మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

Jaggery Making in Sugarcane: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు

0

Jaggery Making in Sugarcane: బాగా పక్వానికొచ్చిన చెఱకునే బెల్లం తయారీకి ఉపయోగించాలి. చెఱకును భూమట్టానికి నరికి, వెంటనే గానుగాడి బెల్లం చేసుకోవాలి. చచ్చిన, ఎలుకలు కొట్టిన, గాలి పెడలతో వచ్చిన పిలకల వంటి చెఱకులను ఏరివేసి, మంచ చెఱకులనే పయోగించి, బెల్లం చేయాలి. అనివార్యపరిస్థితుల్లో వెంటనే బెల్లం చేయలేకపోయినపుడు, చెఱకు మోపులను నీడలో గుట్టలుగా ఉంచి, చెఱకు చెత్తకప్పి, పలచగా నీరు చల్లితే చెఱకు తూకం, రస నాణ్యత తరుగుదల తక్కువగా ఉంటుంది. తక్కువ శక్తితో, ఎక్కువ రసపు దిగుబడికి గానుగల సామర్థ్యం పెంచేందుకు నిలుపు క్రషర్ల కంటే, అడ్డు క్రిషర్లు ఉపయోగించడం మంచిది. అడ్డు క్రషర్లు వాడి ఒక టన్ను చెఱకు నుండి 650 కిలోల రసం, 120 కిలోల బెల్లపు దిగుబడి పొందవచ్చు. ఫలితంగా ఒక టన్ను చెఱకు నుండి 200 నుండి 400 రూ||లు విలువగల 10-20 కిలోల బెల్లం అదనంగా పొందవచ్చు. రోలర్లపై ఉండే నొక్కులు పిప్పితో నిండి ఉండకుండా శుభ్రపరచాలి. ఒకే సమయంలో 2-3 చెఱకు గడలు మాత్రమే గానుగాడు కోవాలి. గానుగాడిన రసాన్ని పులిసి పోకుండా, త్వరగా పెనంలో పోసి మరగబెట్టాలి. బెల్లం తయారీలో ఉపయోగించే పరికరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెఱకు గానుగాడేటప్పుడు మధ్యలో కరెంటు పోవుట వలన, ఆడిన రసం పులియకుండా 1050 సెల్సియస్‌ వరకు మరిగించి పాకం చేసి, తర్వాత నిల్వ ఉంచి, బెల్లం చేసినా నాణ్యత తగ్గదు.

Jaggery Making in Sugarcane

Jaggery Making in Sugarcane

పెనాలు :

బెల్లం తయారీకి ఉపయోగించే పెనాలు వెడల్పుగా ఉండి(240-270 సెం.మీ.) లోతు తక్కువగా (45 సెం.మీ.) ఉండాలి. పెనంగోడలు 16 గేజి ఇనుపరేకుతోను, అడుగున 18 గేజి కళాయి రేకుతోను చేయడం మంచిది.

Jaggery Making

Jaggery Making

అనకాపల్లి పొయ్యి :

అనకాపల్లి పొయ్యిని ఉపయోగించి బెల్లం చేయుటకు తక్కువ ఇంధనం అంటే మరగబెట్టే రసం మీద షుమారు 37 శాతం ఆరిన చెఱకు పిప్పి, చెఱకు చెత్త అయితే 45 శాతం పంట చెఱకుగా కావాల్సి ఉంటుంది. ఒక పాకం అంటే 360 కిలోల రసం దించుటకు(మార్చిలో) షుమారు రెండుగంటలు పడ్తుంది. రసం త్వరగా మరుగుట వలన నాణ్యమయిన బెల్లం పొందవచ్చు. పొయ్యి ద్వారం దగ్గర రెండు చట్రాలు అమర్చబడి ఉండటంవలన, పొయ్యిలోని బూడిద తీసివేయుటకు వీలుగా ఉంటుంది. పొయ్యి మధ్యన గల అడ్డుగోడ వలన, పొయ్యిలోని వేడి, గొట్టం ద్వారా పైకి వృధాగా పోకుండా ఉంటుంది.

రసాన్ని శుభ్రపరచటం :

రసాన్ని శుభ్రపరచటానికి అమ్లస్థితిలో అంటే 5.2 ఉదజని సూచిక ఉన్న రసానికి సున్నం కలిపి, 5.8 వరకు తీసుకొని రావలసి ఉంటుంది. ఈవిధంగా చేయడానికి ప్రత్యేక ఉదజని సూచిక కాగితాలు ఉపయోగించాలి. సోడా కలిపితే, బెల్లం మెత్తబడి నాణ్యత దెబ్బతింటుంది. పక్వానికి వచ్చిన చెఱకు రసానికి ఉదజని సూచిక 5.8 వచ్చే వరకు, పక్వానికి రాని చెఱకు అయితే 6.4 వచ్చే వరకు, రసం విరిగిన చెఱకుకయితే 6.6 వచ్చే వరకు సున్నం కలిపి, మంచి బెల్లం తయారుచేయవచ్చు. బెండ మొక్కల గుజ్జు వంటి వృక్ష సంబంధమయిన పదార్ధములను, సున్నముతో కలిపి నాణ్యమైన బెల్లం తయారుచేసుకోవచ్చును.

బెల్లం తయారీలో హైడ్రోసువాడకుండుట :

హైడ్రోసులో గంధకం ఉంటుంది. ఒక క్వింటాల్‌ బెల్లంలో 7 గ్రాముల కంటే ఎక్కువ సల్ఫర్‌ డయోక్సైడ్‌ ఉంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 400 లీటర్ల రసానికి 100 గ్రాముల హైడ్రోసు వేసి తయారు చేసిన బెల్లంలో ఒక క్వింటాలుకి 7-12గ్రా. వరకు సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఉంటుంది. రైతులు ఎక్కువ పరిమాణంలో (1-2 కిలోలు) హైడ్రోసు వేసి తెల్లని బెల్లం చేస్తే, సల్ఫర్‌డైయాక్సైడ్‌ పరిమాణం ఉండవలసిన దానికన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హైడ్రోసు వేసిన బెల్లం రుచికి వెగటుగా ఉండి, రంగు 2-3 వారాలకు మించి ఉండక, త్వరగా మెత్తబడి, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వినియోగదారులు బెల్లం రంగుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నాణ్యతను గమనించాలి. హైడ్రోసు వాడిన బెల్లాన్ని ప్రోత్సహించకూడదు.

బెల్లం తోడుకోని పరిస్థితుల్లో పంచదార లేదా బెల్లపు పొడి కలపటం :

పక్వతకు రాని చెఱకు లేదా ఆలస్యంగా నరికిన చెఱకు లేదా నీటి ఎద్దడికిలోనైన చెఱకు లేదా పొలుసు పురుగు సోకిన చెఱకుల నుండి చేసిన బెల్లం తోడుకోనట్లైతే పాకం దించి, చిక్కబడిన తర్వాత 5-10 కిలోల బెల్లపు పొడి లేదా పంచదార కలిపితే, బెల్లం తోడుకొని అచ్చులు పోసుకోవడానికి వీలవుతుంది. బెల్లపు నాణ్యత పెరుగుతుంది.

బెల్లం వండటం : రసం మరిగేటప్పుడు, ఎప్పటికప్పుడు తెట్టును పూర్తిగా తీసివేయాలి. తెట్టును తీసివేసిన తర్వాత రసాన్ని మరిగించాలి. బురద పొంగు సమయంలో రసం పొంగుతుందనుకొంటే, నువ్వులనూనె చిలకరించాలి. పాకం ఉష్ణోగ్రత 1180 సెల్సియస్‌ వచ్చినపుడు పెనం దించాలి. పెనం దించిన తర్వాత చంద్రవంక బల్లతో బాగా కలిపి, కొంత చల్లారిన తర్వాత 5 నిమిషాలు కదపకుండా ఉంచితే, బెల్లం మంచి రవ్వకట్టు కలిగి ఉంటుంది. బెల్లం చల్లబడి, గట్టిపడడం ప్రారంభించగానే, వివిధ రకాల అచ్చుల్లో వేసుకోవచ్చు.

Jaggery  Making Procedure

Jaggery Making Procedure

బెల్లం నిల్వ చేయటం :

బెల్లాన్ని ఆరబెట్టి, గాదెల్లో నిల్వచేయవచ్చు. 100 కిలోల బెల్లం వరకు రైతుస్థాయిలో నిల్వ ఉంచవచ్చు. గాదె అడుగు భాగాన అప్పుడే కాల్చిన సున్నాన్ని తేమ పీల్చు పదార్ధంగా ఉంచి, బెల్లం నాణ్యత చెడకుండా సంవత్సరం పొడవునా నిల్వ చేయవచ్చు. బెల్లం గోదాముల్లో వెదురు బొంగులతో చేయబడిన అటకలపై బెల్లం ఉంచి, క్రింద అప్పుడే కాల్చిన సున్నాన్ని ఉంచి బెల్లం ఎక్కువ పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చు. కోల్డ్‌ స్టోరేజ్‌లలో కూడా బెల్లం నాణ్యత చెడకుండా నిల్వ ఉంచుకోవచ్చు.

ముక్కల రూపంలో బెల్లం తయారీబెల్లాన్ని చిన్నముక్కలుగా (50గ్రా., 200గ్రా., 500గ్రా., 1 కిలో క్యూబులు/బ్లాకులు) తయారు చేసి, ముక్కల రూపంలో బెల్లం చేయడం వలన, క్వింటాలుకు అదనంగా రూ.200 వరకు అంటే ఎకరం చెఱకు తోట నుండి వచ్చే షుమారు 4 టన్నుల బెల్లం నుండి రూ. 8,000 వరకు అదనంగా పొందవచ్చు.

Also Read:  బిందుసేద్యం చెరకు రైతుకి వరం

నాణ్యత, నిల్వ, ఎగుమతులకు పొడిరూపంలో బెల్లం : బెల్లపు పొడి మంచి పోషకపు విలువలు, నాణ్యతాప్రమాణాలు కలిగి ఉంటుంది. తక్కువ తేమ(2 శాతం) కలిగి ఉండడం వలన ఎక్కువ కాలం(2-3 సంవత్సరాల వరకు) నాణ్యత చెడకుండా నిల్వ ఉంటుంది. బెల్లపుపొడి ప్యాకింగులలో లభ్యమగుటవలన, వాడుకకు పరిశుభ్రంగాను, సౌకర్యంగాను మరియు ఎగుమతికి వీలుగా ఉంటుంది. పొడి రూపంలో బెల్లం చేయడం వలన, క్వింటాలుకు రూ. 500 వరకు అంటే ఎకరాకు వచ్చే షుమారు 3.75 టన్నుల బెల్లపుపొడి నుండి రూ. 18,750 వరకు అదనంగా పొందవచ్చు.

Jaggery

Jaggery

మంచిపోషకాహారపు విలువలు కలిగిన బెల్లపు పాకం :

బెల్లపు పాకంలో పంచదార(50 శాతం), గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌(20 శాతం), మాంస కృత్తులు (0.2శాతం), కాల్షియం(0.3 శాతం), మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం(0.3శాతం), ఇనుము (11మి.గ్రా./100 గ్రాములు), సిట్రిక్‌ ఏసిడ్‌, విటమిన్‌ ‘ఎ’ మరియు ‘బి’లు తగినంతగా ఉంటాయి. బెల్లపు పాకాన్ని ఎక్కువగా అల్పాహారంలో తియ్యటి పదార్ధంగా వాడుకోవచ్చు. బెల్లపు పాకాన్ని సీసాలలో పట్టి, భారీ స్థాయిలో మార్కెట్‌ చేయటానికి ఎక్కువ అవకాశం కలదు. ఎకరా చెఱకు తోట నుండి వచ్చే సుమారు 5 టన్నుల బెల్లపు పాకం నుండి, బెల్లపు దిమ్మల ద్వారా వచ్చు లాభం కన్న 2-3 రెట్లు అదనంగా లాభం పొందవచ్చు.

నిల్వకు, ఎగుమతులకు బూరుగుపల్లి బెల్లం ఎంతో అనుకూలం. బూరుగుపల్లి బెల్లం మంచి నాణ్యత, తక్కువ తేమ, ఎక్కువ గట్టిదనం కలిగి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

Also Read: చెఱకులో సూక్ష్మధాతు లోపాలు మరియు యజమాన్యం

Leave Your Comments

Ginger Cultivation: అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Previous article

Rabbit Farming: కుందేళ్ళ మేతలో యాజమాన్యం గుర్తుంచుకోవలసిన విషయాలు

Next article

You may also like