Chaff Cutter Importance: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రధమ స్థానంలో వున్న లాభసాటి పరిశ్రమ పాడి పరిశ్రమ. ఈ పరిశ్రమ నిర్వహణలో 60-70% వ్యయం ఒక్క పోషణ కే అవుతుంది. పచ్చి మేతలతో పాటు ఎండు గడ్డి, దాణాలను కలిపి అందించగలిగితే పోషణ వ్యయం నియంత్రణలో ఉంటుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి గడ్డి , ఎండు గడ్డిని ముక్కలు చేయకుండా డైరెక్ట్ గా అలానే మేత గా ఇస్తారు . దీని వల్ల పశువులు తిన్న దానికంటే వృధా చేసేదే ఎక్కువగా వుంటుంది.
కాండం లావుగా ఉండే మొక్కజొన్న, జొన్న, సజ్జ లాంటి గ్రాసాలను మేపినప్పుడు దాదాపు గా 50% కు పైగా తినకుండా అలానే వదిలేస్తాయి.అలా కాకుండా మేతలను పూర్తీ గా వినియోగించుకోవాలి అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా అందిచడం వలన పశువులు సులభంగా తినగలుగుతాయి . అంతేకాక మేతలు వృధా కాక నూరు శాతం సద్వినియోగం అవుతాయి .పశు గ్రాసాలను ముక్కలుగా చేయటానికి ఛాఫ్ కట్టర్ అనే పరికరం అందుబాటులో ఉంది. రైతులు తమకున్న పశు సంఖ్యను బట్టి ఈ ఛాఫ్ కట్టర్ ను ఎంపిక చేసుకోవాలి.
ఛాఫ్ కట్టర్ పనితీరు :
ముఖ్యంగా ఈ ఎండుగడ్డి ని పశువుల కి మేత గా వేసినప్పుడు పశువుల కాళ్ళ క్రింద పడి వాటి మలముత్రాలతో కలిసి సుమారు 50% వృధా అయ్యే అవకాశం కలదు అలాగె మొక్కజొన్న లాంటి పచ్చి పశు గ్రాసాలు ముక్కలు చేయకుండా అదే విధంగా పశువుల కి మేత గా వేసినప్పుడు వాటి కాండం గట్టిగా వుండటం వలన అవి సరిగ్గా నెమర వేయకపోవడం వలన వృధా అయ్యే అవకాశం కలదు. కొన్ని సందర్భాలలో నోటి లోపల గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా పళ్ళు కూడా బలహీన పడే పరిస్థితులు ఉంటాయి.
Also Read: Cotton Crop Nutrition: రైతులు మురిపెంగా తెల్ల బంగారం అంటూ పిలిచే ప్రత్తిలో సమగ్ర పోషక యాజమాన్యం:
గడ్డి వృధా కాకండా పశువులు మంచిగా తినాలి అంటే ఈ గడ్డిని ఛాఫ్ కట్టర్ ద్వారా ముక్కలగా చేసుకొని పశువులకు మేత గా ఇవ్వాలి. ఎక్కువ మొత్తం లో పశువుల ను పెంచే రైతులు ఈ ఛాఫ్ కట్టర్ ను తప్పని సరిగా వినియోగించాలి.దీనివలన లేబర్ ఖర్చు ఆదా చేయవచ్చు, అలాగె పశు గ్రాసాలు కూడా సమర్ధవతంగా వినియోగించవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు మేత ఇవ్వడం వలన 90% పశు గ్రాసాన్ని సమర్ధవతంగా వినియోగించవచ్చు. ఈ ముక్కలు చేసిన పశు గ్రాసాన్ని పశువులు సులభంగా, ఇష్టంగా, మంచిగా నెమర వేసి తింటాయి. ఇలా తినడం వలన జీర్ణశక్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ ముక్కలు గా చేసిన పశు గ్రాసాన్ని చాలా సులభంగా బస్తాలలో, తక్కువ స్థలంలో నిల్వ చేసుకోవచ్చు. రవాణా కూడా సులభంగా వుంటుంది. ఇలా ముక్కలు చేసి ఇవ్వటం వలన పశువులు కొంచెం ఎక్కువ గా తిని మంచి నాణ్యత కలిగిన పాలను ఇస్తాయి. పాల దిగబడి కూడా పెరుగుతది.
ఎంత సామర్ధ్యం గల ఛాఫ్ కట్టర్ కొనుక్కోవాలి?
ఛాఫ్ కట్టర్ సామర్ధ్యం మన దగ్గర వున్న పశువుల సంఖ్యను బట్టి నిర్ణయించుకోవాలి.
1)చేతితో నడిపే ఛాఫ్ కట్టర్
2)విద్యుత్ మోటార్ సాయంతో నడిచే ఛాఫ్ కట్టర్
a) 2hp
b) 5hp
C) 10 hp
చేతితో నడిపే ఛాఫ్ కట్టర్ :
తక్కువ పశువులు వున్న రైతులు అంటే 1-5 పశువులు వున్న రైతులు చేతితో నడిపే ఛాఫ్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలి. చేతితో నడిపే ఛాఫ్ కట్టర్ ధర 15,000-18,000 మధ్య వుంటుంది.
విద్యుత్ మోటార్ సాయంతో నడిచే ఛాఫ్ కట్టర్ :
ఎక్కువ పశువులు వున్న రైతులు విద్యుత్ మోటార్ సాయంతో నడిచే ఛాఫ్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలి. వీటిలో 2hp,5hp,10hp సామర్ధ్యం కలిగినవి ఉంటాయి.విద్యుత్ మోటార్ సాయంతో నడిచే ఛాఫ్ కట్టర్ ధర 25,000-60,000 మధ్య వుంటుంది.
2hp సామర్ధ్యం :
ఒక గంటకు 500-800 కేజీ ల పచ్చి మేత లేదా ఎండు మేత ని కట్ చేసుకోవాలి అంటే 2hp సామర్ధ్యం వున్న ఛాఫ్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలి. 10-20 పశువులు వున్న రైతులు ఈ 2hp సామర్ధ్యం వున్న ఛాఫ్ కట్టర్ వినియోగించుకోవచ్చు.
5hp సామర్ధ్యం :
50-60 పశువులు వున్న రైతులు 5hp సామర్ధ్యం వున్న ఛాఫ్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలి. ఇది గంటకు 3,000 కేజీల పచ్చి మేత లేదా ఎండు మేత ని ముక్కలు చేస్తుంది.
10hp సామర్ధ్యం :
100 కు పైగా పశువులు అంటే డైరి ఫాం వున్న రైతులు 10hp సామర్ధ్యం వున్న ఛాఫ్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలి.ఇది గంటకు 5,000-6,000 కేజీల పచ్చి మేత లేదా ఎండు మేత ని ముక్కలు చేస్తుంది.