిగిన మచ్చను తల ముందు భాగంలో కలిగి ఉంటుంది. ఈ లద్దె పురుగులు ఆకు ఈనెల వెంబడి కొరికి తింటాయి. అంతే కాకుండా నారుమడిలోని చిన్న మొక్కల కాండం ను కత్తిరిస్తాయి. ఈ లద్దె పురుగు వలన 80-100% వరకు నష్టం కలుగుతుంది.

సమగ్ర సస్య రక్షణ

  • నారుమడి వేసే ప్రదేశాన్ని వేసవిలో లోతు దుక్కులు చేయాలి. దీని వలన భూమిలోని కోశస్థ దశలు ఎండ వేడికి చనిపోతాయి.
  • నారుమడి వేయటానికి 15 రోజుల ముందు ఆముదం విత్తనాలను నారుమడి చుట్టూ విత్తుకోవాలి. ఈ విధంగా చేయటం వలన పొగాకు లద్దె పురుగు ఆశించే సమయానికి పెరిగిన ఆముదం మొక్కలకి ఆడ రెక్కల పురుగులు ఆకర్షింపబడి గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల సముదాయాలు మరియు తొలి దశ లద్దె పురుగులు కలిగిన ఆకులను సేకరించి ధ్వంసం చేయాలి.
  • విత్తనం మొలకెత్తిన 2 వారాల తరువాత ఎకరాకు నాలుగు లింగార్షక బుట్టలు అమర్చాలి. ఒక లింగార్షక బుట్టలో 5 మగ రెక్కల పురుగులు కనుక పడితే 1% వేప గింజల కషాయంను 3 వారాల వయస్సు గల పొగాకు మొక్కల మీద పిచికారి చేయాలి. 2% వేప గింజల కషాయంను 4 వారాల వయస్సు గల పొగాకు మొక్కల మీద పిచికారి చేయాలి

వేప గింజల కషాయం తయారీ

10 లీటర్ల 1% వేప గింజల కషాయం తయారీకి 100 గ్రా. వేప గింజల పొడిని గుడ్డలో కట్టి 10 లీటర్లు నీరు కలిగిన గిన్నెలో ఉంచి 15 నిమిషాల పాటు పిండాలి. ఈ ద్రావణాన్ని నేరుగా పొగాకు మొక్కల మీద పిచికారి చేయవచ్చు. 10 లీటర్ల 2% వేప గింజల కషాయం తయారీకి 200 గ్రా. వేప గింజల పొడిని తీసుకోవాలి.

  • ఒక హెక్టారుకి 50 లీటర్ల 1% వేప గింజల కషాయంను 3 వారాల వయస్సు గల మొక్కల మీద, 60 లీటర్ల 2% వేప గింజల కషాయంను 4 వారాల వయస్సు గల మొక్కల మీద పిచికారి చేయాలి.
  • ఒక హెక్టారుకి 250 ఎన్.పి.వి ఆశించిన లార్వాలను 250 గ్రా. బియ్యపు పిండి లేదా గంజి పొడికి కలిపి 1125 లీటర్ల ఎన్.పి.వి. వైరస్ ద్రావణం తయారు చేసి సాయంత్రం వేళలో పిచికారి చేయాలి లేదా 1.0 కిలో బి.టి. ని 1125 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ఒక చదరపు మీటరుకి పొగాకు లద్దె పురుగు ఆశించిన మొక్కలు 6 కి మించితే ఈ క్రింది మందులను నారుమడి విత్తిన 4 వారాల తరువాత పిచికారి చేయాలి:

ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. @10 లీటర్లకి 5 గ్రా. చొప్పున పిచికారి చేయాలి.

నొవాల్యురాన్ 10 ఇ.సి. @10 లీటర్లకి 10 మి.లీ. చొప్పున పిచికారి చేయాలి.

విషపు ఎర

  • తుఫాన్ వాతావరణం ఉన్నప్పుడు,25 గ్రా. బెల్లంను 12.5 లీటర్ల నీటిలో కలిపి, దానికి క్లోరిపైరిఫాస్ 20% 2 లీటర్ల కలిపి తరువాత 25 కిలోల తవుడును నెమ్మదిగా కర్రతో తిప్పుతూ కలపాలి. ఈ ఎరను చిన్న చిన్న ముద్దలుగా చేసి సాయంత్రం వేళలో నారుమడిలో చల్లాలి.
  1. కాండం తొల్చు పురుగు

చిన్న గొంగళి పురుగులు కాండం లోనికి చొచ్చుకి పోయి లోపలి కణ జాలంను తింటుంది. దీని వలన కాండం ఉబ్బుతుంది. దీని వలన మొక్క పెరుగుదల తగ్గుతుంది మరియు కొమ్మలు అధికంగా వస్తాయి. ఈ పురుగు కూడా ఎక్కువగా నారుమడిలో ఆశిస్తుంది.

            నివారణ

  • కాండం తొల్చు పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
  • నారుమడిలో పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఫ్లూబెండమైడ్ 48 ఎస్.సి.ని 10 లీటర్ల నీటికి @5 మి.లీ. చొప్పున విత్తనం మొలకెత్తిన 30 మరియు 40 రోజులకి పిచికారి చేయాలి. ఆఖరి పిచికారి నారుమడి నుండి మొక్కలను పీకే ముందు చేయాలి.
  • ప్రధాన పొలంలో ఫ్లూబెండమైడ్ ను 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో నాటిన 15 రోజుల నుండి పిచికారి చేయాలి. కోతల అయిన తరువాత పురుగు ఆశించిన మొక్కలను పీకి తగుల బెట్టాలి.

 

  1. తెల్లదోమ

తెల్లదోమ చిన్న ఈగ మాదిరిగా ఉండి ఆకు అడుగు భాగాన నివశిస్తాయి. మొక్కను తట్టినప్పుడు అవి ఎగిరి పోతాయి. తల్లి పురుగులు ఆకునుంచి రసాన్ని పీల్చి ఆకు ముడత అనే వైరస్ తెగులును వ్యాప్తి చేస్తుంది.

నివారణ

  • నారుమడి చుట్టు ఉన్న ఆతిధ్య మొక్కలను పీకి నాశనం చేయాలి.
  • పసుపు రంగు జిగురు పూసిన రేకులను (20 సెం. X 15 సెం. ఇనుప రేకు మీద పసుపు రంగు వేసి దాని మీద ఆముదం పూయాలి) ఎకరాకు 5 చొప్పున అమర్చాలి.
  • ఒక రేకుకి దాదాపు 100 తెల్లదోమ అతుక్కుంటే ఈ క్రింది మందులను 10 రోజుల వ్యవధిలో మొలకెత్తిన 4 వారాల తరువాత పిచికారి చేయాలి.

ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్. ఎల్. @ 10 లీటర్ల నీటికి  2.5 మి.లీ. చొప్పున పిచికారి చేయాలి లేదా

థయోమితాక్సమ్ 25 డబ్ల్యు.జి. @ 10 లీటర్ల నీటికి  2 గ్రా. చొప్పున పిచికారి చేయాలి

 

ప్రధాన పొలంలో ఆశించే పురుగులు:

  1. పొగాకు లద్దె పురుగు: ప్రధాన పొలంలో ఈ పురుగు చేను అంచుల్లో ఉన్న చాళ్లలో కనిపిస్తుంది. ఆడ రెక్కల పురుగు సుమారు 2000 గ్రుడ్లు ఆకు అడుగు భాగాన గుంపులు గుంపులుగా పెడుతుంది. గ్రుడ్లు పెట్టిన 2-3 రోజుల్లో తొలి దశ పురుగులు తయారవుతాయి. అవి ఆకుని తింటాయి. భాగా ఎదిగిన పురుగులు ఆకు మీద రంధ్రాలు చేసి 10-15% నష్టం కలుగ చేస్తుంది.

నివారణ

  • ఒక హెక్టారుకి 10 లింగాకర్షక బుట్టలు నాటిన 20 రోజుల తరువాత అమర్చాలి.
  • ఆకుల పై గ్రుడ్ల సముదాయాలు ఉంటే ఆకులను సేకరించి నాశనం చేయాలి.
  • ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో 0.5% వేప గింజల కషాయం లేదా ఎన్.పి.వి. 250 ఎల్.ఇ. ని 250 గ్రా బియ్యపు పిండి లేదా గంజి పొడి ని 1125 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా

ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. @10 లీటర్ల నీటికి 5 గ్రా. చొప్పున పిచికారి చేయాలి.

నొవాల్యురాన్ 10 ఇ.సి. @10 లీటర్లకి నీటికి 10 మి.లీ. చొప్పున పిచికారి

  1. తెల్ల దోమ

తెల్ల దోమ ఆకు ముడత వైరస్ తెగులును వ్యాప్తి చేస్తుంది. ఆకులు బాగా ముడుచుకుపోయి, దళసరిగా ఉండి, ఆకు ఈనెలు కూడా ప్రముఖుంగా కనిపిస్తాయి. మొక్కల పెరుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది.

 

నివారణ

  • ఆకు ముడత ఆశించిన నారుని నాటరాదు
  • ఆతిధ్య మొక్కలను నాశనం చేయాలి.
  • వంగ, ప్రొద్దుతిరుగుడు పంటలను పొగాకు పంటకు దగ్గరలో వేయరాదు.
  • నాటిన ఒక నెల తరువాత ఆకు ముడత ఆశించిన మొక్కలు 2% కంటే తక్కువగా ఉంటే, వాటిని పీకి నాశనం చేయాలి.
  • ఒక హెక్టారుకి 12 పసుపు రంగు పూసిన రేకులను పెట్టి తెల్ల దోమ ఉధృతిని గమనించాలి.

తెల్ల దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే నారుమడిలో పిచికారి చేసే మందులను పిచికారి చేయాలి. హై వాల్యూమ్ (అధిక ఘనపరిమాణంగల) స్ప్రేయర్ తో  సాయంత్రం వేళలో చుట్టూ ప్రక్కల ఉన్న పొగాకు పంట మీద నాటిన 10 రోజుల తరువాత పిచికారి చేయాలి.

  1. పొగాకు పేనుబంక

పేను బంక ఆకు పచ్చని లేదా గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు వందల సంఖ్యలో ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పిలుస్తాయి. మొక్కలు ఆకు పచ్చ రంగును కోల్పోతాయి, గిడసబారి పోతాయి. ఇవి తేనె వంటి జిగురు పధార్ధాన్ని విసర్జిస్తాయి. దీని వలన మసి తెగులు ఆశిస్తుంది. ఆకులు నాణ్యత తగ్గుతుంది. అంతే కాకుండా గుబురు తెగులును వ్యాప్తి చేస్తుంది.

నివారణ

  • చలి కాలం మొదట్లో 2% మొక్కలకు పేను బంక ఆశిస్తే 10 లీటర్లకి నీటికి ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్.ఎల్. 5 మి.లీ.చొప్పున లేదా థయోమితాక్సమ్ 25 డబ్ల్యూ.జి. 2గ్రా చొప్పున పిచికారి చేయాలి
  • చలి కాలం దాటిన తరువాత పేనుబంక ఆశిస్తే, ఆశించిన మొక్కల మీద మాత్రమే 8-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. పిచికారికి కోతకి మధ్య ఒక వారం వ్యవధి ఉండాలి. దీని వలన పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉంటుంది. పిచికారి సాయంత్రం వేళలో చేయాలి.

పూత పురుగు (శనగ పచ్చ పురుగు)

గోధుమ రంగు లేదా ఆకు పచ్చ రంగులోని పురుగు పూత లోనికి చొచ్చుకొని పోయి లోపలి విత్తనాలు తింటుంది. ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు మొక్క పై భాగంలోని ఆకులను కూడా తింటుంది. అధిక వర్షాలు పడిన తరువాత డిసెంబర్ మాసంలో తలలు తుంచని పొలాల్లో దీని ఉధృతి గమనించ వచ్చు. ప్రధాన పొలంలో నారు నాటిన 30 రోజుల తరువాత పొగాకును ఈ పురుగు ఆశిస్తుంది. సాధారణంగా మొగ్గకి ఒక పురుగు ఉంటుంది. నాటిన 30-50 రోజుల తరువాత పూ మొగ్గాలను తింటుంది ఆ తరువాత లేత ఆకులను తిని నష్టం కలుగ చేస్తుంది. పూత విచ్చు కున్న తరువాత మొక్కకి ఒకటి కంటే ఎక్కువ పురుగులు ఉంటాయి. అవి అభివృద్ధి చెందుతున్న విత్తనాలను తింటాయి.

 

నివారణ

  • 3-4 రోజులకొకసారి గొంగళి పురుగులను చేత్తో ఏరి నాశనం చేయాలి.
  • తలలు తుంచటం వలన ఈ పురుగును నిర్మూలించవచ్చు.
  • తలలు తుంచని పొలాల్లో ఫ్లూబెండమైడ్ 480 ఎస్.సి. 10 లీటర్ల నీటికి 2.5 మి.లీ చొప్పున లేదా ఒక హెక్టారుకి 1125 లీటర్ల నీటికి హెచ్.ఎన్.పి.వి @ 250 ఎల్.ఇ. లేదా బి.టి. @5 కిలో కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. ఎన్.పి.వి ద్రావణం కి 250 గ్రా. గంజి పొడి కలిపి సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.

పొగాకు పంట మీద పురుగు మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పొగాకు ను ఎగుమతి చేసుకొనే దేశాలు పరిమిత స్థాయిలో పురుగు మందుల అవశేషాలు ఉన్న సరుకును మాత్రమే స్వీకరిస్తాయి. పొగాకు పెంచే దేశాలలో డి.డి.టి మరియు ఇతర క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ పురుగు మందులను పొగాకు మీద పిచికారికి నిషేధించాయి. పురుగు మందులను విచక్షణరహితంగా పిచికారి చేయరాదు.

  • పొగాకు పంట మీద వాడ దగిన పురుగు మందులు: ఇమామేక్టిన్ బెంజోయెట్, ఇమిడాక్లోప్రిడ్, థయోమితాక్సమ్, ఫ్లూబెండమైడ్, వేప గింజల కషాయం, గానుగ పొడి, వేప పిండి, ఎన్. పి. వి. ద్రావణం, బి.టి.
  • పొగాకు పంట మీద నిషేధించబడిన పురుగు మందులు: మోనోక్రోటోఫాస్, డైమితోయేట్, క్వినాల్ ఫాస్, ఫాస్ఫమిడాన్, డెయియాల్ద్రిన్, డి.డి.టి., ఆక్సీ డెమాటన్ మిథైల్, ప్రొఫెనొఫాస్, పారాథియాన్, బి.హెచ్.సి., లిండేన్, పారమార్
  • సిఫార్సు చేసిన పురుగు మందులను సిఫార్సు చేసిన మోతాదులో అవసరాన్ని బట్టి (నష్ట పరిమితి స్థాయిని బట్టి) మాత్రమే పొగాకు మీద పిచికారి చేయాలి.
  • పొడి రోపంలో ఉన్న పురుగు మందులను పొగాకు మీద వాడరాదు
  • నిషేధించ బడిన పురుగు మందులు పొగాకుతో పంట మార్పిడి చేసి పంటల మీద మరియు చుట్టూ ఉన్న పంటల మీద కూడా పిచికారి చేయరాదు.
  • అతి చిన్న రంధ్రాలు (చిన్న జల్లు గా వచ్చే) నోజిల్ కలిగిన సికార్ స్ప్రేయర్ ను ఉపయోగించాలి.

 

డా. బి. రత్న కుమారి (Rathna Kumari)

సెంట్రల్ టొబాకో రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థ) శాస్త్రవేత్త, సస్యరక్షణ , కె.వి‌.కె. నెల్లూరు.

Leave Your Comments

చెరకు పంటలో బిందు సేద్యం ఆవశ్యకత

Previous article

ఏపీ రైతులకు శుభవార్త : ఇక వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థ – ఆర్బీకేలు (RBK) పగలంతా తెరిచుండేలా

Next article

You may also like