వార్తలు

Pest Control in Rabi Paddy: రబీ వరిలో ముఖ్యమైన తెగుళ్ళు వాటి నివారణ

0
Paddy
Paddy
Pest Control in Rabi Paddy: వరి పంటలో గత 5`6 సంవత్సరాల నుండి కాండం కుళ్ళు తెగులు, మానిపండు తెగులు  వరి పంటను ఆశించి దిగుబడి మీద ప్రభావం చూపుతున్నట్లుగా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఈ తెగుళ్ళ లక్షణాలను, వ్యాప్తికి దోహదపడే పరిస్థితులను, యాజమాన్య పద్ధతులపై రైతులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
Paddy

Paddy

కాండం కుళ్ళు తెగులు:
కాండం కుళ్ళు తెగులు గతంలో పంటలను నష్టపరిచే స్థాయిలో ఉండేది కాదు. తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఉండడం వల్ల క్రమేణా దీని వ్యాప్తి అన్ని వరి పండిరచే ప్రాంతాలలో కనిపిస్తుంది. భవిష్యత్తులో దీని ప్రభావం పంటను నష్టపరిచే స్థాయికి చేరవచ్చు.  ఈ తెగులు నల్గొండ, కరీంనగర్‌, రాయలసీమ జిల్లాలు మరియు కర్ణాటకలో గంగావతి ప్రాంతాలలో గమనించడం జరిగింది. కాబట్టి ఈ తెగులు సమగ్ర యాజమాన్యం మీద అవగాహన కలిగి ఉండటం ఆవశ్యకం.
లక్షణాలు:
  •  వరి పంటను ఆశించే కాండం కుళ్ళు తెగులు స్కీరోషియం ఒరైజే అనే శిలీంద్రం వల్ల సంక్రమిస్తుంది.
  •  తెగులు ఆశించినప్పుడు దుబ్బులోని పిలకలు వాడినట్లుగా కనిపిస్తాయి. క్రమేణా దుబ్బులోని పిలకలు మొత్తం ఎండిపోతాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్ది పొలంలోని పైరు పక్వానికి రాకముందు ఎండిపోవడం జరుగుతుంది.
  •  తెగులు సోకిన పిలకలలోని కణజాలం కుళ్ళడం వలన పిలకలు మెత్తబడి పైరు వాలిపోతుంది.
  •  కాండం కుళ్ళు ఆశించిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలిభాగం ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుకు మారి ఉంటుంది. ఇటువంటి రంగు మార్పు కణుపుల వద్ద ఎక్కువగా ఉంటుంది.పూర్తిగా ఎండిన పిలకలను పరిశీలించినప్పుడు లోపలి భాగంలో నల్లని చిన్న, చిన్న  శిలీంద్ర బీజాలు కనిపిస్తాయి.
వ్యాప్తికి అనుకూల పరిస్థితులు:
  • ఈ తెగులు కారక శిలీంద్రం భూమిలో ఎక్కువ కాలం జీవించి ఉంటుంది. సాగు నీటి ద్వారా, విత్తనం ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి తెగులు వ్యాపిస్తుంది.
  • విత్తనాన్ని అంటిపెట్టుకొని ఉన్న, విత్తనంలో కలిసి ఉన్న పంట అవశేషాలు, మట్టిరేణువులు, దుమ్ము మరియు ఇతర వ్యర్ధపదార్ధాలు తెగులుకారక బీజాలను మరియు శిలీంద్రాన్ని వ్యాప్తి చేయుటకు దోహదపడతాయి.
  • వరి పండిరచే ప్రాంతాల్లో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అంటే సాగునీటిపారుదలకు, మురుగు నీరు పోవుటకు విడివిడిగా కాలువలు లేనందువల్ల కాండం కుళ్ళు తెగులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వ్యాపించే అవకాశం ఉంది.
  • ఆయకట్టు మొదటి భూములకు అందించిన సాగు నీరు మురుగు అయిన తరువాత కింది పొలాలకు మరలా సాగునీరు గా ఉపయోగించడం జరుగుతుంది అటువంటి పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి ఉపకరిస్తాయి.
  •  ఆయకట్టుకు చివరగా ఉన్న భూములలో ఎక్కువ రోజుల పాటు నీటిని నిల్వ ఉంచితే కాండం కుళ్ళు తెగులు వ్యాపించవచ్చు.
  • వరి పంటను సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగు ఆశించినప్పుడు అవి ఏర్పరచిన గాయాల ద్వారా తెగులు కారక శిలీంద్రం తేలికగా మొక్క లోపలికి చొచ్చుకుపోయి వ్యాపిస్తుంది.
  •  తెగులు ఆశించిన పొలంలో కోత సమయంలో మొక్కలను భూమట్టానికి దగ్గరగా కాకుండా పొడవైన మొదళ్ళను వదిలి వేయడం వల్ల అక్కడ అభివృద్ధి చెందిన శిలీంద్రం తరువాత పంటకు ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఉంది.
  • బరువైన నేలలో వరి తరువాత వరి పండిరచే విధానంలో కూడా తెగులును కలుగచేసే శిలీంద్రం క్రమంగా ఉధృత స్థాయికి చేరవచ్చు.

Also Read: బచ్చలికూర సాగు వివరాలు

యాజమాన్యం:
  • తెగులు ఆశించిన పొలాన్ని పంట కోత తరువాత వేసవి సమయంలో లోతు దుక్కి చేయాలి.
  • విత్తనంలో తేమ శాతం 14 కి మించకుండా బాగా ఎండనిచ్చి, గాలికి తూర్పార బట్టి దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేయాలి.
  • విధిగా విత్తనశుద్ధి చేయాలి. అందుకు గానూ 3 గ్రాముల కార్బండిజమ్‌  50% పొడి మందును కిలో విత్తనానికి కలిపి పొడి విత్తన శుద్ధి చేయాలి. లేదా ఒక గ్రామం కార్బండిజమ్‌ మందు లీటరు నీటికి కిలో విత్తనానికి కలిపి విత్తనాన్ని 24 గంటల పాటు నాననిచ్చి తడి విత్తనశుద్ధి చేయాలి.
  • పొలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
  • తెగులు ఆశించిన పొలము నుండి ఇతర పొలాల్లోకి నీటిని మళ్లించడ కూడదు. కాండం కుళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటే పొలం నుండి నీటిని పూర్తిగా తొలగించి ఒకసారి ఆరగట్టడం మంచిది.
  • తెగులు లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించి గుర్తించిన వెంటనే హెక్సాకొనజోల్‌ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫికొనజోల్‌ ఒక మిల్లీ లీటరు లేదా వాలిడామైసిన్‌ రెండు మిల్లీ లీటర్లు లేదా బెనోమిల్‌ ఒక గ్రా. లేదా కార్బండిజమ్‌ ఒక గ్రాము లేదా టెబ్యుకొనజోల్‌  రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి. శిలీంద్ర నాశినులను పిచికారీ చేసే సమయంలో పొలంలో నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి.
  • సుడిదోమ, కాండం తొలుచు పురుగులను సకాలంలో నివారించుకోవాలి.
  • కాండం కుళ్ళు తెగులు ఆశించిన పంటను కోసేటప్పుడు మొదళ్ళ వరకు కోయాలి. పొలంలో పంట అవశేషాలు తొలగించి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.
కొత్త శిలీంద్రనాశక మందులు: 
కాండం కుళ్ళు నివారణకు టెబ్యుకొనజోల్‌ 25.9 శాతం ఇ.సి`2.0 మి.లీ / లీటరు నీటికి బెనోమిల్‌ 50 శాతం డబ్య్లుపి `1.0 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసిన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అజాక్సీస్ట్రోబిన్‌ 18.2 శాతం G డైఫెనోకొనజోల్‌ 11.4 శాతం యస్‌.సి `1.25 మి.లీ. / లీటరు ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్‌ 25 శాతం G టెబ్యుకొనజోల్‌ 50 శాతం డబ్య్లు.జి`0.4 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసి సమర్థవంతంగా కాండం కుళ్ళును నివారించవచ్చు.
తట్టుకునే రకాలు: 
యం.టి.యు 1064, యం.టి.యు 1061, యం.టి.యు 1112, యం.టి.యు 1166, యం.టి.యు 1078, యం.టి.యు 2067, యం.టి.యు 4870, యం.టి.యు 2077 రకాలు కొంత వరకు కాండం కుళ్ళు తెగులును తట్టుకోగలవని తేలింది.
మానిపండు తెగులు: 
దీనినే మానుకాయ అని అంటారు. ఈ మధ్యకాలంలో వరి పంటను మానుకాయ తెగులు పరిగణనలోకి తీసుకొనే స్థాయిలో ఆశిస్తున్నట్లు గమనించడమైంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హైబ్రిడ్‌ రకాలలో ఈ తెగులును ఎక్కువగా గమనించడం జరిగింది.
లక్షణాలు: 
  • ఈ తెగులు ఉస్టిలాజినాయిడియా విరియన్స్‌ అనే శిలీంద్రం వల్ల కలుగుతుంది.
  • వరి పైరు పుష్పించే దశలో ఉన్నప్పుడు తెగులు పంటను ఆశిస్తుంది.
  •  వెన్నులో గింజలకు బదులుగా గుండ్రని శిలీంద్ర బీజ సముదాయాలు ఏర్పడతాయి. ఇవి ముందుగా పసుపుపచ్చని రంగులో ఉండి క్రమేణా ముదురాకుపచ్చ లేదా నలుపు రంగుకు మారతాయి. తెగులు కొన్ని సందర్భాల్లో దిగుబడికి నష్టం కలిగించే స్థాయికి చేరవచ్చు. ఈ శిలీంధ్రం ధాన్యంతో కలసి నాణ్యతను తగ్గించే అవకాశం కూడా ఉంది.
యాజమాన్యం: 
  • తెగులు సోకని పంట నుండి విత్తనాన్ని సేకరించాలి.
  • విత్తనంలో తేమ శాతాన్ని 12`14 శాతం వరకు తగ్గించి దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసి విత్తనశుద్ధి చేయాలి.
  • పంట పొలం చుట్టూ కాలువలలో, పంట పొలంలో ఉండే ఊద, తుంగ, ఉడ్రంగ వంటి గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించాలి.
  • పైరు పుష్ఫించే దశకు వచ్చిన సమయంలో సాయంకాలపు సమయాల్లో పిచికారి మందులను వాడాలి. అందుకొరకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 2.5 గ్రా. లు లేదా ప్రొపికొనజోల్‌ 1.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
కొత్త శిలీంద్ర నాశక మందులు: 
క్రెసోక్సీమ్‌ మిథైల్‌ 44.3 శాతం యస్‌.సి. `1.0 మి.లీ. / లీటరు ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్‌ 25 శాతం G టెబ్యుకొనజోల్‌ 50 శాతం డబ్య్లు.జి ` 0.4 గ్రా. / లీటరు నీటికి కలిపి పొట్టదశలో 50 శాతం పూతదశలో పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా నివారించవచ్చు.
బి. రాజేశ్వరి ప్రధాన శాస్త్రవేత్త, ఫోన్‌ : 9912655843
Leave Your Comments

Black Sugarcane: నల్ల చెరకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Lemon Price: నిమ్మకాయల ధరలు పెరుగుదలకు కారణాలివే

Next article

You may also like