జామ :- కాయలు కోసిన తర్వాత తోటను దున్ని, పాదుల్లో కలుపు తీసి, 30 కిలోల పశువుల ఎరువు, 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ లను చెట్టు మొదలు నుండి 1 మీటర్ల దూరంలో 25 సెం.మీ లోతు గాడి తీసి,ఎరువులను వేసి పాదుల్లో నీటి తడి పెట్టాలి. పిండినల్లి ఉధృతి అధికంగా ఉన్న తోటల్లో చెట్టుకు 250 గ్రా. క్లోరిపైరిఫాస్ పొడి మందును పాదుల్లో చల్లి మట్టిలో కలిసేటట్లు చేయాలి.
అరటి : – పండ్ల పరిమాణము మరియు నాణ్యత పెంచుటకు గెలలోని ఆఖరి హస్తం విచ్చుకొన్ని 5వ రోజున మరియు 15 రోజున సల్ఫేట్ ఆఫ్ పోటాష్ 5 గ్రా. లీటరు నీటిలో కలిపి గెలలపై పిచికారి చేయాలి. పేను, పిండి పురుగుల నివారణకు డైమోదోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చేసుకోవాలి. ద్రాక్ష : పూ గుత్తుల పొడవు పెరగడానికి ఒబ్బరిల్లిక్ ఆమ్లం 10 పి.పి.యం రెండుసార్లు పిచికారి చేయాలి. పూ గుత్తిలోని పువ్వులు విచ్చుకొని దశలో 15 పి .పి.యమ్ ద్రావణంలో పూగుత్తిని ముంచాలి. కత్తిరింపులు జరిపిన 20వ ,40వ రోజున ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి భూమిని తడిపినట్లితే పిండి నల్లిని నివారించవచ్చు. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మీ.లీటరు లేదా ధయోమిధక్సీం 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
సపోటా :- ఇటీవల అధిక వర్షాల వల్ల భూమి లో అధిక తేమ వల్ల ఆకు మచ్చ తెగులు కనిపిస్తుంది. చిన్నచిన్న వలయాకారపు మచ్చలు తెల్లని మధ్యభాగం , ఎరుపు రంగు అంచులతో ఏర్పడతాయి. మచ్చలు ఆకులకు రెండువైపులా ఏర్పడతాయి. మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకు రాలి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు 3 .గ్రాముల. కాపర్ ఆక్సి క్లోరైడ్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
యాపిల్ రేగు :- కాయతొలుచు పురుగుల లార్వాలు పండును తొలిచి లోపల గుజ్జును తింటాయి. ఈ పురుగును ఆశించిన కాయలు కూలిపోతాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డెల్టా మోత్రిన్ 1 మీ. లీటర్లు కలిపి 2 -3 సార్లు బటాని గింజ సైజు నుండి పిచికారి చేసుకోవాలి.
మామిడి :- మామిడి తోటలను నీటి ఎద్దడికి గురిచేస్తే చెట్లు పూత దశకు చేరుకుంటాయి. శాఖీయ పెరుగుదల ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 1-2 మీ.లీ సైకోసిల్ కలిపి పిచికారి చేసి పెరుగుదలను నియంత్రించాలి. చెట్లకు చెదలు ఉంటే వాటిని దులిపి క్లోరిపైరిఫాస్ 20 శాతం ఒక లీటర్ మందును 10 లీటర్ల నీటితో కలిపిన ద్రావణాన్ని మీటర్ల ఎత్తు వరకు కాండం పై పూతల పూయాలి. చెట్టు కాండం మొదలులో నేల బాగా తడిచేలా చూడాలి. పిండి పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీ లీటర్ల క్వినాల్ ఫాస్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చెట్ల బాగాలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. వీటివల్ల పురుగులు చెట్ల కాండం మీదకు పాకకుండా శీతాకాలంలో చెట్టు మొదలుకు భూమి నుంచి అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివి గల పాలిథిన్ షీట్ చుట్టి షీట్ గ్రీజు పూయాలి.
కూరగాయలు :
టమాటా : – కాయ తొలుచు పురుగు నివారణకు నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. మొక్కల పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత వరకు 5% వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి. తామర పురుగులు, పచ్చదోమ నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమాటాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వంగ : – నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికలను 100 చ.మీటర్ల నారుమడికి వేయాలి. ఎకరాకు 200 కిలోల వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాలలో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి.
క్యాబేజీ : – క్యాబేజీ రెక్కల పురుగు ఆకుల అడుగుభాగాన ఉండి, ఆకులను తిని నాశనం చేస్తుంది. దీని నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పుచ్చ , ఖర్భుజా :- పుచ్చ , ఖర్భుజాలను ఈ మాసం రెండవ పక్షం నుండి విత్తుకోవచ్చు. దీనికోసం 2 – 2.5 మీటర్ల ఎడంతో, 60 సెంటీ.మీటర్ల వెడల్పు గల నీటి కాలువలు తయారుచేసుకొని కాలువలకు ఇరువైపులా 30 నుండి 50 సెంటీ.మీటర్ల విత్తనాలు విత్తుకోవాలి. 500 గ్రాములు విత్తనం ఎకరాకు సరిపోతుంది.
మునగ : మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో వేరుకుళ్లు కాండం కుళ్ళు కనిపిస్తుంది. వేర్లు కుళ్ళి పోయి చెట్టు చనిపోతుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళి పోయి ,చెట్టు విరిగి పోతుంది. నివారణకు మొక్కల మొదళ్ల వద్ద 1 గ్రా. కార్బండిజమ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రా .లీటరు నీటికి కలిపి బాగా తడపాలి. మొక్కలకు 3,6 ,9 నెలలకొకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేసి నీరు కట్టాలి.
ఉల్లి : – యాసంగి ఉల్లి కోసం ఈ మాసంలో నారు పోసుకోవాలి. నేలను బాగా దున్ని అలా 120 సె.మీ వెడల్పు, 3 మీటర్ల పొడవుగల ఎత్తైన మళ్ళను తయారుచేసుకుని విత్తనాన్ని పలుచగా వరసల్లో పోయాలి. నారు కుళ్ళు తెగులు సోకకుండా 10 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సి క్లోరైడ్ 3. గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read : కిలో రూ.150 చేరిన వంకాయ..