Summer Crops: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి కాలంలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా శనగ, వేరుశనగ, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ మరియు ఆవాలు వంటి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొన్నిరకాల పోషక లోపాలు ఏర్పడినప్పుడు సాధారణంగా దిగుబడిపై ప్రభావితం చూపుతాయి. కాబట్టి ఆరుతడి పంటల్లో వచ్చే ముఖ్యమైన పోషక లోపాలు వాటి నివారణ చర్యలను క్రింద తెలపడమైనది.
శనగ:
సాధారణంగా శనగ పంట సాగు చేసే నేలల్లో ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ మరియు ఇనుము లోపాలు ఎక్కువగా కనబడే అవకాశం ఉంది.
జింక్ లోపం:
శనగ పంటలో జింక్ లోపం వలన మొక్కలో ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడడం మరియు కణుపుల మధ్య దూరం తగ్గి కాలిపోయిన మచ్చలు కనబడును. ఇలాంటి సందర్భాలలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఒకవేళ పైరుపై కనుక లోప లక్షణాలు కనబడినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్‌ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇనుము లోపం:
శనగలో ఇనుము లోపం వలన లేత ఆకులు పసుపురంగులోకి మారి ఎండి రాలిపోవడం గమనిస్తాము కాబట్టి ఈ లోపాన్ని అధిగమించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్( అన్నభేది) ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరు పై రెండుసార్లు పిచికారీ చేయడం వలన ఇనుము లోపాన్ని నివారించవచ్చు.
గంధకం లోపం:
శనగ గంధకం లోపం వల్ల మొక్కలలో లేత చిగురు ఆకులు హరితవర్ణం కోల్పోయి ఆ తదుపరి మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది కావున ఈ సమస్యను అధిగమించడానికి ఎకరాకు 8 నుండి 12 కిలోల నీటిలో కరిగే గంధకం నీ విత్తు సమయంలో వేసుకోవాలి.
వేరుశనగ:
సాధారణంగా వేరుశనగలో జింకు, ఇనుము వంటి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా వస్తాయి.
జింకు లోపం:
లేత ఆకులలో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారుతాయి. కొన్ని సందర్భాలలో కణజాల అభివృద్ధి తగ్గి మొక్కలు గిడసబారి పెరుగుదల తగినంతగా లేకపోవడం,కణుపుల పొడువు తగ్గి, ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది. కాబట్టి వేరుశనగ పంటలో జింకు లోపాన్ని సవరించ గమనించినట్లయితే ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్‌ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ లోపాన్ని సవరించుకోవచ్చు.
ఇనుము లోపం:
లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి, ఈనెల మధ్యభాగం పసుపుగా మారి మొక్కలలో పెరుగుదల తగ్గుతుంది. ఇనుము లోపం తీవ్రమయ్యే కొద్దీ ఆకులు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకు కొనలు ఎండిపోతాయి. ఈ లోప నివారణకు ఎకరానికి ఒక కిలో అన్నభేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
పొద్దుతిరుగుడు:
బోరాన్ లోపం:
పొద్దు తిరుగుడులో బోరాన్ అనే సూక్ష్మ పోషకం దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లోపం మొదటగా ముదురు ఆకులపై తదుపరి పైన ఉన్నటువంటి లేత ఆకులకి వ్యాపిస్తుంది. బోరాన్ లోపం ప్రదానంగా పూతను ప్రభావితం చేస్తుంది మరియు లోపం తీవ్రమయ్యే కొద్ది కాండం విరిగి పువ్వు కిందికి వాలినట్లు కనిపిస్తుంది. ప్రొద్దుతిరుగుడు పంటలోల బోరాన్ లోపం గమనించినట్లయితే నివారణకు 2గ్రాముల బోరాక్స్‌ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: జామ తోటలో సమీకృత పోషకాల అవసరం మరియు ప్రాముఖ్యత
మొక్కజొన్న:
భాస్వరం లోపం:
భాస్వరం లోపం ఏర్పడినప్పుడు మొక్కజొన్నలో మొదటగా ముదురు ఆకుల అడుగుభాగం, ఈనెలు కాండం, ఎర్రని ఊదా రంగుకి మారడం,మొక్కలు పొట్టి గా ఉండి వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని మొక్క అభివృద్ధి కుంటుపడడం మరియు కండె నాణ్యత తగ్గుతుంది. భాస్వరం లోపం గమనించినట్లయితే నివారణకు సిఫారసు చేసిన మేరకు దుక్కిలో భాస్వరం ఎరువులు వేయాలి. డి ఎ పి 2 శాతం ద్రావణాన్ని 4 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసి కొంతవరకు ఈ లోపాన్ని సవరించవచ్చు.
పొటాషియం లోపం:
ఈ లోపం వలన మొక్కజొన్నలో ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపు గా మారి మాడిపోవడం బోనాలు గోధుమ రంగుకి మారడం జరుగుతుంది మరియు సుంకు, కండె, గింజ బరువు, నాణ్యత తగ్గుతాయి. మొక్కలు వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి చీడపీడలు త్వరగా ఆశించే అవకాశం ఉంది మరియు మొక్కలు వాతావరణంలోని మార్పులను తట్టుకోలేవు. కాబట్టి మొక్కజొన్న పంటలో పొటాషియం లోపం నివారణకు సిఫారసు చేసిన మేరకు పొటాష్ ఎరువులను వేయాలి. పొటాషియం నైట్రేట్ 10 గ్రా./ లీటరు నీటికి చొప్పున కలిపి మూడు సార్లు నాలుగు రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి.
జింకులోపం:
ఈ పంటలో జింకు లోపం వల్ల లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపురంగుకి మారుతాయి. కొన్ని సందర్భాలలో కణజాల అభివృద్ధి తగ్గి మొక్కలు పెరుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పంట ఆలస్యం కావడం జరుగుతుంది. కావున ఈ సమస్య నివారణకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ని రెండు నుండి మూడు పంటలకి ఒకసారి దుక్కిలో వేసుకోవాలి .పైరులో జింకు లోప నివారణకు రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ఒక లీటరు నీటికి కలిపి నాలుగు రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పెసర, మినుము:
సాధారణంగా పెసర, మినుములో పోషకలోప సమస్యలు చాలా తక్కువగా కనపడతాయి.
జింక్ లోపం:
పెసర, మినుముపంటలో జింక్ లోపించడం వలన మొక్క ఎదుగుదల తగ్గి చిట్టి ఆకులు ఏర్పడడంతో పాటుగా కణుపుల మధ్య దూరం తగ్గి పూత ఆలస్యంగా వచ్చును కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ని ఆఖరి దుక్కిలో మాత్రమే వేయాలి. ఒకవేళ పైరుపై లక్షణాలు కనబడినట్లు అయితే రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇనుము లోపం:
లేత ఆకులలో ఈనెల మధ్య భాగం హరితవర్ణం కోల్పోయి పసుపు లేదా తెలుపు వర్ణం దాల్చడం గామనిస్తాము కాబట్టి ఇనుము లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ (అన్నభేది )ఒక గ్రాము నిమ్మఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరుపై రెండుసార్లు పిచికారీ చేయాలి.
డా. ఐ. తిరుపతి, డా. ఎం. రాజేశ్వర్, డా. శివకృష్ణ కోట, ఎ. నాగరాజు,
డా. యు. స్రవంతి, డా. బి. సతీష్, శ్రీమతి. ఎం.జ్యోతి
కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల
8885689290
9100229854, 8309101334
Also Read: జీడీ మామిడిలో దోమ కానీ దోమ యాజమాన్యం
Leave Your Comments