ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అంతలా మనల్ని తన గుండెలకు హద్దుకుని.. కంటికిరెప్పలా కాచుకుంటుంది. చెట్లకూ స్పర్ష తెలుసు, మన కాలి అడుగుల శబ్దానికి నేల తల్లి కూడా పులకరిస్తుంది. మనిషికి నేల వల్లే పంట పండించుకోగులుగుతున్నాడు. అయితే, ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయంతో నేలతల్లిని దున్నుతున్న రైతు.. ఇటీవల కాలంలో రసాయన ఎరువులంటూ భూమి సారాన్ని తగ్గించి.. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాడు. అయితే, విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామాల్లోని గిరిజన రైతులు మాత్రం రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడమంటే.. జన్మనిచ్చిన అమ్మకు విషమించి చంపడమేనని అనుకున్నారో ఏమో కానీ.. పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయారు. ఒకరు, ఇద్దరూ కాదు.. ఏకంగా ఊళ్లకు ఊర్లే స్ఫూర్తితో ఈ ప్రకృతి సేద్యం వైపు అడుగులేశాయి. అలా ఇప్పటి వరకు చుట్టుపక్కల 93 గ్రామాలు ఈ బాటనే అనుసరిస్తున్నాయి. వీటినే బయోగ్రామాలుగా అధికారులు పిలుస్తున్నారు.
విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మారుమూల పల్లెటూరే కొండబారిడి.. ఒకప్పుడు నక్సల్ బరి ఉద్యమానికి పురుడు పోసిన ఈ గ్రామమే.. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విప్లవానికి పనాదులేసింది. ఈ గ్రామంలోనే తొలుత ప్రకృతి సేద్యం వైపు అడుగులేశారు. ప్రస్తుతం అత్యధికంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రాంతాల్లో ఏపీలోనే కొండబారిడి తొలి బయోగ్రామంగా పేరుతెచ్చుకుంది. ఈ గ్రామం స్ఫూర్తితోనే గడిచిన కాలంలో చుట్టుపక్కల 92 గిరిజన గ్రామాలు పూర్తిగా ప్రకృతి సేద్యం వైపు మల్లాయి. వీరు పండించే పంటల్లో వరితో పాటు, చిరు ధాన్యాలు, పప్పు, నూనెగింజలు, కూరయగాయలు కూడా ఉంటాయి. జీడిమామిడి తోటల్లోనూ ప్రకృతి వ్యవసాయ పద్దతులను అనుసరించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.
కొండబారిడి గ్రామంతో కలిపి మిగిలిన 92 గ్రామాల్లోని రైతులు మొత్తం 10వేలకు పైగా ఎకరాల్లో పూర్తిగా ఈ వ్యవసాయ పద్దతికే శ్రీకారం చుట్టారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే.. ఇదంతా వర్షాధార సేద్యమే. గతంతో పోలిస్తే ఇప్పుడు 3 నుంచి 4 వేల వరకు వరిసాగులో ఖర్చులు తగ్గినట్లు అక్కడి రైతులు చెప్తున్నారు. అంతే కాకుండా.. అప్పుడు 20 బస్తాల ధాన్యం పండితే.. ఇప్పుడు 30కి పైగా వస్తోందని అంటున్నారు.
ప్రకృతి వ్యసాయంతో పండించిన పంటలతో బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ధరిచేరవని.. ఈ పద్దతిలో పండించిన పంట తింటున్నప్పటి నుంచి తమలో ఈ సమస్యలన్నీ 30 నుంచి 40 శాతం తగ్గినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, ఇప్పటివరకు ఈ గ్రామాల్లో నమోదైన కొవిడ్ కేసుల్లో ఒక్కరు కూడా మరణించలేదని అన్నారు. వీటితో పాటు ప్రస్తుతం మరికొన్ని గ్రామాలు ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ప్రకృతి వ్యవసాయానికి పుట్టినిల్లుగా మారాలని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.