A new type of cowpea suitable for machine harvesting from Nandyala : నంద్యాల నుంచి యంత్రం కోతకు అనువైన కొత్త శనగ రకం
రబీలో సాగుచేసే ప్రధాన అపరాల పంట శనగ. శనగ సాగులో కూలీల సమస్యను అధిగమించేందుకు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో యంత్రంతో కోతకు అనువైన రకాల రూపకల్పనపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ దిశలో నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఇప్పటికే యంత్రం కోతకు అనువైన ధీర, నంద్యాల గ్రామ్-776 శనగ రకాలు విడుదలయ్యాయి. ఇటీవల ఈ పరిశోధనా స్థానం నుంచి యంత్రంతో కోతకు అనువైన నంద్యాల గ్రామ్ -1267 నూతన శనగ వంగడాన్ని విడుదల చేశారు. గత ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రకం విడుదల కావడం గమనార్హం. యంత్రం కోతకు అనువైన ఈ రకం గురించిన వివరాలు తెలుసుకుందాం.
నంద్యాల గ్రామ్-1267 (ఎన్.బి.ఇ.జి.1267):
రబీ కాలానికి అనుకూలమైన దేశవాళీ శనగ రకం. పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి ఎకరాకు సుమారు వర్షాధారంగా 9-10 క్వింటాళ్లు, ఒకటి లేదా రెండు నీటి తడులిస్తే 10- 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనువైన రకం. విత్తనాల్లో15.98 శాతం మాంసకృత్తులుంటాయి. వంద గింజల బరువు 22-24 గ్రాములు ఉంటుంది. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీలో సాగుకు అనుకూలమైన రకం. శనగ పంటసాగుకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అనుకూలం. ఖరీఫ్ పంట తరువాత లేదా ఖరీఫ్ లో ఏ పంట విత్తని పొలాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్ లో కొర్ర పంట వేసి తర్వాత రబీలో శనగ పంటను సాగు చేయడం వల్ల రైతులు అధిక నికర ఆదాయ పొందవచ్చని పరిశోధనలో తెలిసింది.