వ్యవసాయ వాణిజ్యం

వరిలో చీడపీడలు- యాజమాన్యం

0

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైన పంట. ఈ పంటను ఖరీఫ్‌, రబీ కాలంలో పండిస్తారు. వరి పైరును ఖరీఫ్‌లో 28.03 లక్షల హె., రబీలో సుమారుగా 15.8 లక్షల హె. సాగు చేస్తున్నారు. వరిలో అధిక దిగుబడి సాధించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా వరి పైరును ఆశించిన పురుగులు, తెగుళ్ళపై అవగాహన పెంచుకోవాలి. ఈ చీడపీడలు ప్రధానంగా దిగుబడిపై ప్రభావం చూపడమే కాకుండా నాణ్యతపై కూడా ప్రభావాన్ని చూపెడతాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తికి పండించే వరిలో గింజ నాణ్యత అత్యంత ప్రధానం కనుక విత్తనోత్పత్తిలో చీడపీడల యాజమాన్యం అత్యంత కీలకంగా మారుతుంది.

వరి పైరునాశించు చీడపీడలు :

1. ఉల్లికోడు, 2. కాండం తొలిచే పురుగు (మొగపురుగు / తెల్ల కంకి), 3. ఆకుముడత, 4. తాటాకు తెగు లు (హిస్పా తెగులు) 5. వరి ఈగ, 6. సుడిదోమ (మసిపేను / దోమ), 7. కంకినల్లి, 8. కంపునల్లి, 9.ఆకునల్లి, 10. రెల్లరాల్చు పురుగు.

తెగుళ్ళు :

1. అగ్గి తెగులు / మెడ విరుపు తెగులు, 2. పాముపొడ తెగులు, 3. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, 4. కాండం కుళ్ళు తెగులు, 5. పొట్టకుళ్ళు తెగులు, 6. మానిపండు తెగులు (పసుపు ఉండలు).
పైన పేర్కొన్న పలు రకాల పురుగు, తెగుళ్ళు కలుగ చేసే నష్ట లక్షణాలను తొలిదశలోనే గుర్తించే పద్ధతి ప్రకారం పంట తొలిదశ నుండే వివిధ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలి.

సమగ్ర సస్యరక్షణ పద్ధతులు :

  • పురుగులు, తెగుళ్ళను తట్టుకొనే రకాలను మాత్రమే సాగుచేయాలి. ఉదా: ఉల్లికోడును తట్టుకునే జెజియల్‌ లేదా డబ్ల్యు.జి.యల్‌. రకాలు, దోమను తట్టుకొను యమ్‌.జె.యు. 1001,1010 లాంటి రకాలను ఎన్నుకోవాలి.
  • విత్తన శుద్ధి తప్పక పాటించాలి. 1 కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్‌ (దుంప నారుమళ్ళు) లేదా 3 గ్రా. / 1 కి. (మెట్ట నారుమళ్ళు) విత్తనానికి విత్తనశుద్ధి చేయాలి.
  •  పంట కోసిన వెంటనే పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి.
  • నారుమడిలో సస్యరక్షణ చర్యలు పాటించాలి. నారుమడిలో విత్తిన 7-10 రోజులకు నారు పీకడానికి 10 రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ గుళికలు వేయాలి.
  • నాటు వేసే ముందు ప్రతి 2 మీ. 20 సెం.మీకు ఖాళీ బాటలు తీయాలి.
  • మొగి పురుగు, ఆకుముడత లాంటి పురుగు ఉనికిని తెలుసుకోవడానికి ప్రధాన పొంలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.
  • కీడు చేసే మిత్రపురుగు (కనీసం 2:1) ఉన్న ఎడల మిత్ర పురుగులకు హాని జరుగకుండా పురుగు మందులు పిచికారి చేయరాదు.
  • కొన్ని రకాల చీడ పీడలు ముఖ్యంగా దోమ కాండం కుళ్ళు లాంటి నివారణకు పొలాన్ని అప్పుడప్పుడూ ఆరబెడుతూ నీటి తడులివ్వాలి.
  • పొలాన్ని వీలైనంత నేలకు దగ్గరగా కోయాలి. తద్వారా మొగిపురుగు సమర్ధవంతంగా నివారించబడుతుంది.
  • ఎకరాకు 20 వేల చొప్పున నాటిన 30-45 రోజులకు 3 సార్లు ట్రైకోగ్రామా పరాన్న జీవులను విడుదల చేయాలి.
  • పొలం గట్లపై, పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి.
  •  ఎరువును సమపాళ్ళలో వాడాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును సిఫారసు మేరకు దఫదఫాలుగా వేయాలి.
  • పైన వివరించిన అన్ని పద్ధతులను ఆచరించినప్పటికీ చీడపీడల ఉధృతి తగ్గనప్పుడు మాత్రమే పురుగు మందు పిచికారి చేయాలి.
Leave Your Comments

పత్తిలో సమస్యాత్మక కలుపు- వయ్యారిభామ, తుత్తురబెండ

Previous article

వ్యవసాయ పరిణామ క్రమం ఏరువాక ఆవిర్భావం

Next article

You may also like