ఆరోగ్యం / జీవన విధానం

వేసవికాలంలో శక్తి కోసం తీసుకోవాల్సిన జావలు .. తయారీ విధానం

0

వేసవికాలంలో ఎక్కువగా చిన్న పని చేసినా నీరసం అలాంటప్పుడు కాస్త జావ తాగితే చాలు. రోజంతా ఉత్సహంగా పనిచేసుకోగలుగుతాం. ఇంకెందుకాలస్యం.. రకరకాల జావలను మీరూ ప్రయత్నించండి మరి.

బార్లీ జావ :
కావాల్సిన పదార్థాలు:
బార్లీ గింజలు పావుకప్పు, మజ్జిగ కప్పు, దానిమ్మ గింజలు గుప్పెడు, ఉప్పు తగినంత.
తయారీ:
బార్లీ గింజలను కడిగి నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. ఇలాచేస్తే త్వరగా ఉడుకుతాయి. ఈ గింజలను కుక్కర్ లో వేసి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే అంత వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వడపోసి పటిక బెల్లం, నిమ్మరసం కలిపి తాగొచ్చు. పల్చటి మజ్జిగ కలిపి దానిమ్మ గింజలు వేసుకుని కూడా తాగొచ్చు. మజ్జిగకు బదులుగా పుచ్చకాయ రసం పైనాపిల్ రసం కలిపి తాగినా చాలా రుచిగా ఉంటుంది.
రాగి జావ:
కావాల్సిన పదార్థాలు:
రాగిపిండి రెండు టేబుల్ స్పూన్లు, బెల్లం చిన్న ముక్క, పాలు అరకప్పు , యాలకులపొడి చిటికెడు,
మజ్జిగ జావ కోసం: రాగిపిండి రెండు టేబుల్ స్పూన్లు, పల్చటి మజ్జిగ కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, జీలకర్ర పొడి చిటికెడు, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత.
తయారీ:
రాగిపిండిని అరకప్పు నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలిపి సన్నని మంట మీద ఉండలు కట్టకుండా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలపాటు ఉడికించాలి. జావ తియ్యగా కావాలంటే కొద్దిగా బెల్లం, అరకప్పు పాలు, చిటికెడు యాలకుల పొడి వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మజ్జిగతో కావాలంటే.. జావ తయారైన తర్వాత పల్చటి మజ్జిగ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చాలి.
సత్తు:
కావాల్సిన పదార్థాలు:
సత్తు పిండి రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక్కోటి చొప్పున, నిమ్మరసం టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు చిటికెడు.
తయారీ:
కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. రెండు గ్లాసుల నీటిలో సత్తుపిండిని కలిపి దీన్ని ఉల్లిపాయల్లో వేసి మిశ్రమం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండాలి. తియ్యటి సత్తు కోసం:రెండు గ్లాసుల నీళ్లలో సత్తుపిండి వేసి ఉడికించాలి. దీన్తలో పంచదార / బెల్లంపొడి వేసి బాగా కలపాలి. దీన్ని పేదవారి ప్రోటీన్ అనికూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తాగుతారు గోధుమలు, జొన్నలు, బార్లీతో చేసిన సత్తుపిండిలో వేయించిన శనగపిండి కలుపుతారు. ఇది మార్కెట్లోనూ అందుబాటులో ఉంటుంది. సత్తు షర్బత్ ని బీహార్, ఝార్ఖండ్ లో ఎంతో ఇష్టంగా తాగుతారు. ఎండలో పనిచేసే వారికి వడదెబ్బ నుంచి సత్తు రక్షణ కల్పిస్తుంది.
సగ్గు బియ్యం:
కావాల్సిన పదార్థాలు:
సగ్గుబియ్యం నాలుగు టేబుల్ స్పూన్లు, పాలు అరకప్పు, పంచదార టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు.
తయారీ:
సగ్గుబియ్యాన్ని రెండు, మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, పంచదార, ఉప్పు కలపాలి.
ఇది ఎండాకాలంలో వచ్చే నీళ్ల విరేచనాలను అరికట్టడానికి బాగా ఉపయోగడుతుంది. అయితే పాలు కాకుండా పెరుగుగానీ మజ్జిగ గానీ కలపాలి. ఉడికేటప్పుడే జీలకర్ర లేదా పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

Leave Your Comments

నూనెగింజల పంటల సాగుతో ఆదాయం పెంచుకోవచ్చు .. ఐఐఓఆర్ డైరెక్టర్ సుజాత

Previous article

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు శుభవార్త..

Next article

You may also like