Soil Conservation: మన దేశంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగునీటి వనరులను పెంచడం ద్వారా, హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన అధిక దిగుబడినిచ్చే వంగడాలు రసాయన ఎరువుల వాడకం వలన ఆహారోత్పత్తి సాధన దిశలో సేంద్రియ ఎరువుల ప్రాధాన్యతను విస్మరించి, రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువ చేయడం వల్ల భూమిలో సమతుల్యత వ్యవసాయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.

Soil Conservation
సేంద్రియ ఎరువుల వల్ల భూమికి, పంటకు కలిగే ప్రయోజనాలు:
- సేంద్రియ ఎరువులు నేలలో కుళ్ళి ఖనిజీకరణ చెంది పంటలకు అవసరమైన స్థూల పోషకాలు అయిన నత్రజని, భాస్వరం, పొటాష్లు డి మరియు సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్తాయి.
- సేంద్రియ ఎరువులు కుళ్ళేటప్పుడు వివిధ సూక్ష్మజీవులు విటమిన్లను, రోగనిరోధకాల పెరుగుదలను, వృద్ధిచేసే హార్మోనులు ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిన్లు విత్తనాలు మొలకెత్తడానికి వేర్ల పెరుగుదలకు తోడ్పడతాయి. శిలీంద్రాలు విషంగా ఉండే పదార్థాలు వీటి నుంచి తయారై శిలీంద్ర తెగులు సోకకుండా చేసే అవకాశం ఉంది.
- సేంద్రియ ఎరువులు చిలెట్స్గా పనిచేసి సూక్ష్మ పోషకాల లభ్యతను, నేలలో వీటి కదలికలను పెంచుతాయి.
- సేంద్రియ ఎరువుల నుంచి నత్రజని నిదానంగా విడుదలవడం వల్ల రసాయన ఎరువులతో పోలిస్తే సేంద్రియ ఎరువులలో నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది.
- వాతావరణంలోని నత్రజనిని సేంద్రియంగా చిత్రీకరించి పంటలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది.
- రసాయన ఎరువుల వినియోగం సామర్థ్యాన్ని పెంచుతాయి.
- నేలలో హ్యూమస్ తయారీకి అవసరమైన కర్బనాన్ని అందిస్తాయి.
- నేలలోని ఖనిజ లవణాలను మొక్కల వేర్ల నుంచి విడుదలయ్యే రసాయనాలతో నేలలో సూక్ష్మజీవులు విడుదల చేసే పదార్థాలతో కరిగించి మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలో మారుస్తాయి.
- నేలలోని సూక్ష్మజీవులు అన్నింటికీ సేంద్రియ ఎరువులు ఆహారంగా అందుబాటులో ఉండి ఇవి నేలకు పంటలకు ఉపయోగపడే ప్రక్రియ జరిగేందుకు ఉపయోగపడతాయి.

Organic fertilizers
- పారించే నీటి ద్వారా నేలకు చేరే పాదరసం, కాడ్మియం లాంటి భారీలోహ కాలుష్యాన్ని నిరోధిస్తాయి.
- నేలలో ఉన్న సహజంగా లేదా రసాయనిక ఎరువుల ద్వారా వేసిన అధిక ఆమ్లాలు, క్షారాలు, లవణాల వలన మొక్కల వేర్లకు హాని కలగకుండా సేంద్రియ ఎరువులు చేస్తాయి. నేల ఉదజని సూచికను స్థిర పరుస్తాయి.
- నేల రసాయన, భౌతిక, జీవగుణాల పై ప్రభావం చూపి నేల సత్తువను ఉత్పాదక శక్తిని పెంచుతాయి.
- నేల యొక్క భౌతిక స్థితిని మెరుగు పరుస్తాయి. తేమను నిలుపుకునే శక్తిని పెంపొందిస్తాయి. నేలలోని గాలి ప్రసరణ పెరుగుతుంది. అలాగే మట్టిరేణువులను ఒకదానికొకటి పట్టి ఉంచే గుణాన్ని సేంద్రియ ఎరువులు మెరుగుపరుస్తాయి.
- నేలలో నీరు ఇంకిపోయే వేగాన్ని పెంచుతాయి. మురుగునీరు పోవడాన్ని వృద్ధి చేస్తాయి.
- నేలకోతను తట్టుకునే శక్తిని ఎక్కువ చేసి కోతను తగ్గిస్తాయి. నేలలో ఇంకే నీటిని పెంచి నేలపై నుంచి కొట్టుకుని పోయే నీటిని తగ్గిస్తాయి.
- గాలి కోతకు గురి కాకుండా కాపాడతాయి.
- నేలపై సేంద్రీయ ఎరువులు మల్చింగ్ లాగా పని చేసి వేసవిలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. చలికాలంలో నేల ఉష్ణోగ్రతను పెంచుతాయి. నేల వాతావరణం మధ్య ఉష్ణోగ్రత ప్రయాణించకుండా నిరోధిస్తాయి.
Also Read: సేంద్రియ వ్యవసాయానికి యువ రైతుల కృషి
సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచే మార్గాలు:
భూమి పంటల ఆరోగ్యాన్ని సేంద్రియ ఎరువులు పెంచుతాయి. ఈ మధ్యకాలంలో సేంద్రియ సేద్యపద్ధతిలో ఉత్పత్తి చేసిన సేంద్రియ ఉత్పత్తులు మంచి ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది.

Importance of Organic Fertilizers
సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచే మార్గాలు :
1. పశువులు, గొర్రెలు, మేకలు, పశువుల ఎరువును శాస్త్రీయంగా అధికంగా సేకరించి నిల్వ చేసి సేంద్రియ ఎరువుగా వాడుకోవడం.
2. మన రాష్ట్రంలో సేంద్రియ ఎరువు అయిన కోళ్ల ఎరువు ఏడు లక్షల టన్నులు సంవత్సరానికి లభిస్తుందని అంచనా. డీప్ లిట్టర్ పద్ధతిలో గాని కేజెస్ పద్ధతిలో గాని తయారైన కోళ్ల ఎరువు పంటలకు వేస్తే భూమి వేడెక్కుతుంది అని, సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గి, చీని, నిమ్మ తోటల్లో ఎండు తెగులు ఎక్కువవుతుందని రైతులు అపోహ పడ్డారు. కోళ్ల ఎరువులో పశువుల ఎరువులలో కంటే అధిక నత్రజని భాస్వరం మరియు పొటాషియం ఉండటమే కాకుండా సూక్ష్మపోషకాలు లభ్యత కూడా అధికం. కోళ్ల ఎరువులు రెండు నుండి మూడు నెలలు మగ్గం పెట్టిన తర్వాత పొలానికి వేసుకోవడం వలన ఎలాంటి హానీ ఉండదు
3. గ్రామీణ పట్టణ కంపోస్టును శాస్త్రీయ పద్ధతిలో అధికంగా తయారు చేసుకోవడం దీని కోసం గ్రామ పంచాయతీలను, మునిసిపాలిటీలను ప్రోత్సహించాలి.
4. వ్యర్ధ పదార్ధాలతో రైతు సాధికార స్థాయిలోనే వానపాముల ఎరువు (వర్మీ కంపోస్ట్) తయారు చేయాలి.
5. చెరకు కర్మాగారాల నుంచి ఉప ఉత్పత్తిగా లేదా పదార్థంగా తయారయ్యే వరకు విరివిగా వాడటం 100 టన్నుల చెరకు నుండి 3 నుండి 4 టన్నుల చెరకు మడ్డి తయారవుతుంది. చెరకు మడ్డిలో పశువుల ఎరువు కంటే అధికంగా నత్రజని భాస్వరం పొటాష్లు ఉన్నాయి.
6. పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, అలసంద, పెసర, మినుము, పిల్లిపెసర లాంటి వాటిని విస్తారంగా సాగు చేసి కలియదున్నాలి.
7. వేరుశనగ వేప, ఆముదం, కానుగ, పత్తి గింజల పిండి లాంటి వాటిని సేంద్రియ ఎరువులుగా అధికంగా వాడటం.
8. భూమి పంటల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు దోహదపడే సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను గుర్తించి విస్తృత ప్రచారం చేయాలి.
పి. వెంకట రమణ, శాస్త్రవేత్త (భూసార విభాగం)
డా. ఉమాదేవి, రీసెర్చ్ అసోసియేట్
డా.సి యాస్మిన్, శాస్త్రవేత్త (భూసార విభాగం)
డా.బి.సహదేవరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి
వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురం, ఫోన్ : 70328 84948
Leave Your Comments