వార్తలు

Nutrient Deficiencies in Maize: మొక్కజొన్న పంటలో పోషక లోపాలు నివారణ

0
Nutrient Deficiencies in Maize
Nutrient Deficiencies in Maize

Nutrient Deficiencies in Maize: అవసరమైన పోషకాలు లభ్యమైనప్పుడు మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి. మొక్కలకు ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే నత్రజని, భాస్వరం మరియు పోటాష్‌ లను స్థూల పోషకాలని మధ్యస్థ పరిమాణంలో అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకంను ద్వితీయ పోషకాలని మరియు తక్కువ పరిమాణంలో కావలసిన ముఖ్యమైన జింకు, రాగి, ఇనుము, మాంగనీసు మరియు బోరాన్‌ పోషకాలని సూక్ష్మపోషకాలు అని అంటారు.

Nutrient Deficiencies in Maize

Nutrient Deficiencies in Maize

ఏ ఒక్క పోషక లోపం ఉన్నప్పటికీ దాని ప్రభావం దిగుబడి మీద ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాక సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా తగ్గిపోవడం గమనిస్తున్నాము. కాబట్టి భుసార పరీక్షలను అనుసరించి రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు (ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువులు) వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందించడం ద్వారా పోషక లోపాలను సవరించవచ్చు. ఈ వ్యాసంలో మొక్కజొన్న పంటలో ముఖ్యమైన పోషకలైనటువంటి నత్రజని, భాస్పరం, పొటాషియం, గంధకం, జింక్‌ మరియు బోరాన్‌ లోపాలు మరియు నివారణ చర్యలను గురించి వివరించడం జరిగింది.

నత్రజని: మొక్కజొన్న లేత దశలో ఉన్నప్పుడు నత్రజని లోపం ఏర్పడితే మొక్క మొత్తం పాలిపోయినట్లు పసుపుపచ్చ రంగులోకి మారుతుంది. కాండం కూడా గట్టిపడి, ఆకు కొనల నుండి తిరగబడిన V ఆకారంలో పసుపు వర్ణంలోకి మారును. ఈ లోపం ఎక్కువ కాలం కొనసాగితే, కింద ఉన్న ముదురు ఆకులు మొత్తం పసుపు రంగుకు మారి మొక్క ఎండిపోతుంది.

Also Read: Weed Management in Maize: మొక్కజొన్న పంటలో కలుపు యాజమాన్యం

నివారణ: వానాకాలంలో వర్షాధారంగా మొక్కజొన్న సాగుచేసినపుడు ఎకరాకు 72-80 కిలోల మరియు యాసంగిలో నీటిపారుదల క్రింద సాగుచేసినపుడు ఎకరాకు 80-96 కిలోల నత్రజని ఎరువులను వాడాలి. దీనిని మూడు దపాలుగా అనగా 1/3 వంతు విత్తే ముందు, 1/3 వంతు పైరు మోకాలి ఎత్తు దశలో మరియు మిగిలిన 1/3 వంతు పూత దశలో నేలలో తేమ లభ్యతను బట్టి వేసుకోవాలి.

భుసార పరీక్ష ఆధారంగా మట్టిలో నత్రజని పరిమితి ఎకరానికి 112-224 కిలో ఉన్నట్లయితే సిపార్సు చేయబడిన మోతాదు మాత్రమే వాడాలి. ఒకవేళ నత్రజని పరిమితి ఎకరానికి 112 కిలో కన్నా తక్కువ ఉన్నట్లయితే సిపారసు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం అధికంగా వాడాలి. ఒకవేళ నత్రజని పరిమితి 224 కిలో/ఎకరం కన్నా మించి ఉన్నట్లయితే సాధారంగా సిపార్సు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం తక్కువగా వేసుకోవాలి. పంట మధ్యకాలంలో గమనించినపుడు అవసరాన్ని బట్టి బెట్ట పరిస్థితుల్లో 2 శాతం యూరియా ద్రావణం పంటపై పిచికారీ చేయాలి.

భాస్వరం:
భాస్వరం యొక్క లోప లక్షణాలు మొక్క తొలి దశలోనే కనిపిస్తాయి. దీని వలన మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. ముదురు ఆకులు ఎరుపుతో కూడిన నీలి రంగులోకి మారుతాయి.ఈ పోషక లోపం ఉన్నప్పుడు వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందక మొక్కలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి.

నివారణ: వానాకాలంలో ఎకరాకు 24 కిలోల భాస్వరం ఎరువులను మరియు యాసంగిలో ఎకరాకు 32 కిలోల భాస్పరం ఎరువులను దుక్కిలో వేసి కలియదున్నాలి. భుసార పరీక్ష ఆధారంగా మట్టిలో భాస్వరం పరిమితి 10-24 కిలో/ఎకరం ఉన్నట్లయితే సిపారసు చేయబడిన మోతాదు మాత్రమే వాడాలి. ఒకవేళ భాస్పరం పరిమితి ఎకరానికి 10 కిలో కన్నా తక్కువ ఉన్నట్లయితే సాధారంగా సిఫారసు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం అధికంగా పంటలో వాడాలి. అదేవిధంగా భాస్పరం పరిమితి 24 కిలో/ఎకరం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సాధారంగా సిపార్సు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం తక్కువగా వేసుకోవాలి.

పొటాషియం:
మొక్కజొన్నలో పొటాషియం లోపం ఏర్పడినప్పుడు కింద ఉన్న ముదురు ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోతాయి. ముదురు ఆకుల్లో ఉన్న పొటాషియం లేత ఆకులకు సరఫరా అవుతుంది. దీనివల్ల లోప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కింది ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారి అంచులు ఎర్రబడుతాయి. ఈ లోపం ఉన్న మొక్కలలో కాండం బలహీనంగా ఉండి తొందరగా పడిపోతుంది. చీడపీడలను తట్టుకోదు.

నివారణ:
వానకాలంలో వర్షాధారంగా సాగుచేసినపుడు ఎకరాకు 20 కిలోల పొటాష్‌ ఎరువులను మరియు యాసంగిలో నీటిపారుదల క్రింద సాగుచేసినపుడు ఎకరాకు 32 కిలోల పొటాష్‌ ఎరువులను మూడు దపాలుగా అనగా 1/2 వంతు విత్తే ముందు మరియు 1/2 వంతు పూత దశల్లో నేలలో వేసుకోవాలి.

భూసార పరీక్ష ఆధారంగా మట్టిలో పోటాష్‌ పరిమితి ఎకరానికి 58-136 కిలో ఉన్నట్లయితే సిఫారసు చేయబడిన మోతాదు మాత్రమే వాడాలి. ఒకవేళ పొటాష్‌ పరిమితి 58 కిలో/ఎకరం కన్నా తక్కువ ఉన్నట్లయితే సాధారంగా సిపార్సు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం అధికంగా పంటలో వాడాలి. అదేవిధంగా పొటాష్‌ పరిమితి 136 కిలో/ఎకరం కన్నా మించి ఉన్నట్లయితే సాధారంగా సిపారసు చేయబడిన మోతాదు కన్నా 30 శాతం తక్కువగా వేసుకోవాలి. పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని 10 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి, 2 నుంచి 3 సార్లు 4 నుంచి 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

మెగ్నీషియం:
మొక్కజొన్నలో మెగ్నీషియం లోప లక్షణాలు పరిశీలిస్తే మొట్టమొదట ఈనెల మధ్య భాగం పసుపు తెలుపు మిశ్రమంతో, చారల మధ్య అక్కడక్కడ గుండ్రని మచ్చలు ఏర్పడి పూసల దండలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ముదురు ఆకులు ఎర్రబడి లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మెగ్నీషియం ఆకుల నుండి లేత ఆకులకు సరఫరా అవడంలో ముదురు ఆకుకొనలు రాలిపోతాయి. దీని లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి.

గంధకం:
గంధక లోపం ఏర్పడినప్పుడు నత్రజని లాగా ఆకులు లేత పసుపు వర్ణానికి మారుతాయి. కాని నత్రజని లాగా ఇది మొక్కలో ఒక చోట నుండి మరొక చోటుకు కదలలేదు కాబట్టి నత్రజనితో పోల్చితే ఈ లోపం లేత ఆకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతేకాక ఈనెల మధ్య భాగం తెల్లగా మారే ఆవకాశం ఉంది. నేలలో గంధకం పరిమితి 10 పి.పి.యం. కన్నా తక్కువగా ఉన్నట్లయితే లోప నివారణకు జిప్సం ఎకరాకు 200-400 కిలోలు వాడినట్లయితే గంధక ధాతులోపాలను సవరించవచ్చు.

జింకు:
పైరు 20-25 రోజుల దశలో మొక్కలో పై నుంచి రెండు లేదా మూడు ఆకు మొదలు భాగంలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకులు ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగుగా మారుతాయి. సాధారణంగా ఆకుల ఈనెలు, ప్రక్క భాగాలు మరియు చివరలు ఆకుపచ్చగానే ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోవడంతో మొక్కలు చిన్నవిగా అవుతాయి. జింక్‌ లోపం ఉన్న మొక్కలలో కొత్తగా వచ్చిన ఆకులకు జింకు అందకపోవడంతో అవి తెల్లగా మారుతాయి. దీనినే ‘‘తెల్ల మొగ్గ’’ అంటారు.

నివారణ:
నేలలో జింకు పరిమితి 0.6 పి.పి.యం. కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ దుక్కిలో వేసుకోవాలి. మొక్కలపై లోప తీవ్రత గమనించినట్లయితే 2 గ్రా. జింకు సల్ఫేట్‌ ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసి జింకు లోపాన్ని నివారించవచ్చును.

బోరాన్‌:
మొక్కలలో బోరాన్‌ లోపం ఏర్పడినప్పుడు ఆకులు పెళుసుగా మారడంతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతాయి. ఈ బోరాన్‌ లోపానికి గురైన మొక్కలలో క్రొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిన్నవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకు పోయిన కాండం కణుపుల మీద ఉంటాయి. ఈ లక్షణాల వల్ల మొక్క గుబురుగా, కురచగా కనిపిస్తుంది. ఇటువంటి బోరాన్‌ లోపించిన మొక్కలలో మొదటగా లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు రంగు చారలుగా మారుతాయి, క్రమేణా ఆకులు ముడతలు పడుతాయి. ఆ తరువాత జల్లు మరియు కండె చిన్నవిగా అయి మొక్క నుండి పూర్తిగా బయటకు రావు.

నివారణ:
నేలలో బోరాన్‌ పరిమితి 0.52 పి.పి.యం. కన్నా తక్కువగా ఉన్నట్లయితే బోరాక్స్‌ ఎకరాకు 4 కిలోలు దుక్కిలో వేసి లోపం రాకుండా చుసుకోనవచ్చు. మొక్క మీద లోపం గమనించినట్లయితే లీటర్‌ నీటికి 1 గ్రా. బోరాక్స్‌ కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

ఎన్‌. సాయినాథ్‌, ఎ. వి. రామాంజనేయులు మరియు ఎ. సరిత
వ్యవసాయ పరిశోధన స్థానం, తోర్నాల, సిద్దిపేట జిల్లా

Also Read: Zinc Deficiency in Maize: మొక్కజొన్నలో జింక్ లోప నివారణ లో మెళుకువలు

Leave Your Comments

Niti Aayog Woman Farmer: నీతి ఆయోగ్ ఉత్తమ మహిళా రైతుగా ఎంపీ సతీమణి.!

Previous article

Fresh Water Fish Transportation Management: మంచినీటి చేపలు పట్టుబడి మరియు రవాణా సమయంలో చేపట్టాల్సిన చర్యలు

Next article

You may also like