మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

పాలిహౌస్‌లను వేధిస్తున్న నులి పురుగుల బెడద

0

 

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పదం ‘‘పాలిహౌస్‌’’ సాగు. పాలిహౌస్‌లో ఉన్న వాతావరణం మొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు కావల్సిన ప్రోత్సాహం ఇస్తుంది. ఈ పాలిహౌస్‌లో పెంపకానికి అనువైన పూల మొక్కలు, కార్నేషన్‌, జర్బెరా మరియు గులాబి, కూరగాయ పంటలైన టమాట, మిరప, కూరమిరప, కీర వంటి పంటలను వాణిజ్యపరంగా సాగుచేసి అధిక దిగుబడులను, ఆదాయాన్ని రైతులు పొందుతున్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా పాలిహౌస్‌ సాగు రైతులకు ఎన్నో రాయితీలను ఇస్తూ క్రమక్రమంగా సాగు విస్తీర్ణం పెంచే విధంగా ప్రోత్సహిస్తుంది. తద్వారా రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలను, పూలను ఇక్కడే సాగు చేసుకోవాలని ప్రభుత్వ ఉద్ధేశం. అయితే పాలీహౌస్‌ సాగు ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా సస్యరక్షణ విషయంలో సస్యరక్షణ పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలీహౌస్‌ బయట వాడే సస్యరక్షణ పద్ధతులతో పాలీహౌస్‌ లోపలి చీడపీడలను అదుపు చేయాలి.

సంఖ్య భారీస్థాయిలో పెరుగుతుంది కనుక ప్రస్తుతం పాలీహౌస్‌ పూలు మరియు కూరగాయల సాగులో ముఖ్య సమస్య నులిపురుగులు. పాలీహౌస్‌  బెడ్స్‌లో మట్టి మిశ్రమం నిరంతరం ఎక్కువ తేమను కలిగి ఉంటుంది, నీడ ఉండడంతో నులిపురుగుల పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడి 90 శాతం వరకు దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఆరుబయట పొలాల్లో సాగు చేసే పూలు, కూరగాయల పంటలకు పాలీహౌస్‌లో నులిపురుగుల బెడద తీవ్రంగా ఉంటుంది.

నులిపురుగులు ఆశించిన పంట లక్షణాలు :

  • ఆకులు పసుపు రంగుకు మారడం.
  •  ఆకులు ఎండి రాలిపోవడం
  • మొక్కల ఎదుగుదల లోపించి పూత, పిందెకు రాకపోవడం
  • కొద్ది కాలంలో బెడ్స్‌ అంతా వ్యాపించి అన్ని మొక్కలు వడలి ఎండిపోవడం
  • వడలిన మొక్కలు పీకి చూసినట్లయితే, పూసలు బుడిపెల మాదిరిగా ఎత్తైన, ఉబ్బిన ప్రాంతాలు వేరువ్యవస్థలో వృద్ధి చెంది ఉండడం.
  • లక్షణాలు పోషకాల లోపల మరియు నీటి ఎద్దడికి గురైన పంట లక్షణాలను పోలి ఉండడం.

నిర్ధారణ :

రంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌ ప్రాంతాల్లో పైలక్షణాలతో చనిపోయిన పంటను పరిశీలించిన జాతీయ వృక్ష ఆరోగ్య యాజమాన్య సంస్థ వారు పాలీహౌస్‌ల్లో ‘‘లీటన్‌ నెమటోడ్‌’’ అనే కొత్త విదేశీజాతి నులిపురుగుగా గుర్తించారు.

యాజమాన్యం :

  • బెడ్స్‌ వేసేటప్పుడు నేలను స్టెరిలైజ్‌, సూక్ష్మీకరించడం చేయాలి.
  • కార్బోఫ్యూరాన్‌ గుళికలు చల్లాలి.
  • బెడ్స్‌పై తగు మాత్రం తేమ ఉండేలా చూడాలి.
  • జీవన ఎరువుల్లో కలిపిన లేదా జీవన ఎరువులు పెంచిన పశువుల ఎరువు, వానపాముల ఎరువు, వేప పిండిని మొక్కలు వేయకముందే బెడ్స్‌పై చల్లాలి.
  • పంట వేసే ముందు బంతి పంటను వేయడం, కలియదున్ని మరియు బెడ్స్‌ తయారుచేయాలి.

జీవన ఎరువులతో నిండిన వేప చెక్క తయారీ విధానం :

  • నూనె తీసిన 1000 కిలోల వేపచెక్క ఒక పాలిథీన్‌ షీట్‌పై, సిమెంట్‌ నేలపై నీడలో వేయాలి.
  • 4 కిలోల పాసిలోమైసిస్‌ లిలాసియమ్‌, 4 కిలోల ట్రైకోడెర్మా విరిడి మరియు 4 కిలోల సుడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ నాణ్యమైన జీవన శిలీంద్ర ఎరువులను నీటిని చల్లుకుంటూ వేపచెక్కకు కలపాలి.
  •  నీడలో ఈ మిశ్రమాన్ని 20 రోజుల వరకూ ఉంచాలి.
  •  మధ్యలో 4 – 5 రోజులకొకసారి నీటిని చల్లుతూ కలియబెట్టాలి.
  •  20 రోజుల తరువాత జీవన ఎరువు శిలీంధ్ర బీజాలు కల ఎరువును పొడి లాగా చేసి గోనెసంచుల్లో నింపి 6 నెలల వరకూ వాడుకోవచ్చు.
  •  ఈ మిశ్రమాన్ని 250  – 300 కిలోలను 50 – 60 కిలోల పశువుల ఎరువుతో కలిపి పాలిహౌస్‌లో బెడ్స్‌పై కలపాలి.
  • 10 కిలోల మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో నానబెట్టి 2 రోజుల తరువాత బెడ్స్‌ని తడపాలి
  •  ఈ మిశ్రమాన్ని నానబెట్టిన నీటిని వడకట్టి డ్రిప్‌పద్ధతిలో పంటకు అందించాలి. వడకట్టిన పిప్పిని బెడ్స్‌ పై పరచాలి.
  • ఈ విధంగా 10 రోజుల నుండి 75 రోజుల వరకు ప్రతి 10 రోజులకొకసారి డ్రిప్‌ పద్ధతిలో అందించాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో (20 రోజుల సమయం లేనప్పుడు) రెండు రోజుల్లో జీవన ఎరువులలో కూడిన వేపచెక్క తయారుచేసి లేదా నీటిలో నాననిచ్చి బెడ్స్‌ తడపడం ద్వారా 2 – 3 వారాల్లో నులిపురుగుల ఉధృతిని, నష్టాన్ని తగ్గించవచ్చు.

డా॥ బి.యస్‌ సునంద (Sunandha), భారతీయ వృక్ష ఆరోగ్య యాజమాన్య సంస్థ,

డా॥ పి. విజయలక్ష్మి (Vijayalakshmi), డా॥ వై.యస్‌.ఆర్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ,

నూజివీడు, ఫోన్‌ : 7382633652

Leave Your Comments

ప్లాస్టిక్ మల్చింగ్ యొక్క ప్రయోజనాలు – సమగ్ర యాజమాన్య పద్ధతులు

Previous article

ఆధునిక సేద్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నరంగారెడ్డి రైతులు పాలిహౌస్‌లలో  సాగుకు “సై” అంటున్న బడుగులు

Next article

You may also like