Green Manure Importance: సేంద్రీయ వ్యవసాయం లో కృత్రిమ రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు పెరుగుదలకు వాడే రసాయన మందులు వాడకం పూర్తిగా నిషేధించి భూమి ఆరోగ్యం కాపాడుతూ భూమి యొక్క సారం పెంచుతూ వాతావరణం కలుషితం కాకుండా జీవవైవిధ్యాన్ని కాపాడుతూ మానవాళి ఆరోగ్యాన్ని రక్షిస్తూ చేసేదే సేంద్రియ వ్యవసాయం. దీనిలో ముఖ్యంగా నేల మొక్కలు జంతువులు మరియు మానవాళి ఆరోగ్యరక్షణ సహజ వనరుల సుస్థిర మరియు సంరక్షణ కాలుష్య రహిత వాతావరణం మరియు నాణ్యమైన జీవనశైలి రాబోయే తరాలకు అందించాల్సిన పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుంది సేంద్రియ వ్యవసాయం వలన నేల స్వభావం లో మార్పులు వచ్చి సేంద్రియ కర్బనం వృద్ధి చెంది నెలలో సహజంగా ఉన్న పోషకాలు మొక్కలకు అందించవచ్చు.
రసాయనిక ఎరువుల వలన వచ్చే పరిణామాలను పచ్చిరొట్ట ఎరువులు ద్వారా తగ్గించవచ్చు నేల యొక్క భౌతిక స్థితిని మెరుగుపరిచేందుకు భూమి యొక్క సారాన్ని పెంచేందుకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువు ద్వారా భూసారాన్ని పరిరక్షించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో వివిధ కారణాల వల్ల పశువుల సంఖ్య తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువులు తగినంత లభించడం లేదు. క్షీణిస్తున్న భూభౌతిక పరిస్థితి క్రమంగా నిస్సారం అవుతున్న భూములను పరిరక్షించడానికి సేంద్రియ పదార్థాలు అందించే ప్రక్రియలో పచ్చిరొట్ట సాగు చాలా ఉపయోగపడుతుంది సేంద్రియ ఎరువును అందించే పచ్చిరొట్ట పైర్లు పెంపకం మరియు వినియోగం చాలా సులభమైనది కాకుండా తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ పోషకాలు అందిస్తుంది.
Also Read: Artificially Ripened Fruits: కృత్రిమంగా పండించిన పండ్లను స్వాధీనం చేసుకున్న FSSAI
జనుము, జీలుగ,పిల్లి పెసర, అలసంద వంటి పైరును పూత దశ వరకు పెంచి భూమి లోకి కలియ దున్నడం ద్వారా త్వరగా కుళ్ళుతాయి. ఆకుల లో ఎక్కువ శాతం నత్రజని కలిగి ఉంటాయి కావున పచ్చిరొట్ట ఎరువులు ద్వారా నత్రజని అందించడమే కాకుండా లెగ్యూమ్ జాతికి చెందిన పంట వేయడం వలన వీటి వేర్ల ద్వారా గాలిలోని నత్రజనిని కూడా స్వీకరించి భూమికి అందించడంలో వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
పచ్చిరొట్ట ఎరువులు అనగా;
పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను పచ్చిరొట్ట ఎరువులు అంటారు.
పచ్చి రొట్ట ఎరువులకు వాడే మొక్కలు
జనుము
జీలుగ
సిమ జీలుగ
పిల్లి పెసర
నీలి
అడవి నీలి ( వెంపలి)
వివిద పచ్చిరొట్ట పంటలు మరియు వాటి గుణగణాలు
జీలుగ, సీమ జీలుగ
దీనిని ఎక్కువగా చౌడు భూములు అనగా క్షార గుణం గల భూముల్లో మరియు వరి పండించే భూముల్లో వేస్తారు. ఒక ఎకరానికి 12 కిలోల విత్తనం ఇసుక తో కలిపి చల్లడం వలన పొలం అంతా సమానంగా పడుతుంది. ఈ పంటను పూత దశలో కలిగి దున్నడం వలన ఒక ఎకరానికి 8 నుండి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది
కట్టె జనుము
కట్ట జనుము పంటను అన్ని రకాల భూముల్లో పండించుకోవచ్చు. ఈ పంట పచ్చి రొట్ట గాను మరియు పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం చల్లుకునట్లుయితే. ఒక ఎకరంలో 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట వస్తోంది.
పిల్లి పెసర
ఈ పంటను తేలిక మరియు బరువు నెలలో మాత్రమే సాగు చేయవలెను. చౌడు భూములు అనగా క్షార భూములలో ఈ పంట సాగు పనికిరాదు. ఎకరానికి 8 కిలోల విత్తనం వరకు అవసరం ఉంటుంది. దీనిలో 3 నుండి 4 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది.
నీలి వెంపలి
ఇది చాలా ప్రదేశాల్లో కలుపుమొక్కలు గా కనబడతాయి వీటిని పచ్చిరొట్ట ఎరువు గా వాడుకోవచ్చు ఎకరానికి 8 నుండి 10 కిలోల విత్తనం సరిపోతుంది అన్ని రకాల నేలల్లో కూడా వేసుకోవచ్చు.
పచ్చి రొట్ట ఎరువు ఏ సమయంలో కలియదున్నాలి:
పూత దశ కు రాగానే పొద్దున అత్యధిక పరిమాణంలో నేలకు కావలసిన పోషకాలు పొందడం జరుగుతుంది.
భూమి యొక్క సారం వృద్ధి చేయడంలో పచ్చిరొట్ట పైర్ల ప్రాముఖ్యత:
ఇటీవల మనదేశంలో జనాభా క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా వ్యవసాయ భూమి పెరగడం లేదు. అంతేకాక జలవనరులు అడవుల విస్తీర్ణం సంపదలు మొదలైనవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పూర్వకాలంలో రైతులు వ్యవసాయంతో పాటు పాడికి కూడా అధిక ప్రాముఖ్యతను ఇస్తూ పశువుల నుండి వచ్చే ఎరువులను తమ తమ పొలంలో ఎరువుగా వాడుకునేవారు దానివలన భూమిలో వేసి న పైరుకు ఎంతో ఉపయోగకరంగా ఉండడమేకాక అధిక దిగుబడులు మరియు భూమి యొక్క సారం పెరగడానికి కూడా తోత్పడేది.
కానీ కొన్ని సంవత్సరాల నుండి క్రమక్రమంగా రైతాంగనికి పశువుల సంపదపై ఆసక్తి తగ్గడం మరియు రసాయనిక ఎరువుల వాడకం అధికంగా పెరగడం జరుగుతుంది. రసాయనిక ఎరువులను విచక్షణరహితంగా వాడటం వలన భూ భౌతిక రసాయనిక స్థితిగతులు క్షీణిస్తున్నాయి. దానివలన పురుగులు మరియు తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు పంట దిగుబడి తగ్గిపోతుంది. రసాయనిక ఎరువులు వాడడం వలన పంట ఖర్చులు పెరగడం మరియు పర్యావరణ కాలుష్యం, జల కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది.
ఇటీవల ప్రజలుకు సేంద్రియ ఆహార పదార్థాలపై ఆసక్తి పెరుగుతోంది .ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతాంగం తమ యొక్క భూమి పై పైరు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో పచ్చిరొట్ట పంటను సాగు చేసినట్లయితే నేల స్వభావం సారవంతమై నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి మొక్కల వేర్లు లోతుగా పాకడానికి సహాయం చేసి రసాయనిక ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను అధిగమించి రసాయనిక ఎరువుల పై కొంత వరకు ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
పచ్చి రొట్ట ఎరువు వలన ఉపయోగాలు:
1. పచ్చిరొట్ట పంటను పెంచడం వలన భూమిలో సేంద్రీయ పదార్థాలను పెంచుతోంది. దీనివలన భూమిలో నీటిని నిల్వ చేసుకునే స్వభావం పెరిగి భూభౌతిక ,రసాయనిక గుణములలో మార్పు తెచ్చుటకు దోహద పడుతోంది.
2. పచ్చి రొట్టె పంటలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండటం వలన సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధిచెంది భూసార ప్రక్రియను త్వరితంగా పెంపొందిస్తాయి.
3. చార భూములలో అనగా సమస్యాత్మక భూములలో పచ్చిరొట్ట ఎరువులు వాడడం వలన చౌడు విరిగి మొక్కకు మంచి పోషకాలు అందించడానికి దోహదపడుతుంది.
4. రకరకాల పోషకాలను నాలుగు నుండి ఆరు వారాల లోపు స్థిరీకరించి మొక్కలకు లభ్యం కాని పోషకాలను కూడా అందించడం జరుగుతోంది.
5. నేలకోతను అరికట్టి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి రసాయనిక ఎరువుల మోతాదు కొంత వరకు తగ్గించి మరియు నాణ్యమైన పంట పండించుకోవచ్చు.
6. మొక్కల వేరు వ్యవస్థ కు కావలసిన నత్రజని మరియు ఆమ్లజని నీ అందుబాటులో ఉంచుతోంది.
7. జింకు మరియు ఇతర సూక్ష్మ పోషక పదార్థాలలో లోపాలు సవరించబడతాయి
8. పచ్చి రొట్టె ఎరువులు పండించిన నేలలలో వేసిన పంటలు 15 శాతం వరకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది మరియు నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
పచ్చిరొట్ట పంట సాగు చేయు విధానము:
నీటి వసతి మరియు నేల స్వభావం తో పాటుగా మెట్ట మాగాణి లో సాగు చేయ బోయే పైర్లు దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. పప్పు జాతి పచ్చిరొట్ట పంటలు అయితే వాతావరణంలో నత్రజని గ్రహించి వాటి వద్ద నిల్వ చేసుకుంటాయి మరియు భూమిలో వేసిన నత్రజని సరఫరా చేస్తాయి.
వివిద పచ్చిరొట్ట పంటలలో పోషకాల శాతం
క్రమ.సం పచ్చిరొట్ట పేరు నత్రజని(%) బాస్వరం(%) పొటాష్(%)
1 కట్టేజనుము 0.75 0.12 0.51
2 జీలుగ 0.62 0.15 0.46
3 పిల్లిపెసర 0.72 0.10 0.53
4 అలసంద 0.71 0.15 0.58
పొలాన్ని దున్నిన తర్వాత తొలకరి వర్షాలు పడే సమయంలో పచ్చిరొట్ట సాగుకు అనుకూలం. తొలకరి వర్షాలు పడగానే ఒత్తుగా విత్తనాలు చల్లుకోవాలి. దీనివలన పైరు ఏపుగా పెరుగుతోంది. వరి మాగాణి వేసే పొలంలో జీలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ పైరు విత్తిన 40 నుండి 45 రోజులలో కోతకు వస్తుంది పైరు కోతకు వచ్చిన సమయంలోభూమిలో కలియదున్నాలి లేదా దమ్ము చేయాలి.
ఈ సమయంలో 10 నుండి 15 సెంటీమీటర్లు నీరు నిల్వ కట్టి దమ్ము చేయాలి తర్వాత ఎకరానికి 10 కిలోల సూపర్ ఫాస్పేట్ వేయడం వలన పచ్చిరొట్ట పైరు బాగా కుళ్లుతుంది తరువాత పది రోజులకు ఆఖరి దమ్ము చేసుకోవాలి. జనుము, పిల్లిపెసర అలసంద మరియు ఉలవ వంటి పేర్లు కూడా విత్తనం చల్లి పూత దశలో నెలలో కలియదున్ని ఈ వారం పది రోజుల తరువాత విత్తుకోవాలి. జిల్లేడు,తుంగ, నేల తంగేడు చెట్ల ఆకులుకూడా పచ్చిరొట్టఎరువుగా కూడా వాడొచ్చు. పొలం గట్ల వెంట బావుల దగ్గర గ్లైరిసిడియా చెట్లు నాటితే ఒక చెట్టు ఏటా రెండు సార్లు (జూలై డిసెంబర్ నెలలో) ఒక్కో చెట్టు వద్ద నుండి 125 కిలోల పచ్చిరొట్ట ఇస్తుంది.
డా .పి అమర జ్యోతి, డా.బి.మౌనిక , డా. జి .నవీన్ కుమార్ , డా .డి.చిన్నం నాయుడు
కృషి విజ్ణాన కేంద్రం , ఆమదాలవలస, శ్రీకాకులం జిల్లా.
Also Read: Nursery Management in Brinjal: వంకాయ సాగులో నర్సరీ యాజమాన్యం