ఆరోగ్యం / జీవన విధానం

రంగు రంగు పూలతో టీలు – తయారీ విధానం

0

పూలు రంగు రంగులుగా చూడచక్కగా ఉండి కనువిందు చేయడంతోపాటు మనసునూ ఆనందంతో నింపేస్తాయి. అంతేకాదు వాటితో తయారుచేసే వివిధ రకాల టీలు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
గులాబీ టీ:
కావాల్సిన పదార్థాలు: ఎండిన గులాబీలు- మూడు, గులాబీ నీరు – టీ స్పూన్, తేనె- రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అర టీస్పూన్, నీళ్లు – లీటరు, గ్రీన్ టీ బ్యాగ్లు – రెండు.
తయారీ:
పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీ రేకులు, నిమ్మరసం వేయాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీ రేకులు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీ నీరు వేసి బాగా కలపాలి. పాలతో కూడా దీన్ని తయారుచేయెచ్చు.
ప్రయోజనాలు:
దీంట్లో ఎక్కువగా ఉండే విటమిన్ – సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.
శంఖు పుష్పాలతో టీ:
కావాల్సిన పదార్థాలు: శంఖు పుష్పాల రేకులు – అరకప్పు, తేనె – టేబుల్ స్పూన్, నిమ్మచెక్క – ఒకటి, నీళ్లు – రెండు కప్పులు.
తయారీ:
నీళ్లను మరిగించి అందులో శంఖు పుష్పాల రేకులను వేయాలి. తక్కువ మంట మీద కాసేపు మరిగిస్తే రంగు దిగుతుంది. ఈ నీళ్లలో తేనె కలిపితే తేనీరు సిద్ధం అవుతుంది. తర్వాత నిమ్మరసం పిండుకుని వేడిగా తాగేయాలి. అలాగే కొబ్బరినీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసి దీన్ని చల్లగానూ తయారుచేసుకుని తాగొచ్చు. ప్రయోజనాలు:
ఆందోళన, ఒత్తిడిని నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శక్తిస్థాయిలను పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
గోంగూరపూలతో టీ:
కావాల్సిన పదార్థాలు: ఎండిన గోంగూరపూలు – ఆరు, నీళ్లు – రెండు కప్పులు, తేనె – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ:
నీళ్లను బాగా మరిగించి దాంట్లో గోంగూరపూల రేకులను వేయాలి. స్టవ్ ఆపేసి గిన్నె మీద మూతపెట్టి ఐదు నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. అప్పుడు పూలలోని సారమంతా నీళ్ళలోకి దిగుతుంది. చివరగా తేనె కలిపితే సరిపోతుంది.
ప్రయోజనాలు:
వీటిల్లో విటమిన్ – ఎ, సి, ఇనుము, జింక్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు అంతర్గత వాపులను నియంత్రిస్తాయి.

Leave Your Comments

నిప్పులు కురుస్తున్నఎండలు మన మంచికే అంటా..

Previous article

ఇంటిని ఉద్యానవనంలా మార్చిన దంపతులు..

Next article

You may also like