స్త్రీల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తే స్త్రీలు శారీరక, మానసిక ,సాంఘిక ,ఆరోగ్యాన్ని పొందటానికి ప్రతి స్థాయిలోనూ అడ్డంకులున్నాయనేది సృష్టం. శారీరక ఆరోగ్యానికి సరైన తిండి, శుభ్రమైన నీరు, గాలి అవసరము. మహిళల జీవితంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలను పరిశీలిస్తే అనార్యోగ్యం మీద పోరాటం,లైంగిక వివక్షత ,పేదరికం మీద పోరాటామేనని తేలింది.
ఏ సమాజంలోనైనా ఒక కుటుంబం వారి ఆరోగ్య విషయమై ఎంత శ్రద్ధ తీసుకుంటుంది అనే విషయం ప్రధానంగా వారి విద్యా స్థాయిలమీద ఆధారపడుతుంది. కనీసపు చదువు ఉన్నవారికి ఆరోగ్యం కాపాడుకోవటానికి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తేలికగా అవగాహన కలుగుతుంది. కుటుంబ సభ్యులను పరిశిలిస్తే వారి ఆరోగ్యం గురించి రోజువారీ స్థాయిలో శ్రద్దవహించేది. జాగ్రత్తలు తీసుకునేది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించేది స్త్రీలే అని చెప్పాలి. అంటే స్త్రీ విద్యే కుటుంబ సభ్యుల ఆరోగ్యస్థాయి మీద, ఆరోగ్యం గూర్చిన శ్రద్ధ అవగాహనల మీద పూర్తి ప్రభావం చూపుతుంది అని అర్ధం.
పోషకాహార, రక్త హీనత వల్ల 60 – 80 % మంది తల్లులు తక్కువ బరువు అంటే 2.5 కేజీల కంటే తక్కువ బరువుగల పిల్లలను ప్రసవిస్తున్నారు. ఒక స్త్రీకి కలగే పిల్లల సంఖ్య, గర్భదారణ , ప్రసూతి , బాలింత సమయంలో స్త్రీల మరణాలు 1 సం. లో శిశుమరణాల సంఖ్య ( వెయ్యి సజీవ జననాలకి) స్త్రీల పోషకాహార స్థితి వారి ఆరోగ్యం పై ఆధారపడి వుంటుంది.
స్త్రీ విద్యావంతురాలైతే ఆహార ఆరోగ్య విషయాలలో అవగాహన ఏర్పరచుకొని పైన పైన పేర్కొన్న అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటుంది.
గ్రామాల్లో అందరూ ముఖ్యంగా స్త్రీలు సరిపడినంత ఆహారం తీసుకోవటం లేదు. ప్రతి మనిషి ఆరోగ్యం, ముఖ్యంగా తాము తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది . ఆస్తి హక్కు లేకపోవటం, స్త్రీలలో కొనుగోలు శక్తి తగ్గిపోవటం, సమాన వేతన చట్టం సరిగా అమలుకాకపోవటం, లింగ వివక్షత వలన స్త్రీలు ముఖ్యంగా ఆడపిల్లలు ఆహార లేమికి గురి అవుతున్నారు. స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించడం వలన వారికి లభించే ఆహారపు పరిమాణం పోషక విలువలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వినియోగ సంస్కృతి వలన ఆహారపు అలవాట్లలో గ్రామీణ ప్రాంత ప్రజలలో మార్పు కూడా దీనికి కారణం అవుతుంది.
ఏది ఏమైనా స్త్రీల ఆరోగ్యం స్త్రీల చేతుల్లో ఉంది. స్త్రీలు తప్పనిసరిగా మంచి ఆహారము మరియు కొన్ని మూల సూత్రాలను పాటిస్తే ఆరోగ్యవంతురాలుగా ఒక ఉత్తమ పౌరురాలిగా కుటుంబానికే గాక సమాజాన్ని ముందుకు నడిపించగల శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకోగలుగుతుంది.
Also Read : పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి
ఆరోగ్య సూత్రాలు :-
-
ఆహారం : ప్రతి స్త్రీ పోషకాహారం తీసుకోవాలి అంటే అందుబాటులో ఉండే చౌకగా లభించే అన్ని కూరగాయలు ,పండ్లు, పప్పులు ప్రతి రోజు ఆహారంలో తినాలి. ముఖ్యంగా గర్భిణీలు , బాలింతలు తప్పక మంచి ఆహారం అదనంగా తినాలి. అనుదిన ఆహారంలో విటమిన్లు , ఖనిజ లవణాలు సరిపోయినంత మోతాదులో ఉండాలి.
-
ద్రవ పదార్ధాలు : రోజుకు 2 లీటర్లు ద్రవ పదార్దాలు ప్రతి స్త్రీ తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని త్రాగాలి.గర్భిణీలు, బాలింతలు పాలు తప్పక త్రాగాలి.
-
నడక : రోజులో వీలైనంత వరకు అంటే అవసరమున్నప్పుడల్లా నడవాలి. ముఖ్యంగా 45 సం . పై బడిన స్త్రీలు ఎక్కువగా నడవాలి నడక వల్ల ఎముకలు గట్టి పడతాయి.
-
విశ్రాంతి : రోజులో కొన్ని నిముషాలు తమ కోసం కేటాయించికోవాలి. ముఖ్యంగా గర్భిణీలకు బాలింతలకు విశ్రాంతి అవసరం.
వీటన్నింటికి మూలం శరీర ఆరోగ్యం అందుకే స్త్రీ తమ ఆరోగ్యానికి తామే బాధ్యత తీసుకోవాలి. స్త్రీల ఆరోగ్యం స్త్రీ చేతుల్లోనే ఉంది. మహిళల సంక్షేమం , ప్రగతికి రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వ ప్రభుత్వేతర సంక్షేమ పధకాల సేవలను స్త్రీలు సద్వినియోగపరచుకోని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పనిని బట్టి స్త్రీలు ఒక రోజుకు తీసుకోవాల్సిన ఆహార పదార్దాలు (గ్రాములలో ఈ క్రింది పట్టిక పొందు పరచబడినది)
ఆహార పదార్దాలు తేలికపని ఒక మాదిరిపని కాయకష్టం
ధాన్యాలు 300 360 480
పప్పు ధాన్యాలు 60 75 90
పాలు(మి.లీ) 300 300 300
దుంపలు 100 100 200
ఆకు కూరలు 100 100 100
ఇతర కూరగాయలు 100 100 100
పండ్లు 100 100 100
చక్కర / బెల్లం 20 25 40
క్రొవ్వులు/నూనెలు 20 30 40
పైన పేర్కొన్న అన్ని ఆహార పదార్దాలు మనకు అందుబాటులో ఉన్నవే. పాలు, పప్పులు ,పండ్లు ఖరేధైనవే. వీలైనంత వరకు పండ్లు , కూరగాయలు ఇంటి పెరటిలో, చేల గట్ల మీద పండించుకోవడం వల్ల ఆ డబ్బు మిగతా ఆహార పదార్దాల కొనుగోలును వినియోగించవచ్చు.
ఎ. నీలిమ, పి. సౌజన్య ,డా .యన్ స్రవంతి, డా.కె. తేజేశ్వరరావు మరియు డా . జి రామారావు కృషి విజ్ఞాన కేంద్రం ,రస్తాకుటుంబాయి ,విజయనగరం జిల్లా
Also Read : ధాన్యం సేకరణపై లోక్‌సభలో టీఆర్ఎస్ సమర శంఖం…