High Density Planting in Cotton: తెలంగాణలో “తెల్ల బంగారం” సాగు దాదాపు 30 లక్ష హెక్టార్లకు పైగానే సాగు చేస్తున్నారు. ఇది నెల రోజులు బెట్టకు గురైనా కూడా ఒక వర్షం పడితే కోలుకుని మంచి దిగుబడులు ఇవ్వగల మొండి పంట అందుకే దీనిని వర్షాధారంగా ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగల నల్ల రేగడి భూముల్లో సాగు చేస్తుంటారు.
Also Read: Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిసనింగ్ గురించి ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.!
పెరుగుతున్న కూలీల డిమాండ్, పత్తి తీతల ఖర్చు, పురుగు మందులపై పెట్టుబడి, గత కొన్ని సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు అధిక నష్టాలు కలుగజేస్తుండడం పత్తి సాగును ప్రశ్నార్థకం చేస్తున్నవేళ శాస్త్రవేత్తలు కొత్త సాగు పద్ధతులపైన దృష్టి సారించారు. దీని కారణంగా వెలుగులోకి వచ్చినదే అధిక సాంద్ర పత్తి సాగు విధానం. పత్తి తీత ఒకేసారికి పరిమతం చేయడం దీని ప్రధాన ఉద్ద్యేశ్యం. పత్తి యొక్క పంటకాలం తగ్గించడం కోసం, యాంత్రిక పద్దతిలో పత్తిని తీయడానికి అనువైన రకాలను ఒక యూనిట్ భూమిలో సాధారణం కంటే ఎక్కువ మొక్కలను సాగు చేయడం ద్వారా 15 నుండి 20 రోజుల వరకు పంట కాలం తగ్గుతుంది. గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ఆశించడానికి ముందే పంట కోతకు రావడం వలన పురుగు మందులు కొట్టడం రెండు సార్లు తక్కువ అవుతుంది, తద్వారా పురుగు మందుల మీద పెట్టుబడి కూడా తగ్గుతుంది.
ఈ పద్దతిలో సాధారణ పద్ధతికి భిన్నంగా సాలుకి సాలుకి మధ్య తగ్గించి ఎకరాకు 7000-8000 మొక్కలకు బదులు 24,000 నుండి 25,000-40,000 మొక్కలు నాటుతారు.అంటే సాధారణ పద్దతిలో బరువైన నేలలో సాలుకి సాలుకి మధ్య 120 సెం.మీ, మొక్కకి మొక్కకి మధ్య 60 సెం.మీ, తేలిక నేలలో సాలుకి సాలుకి మధ్య 90 సెం.మీ, మొక్కకి మొక్కకి మధ్య 60 సెం.మీ పాటిస్తారు. సాళ్ల మధ్య ఎక్కువ ఖాళీ ఉండడం వలన కలుపు సమస్య ఎక్కువ. కానీ, అధిక సాంద్ర పద్దతిలో 80-90 సెం.మీ (సాలుకి సాలుకి మధ్య), 15-20 సెం.మీ (మొక్కకి మొక్కకి మధ్య)లో నాటుతారు. వీటి కోసం తక్కువ ఎత్తు, కొన్నికొమ్మలు మాత్రమే ఉండే ప్రత్యేక హైబ్రిడ్లు వాడవలసి ఉంటుంది కాబట్టి కలుపు కూడా తక్కువ. మొక్కలు ఎక్కువ ఎత్తుకి పెరగకుండా మేపిక్వట్ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 1 మి.లీ.
కలుపుకుని 45-60 రోజుల వయస్సులో ఒకసారి మరియు 75-80 రోజుల వయస్సులో రెండవ సారి పిచికారీ చేసుకోవడం వలన శాఖీయ పెరుగుదల తగ్గి మొక్క గ్రహించిన ఆహారం ఆకులలో కాకుండా పత్తి కాయలలో నిల్వ ఉంటుంది. అలాగే సాధారణం కన్నా ఎక్కువ మొక్కల సాంద్రత ఉండడం వలన కాయలన్ని ఒకేసారి పగిలి అదనంగా 3 నుండి 4 కింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది. ఈ పద్దతిలో ప్రత్యేక ఎరువుల యాజమాన్యం ప్రత్యేకమైనది. ఎకరాకు 75 కిలోల యూరియా, 50 కిలోల పోటాష్, 50 కిలోల డి.ఏ.పి వేసుకోవాలి. దుక్కిలో మొత్తం డి.ఏ.పి, పోటాష్ , పై పాటు ఎరువులను పూత దశలో అనగా 40-50 రోజుల వయస్సులో, మరోసారి 75-80 రోజులలో వేసుకోవాలి. ఈ పద్ధతి తెలుగు రాష్ట్రాల పరిశోధనా స్థానాలు, ఆదర్శ రైతుల పొలాలలో సత్ఫాలితాలు ప్రదర్శించడం, గవర్నమెంట్ ప్రోత్సాహించడం రైతు పొలం చేరడానికి సులభతరం చేసింది.
Also Read: Tobacco Cultivation: పొగాకు సాగుకు అనువైన నేలలు.!