శీతాకాంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో లభించే రుచికరమైన పండు సీతాఫలం. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే, శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సీతాఫలం పండ్లను మితంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలం పండ్లు లభిస్తున్నందున ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.
సీతాఫలం పండులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను అందిస్తాయి.
వంద గ్రామల సీతాఫలం పండ్ల గుజ్జులో:
వంద గ్రామల సీతాఫలం గుజ్జులో శక్తి 94 క్యాలరీలు, పిండిపదార్థాలు 23.64 గ్రాములు, ప్రొటీన్లు 2.06 గ్రాములు, కొవ్వులు 0.29 గ్రాములు, విటమిన్-సి 36.3 మి. గ్రా., కాల్షియం 24 మి.గ్రా., ఐరన్ 0.6 మి. గ్రా., మెగ్నీషియం 21 మి.గ్రా., ఫాస్పరస్ 32 మి.గ్రా., పొటాషియం 247 మి. గ్రా., సోడియం 9 మి.గ్రా., జింక్ 01 మి.గ్రా. పోషకాలు లభిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- సీతాఫలం పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పక్షవాతంవంటి వ్యాధులను నివారిస్తుంది.
- సీతాఫలంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు సీతాఫలం రోజువారీ అవసరాలలో 10 శాతం పొటాషియం, 6 శాతం మెగ్నీషియం లభిస్తుంది. ఒక వ్యక్తికి ప్రతిరోజూ అవసరమయ్యే పొటాషియం అవసరాన్ని తీర్చడానికి వారానికి 2 నుంచి 3 సీతాఫలం పండ్లను తినడం మంచిదంటున్నారు.
- సీతాఫలంలో పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉండటంవల్ల మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది. ఈ పండులోని ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయంలో మంట వంటి సమస్య నుంచి కాపాడి శరీరానికి శక్తినిస్తుంది.
- వారానికి రెండు మూడు సార్లు సీతాఫలాన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని చెబుతారు. ఒక కప్పు సీతాఫలంలో 160 గ్రాముల విటమిన్-బి6 ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లు సెరటోనిన్, డోపమైన్ స్రావాన్ని పెంచుతుంది. మానసిక స్థితిని బాగా ఉంచుతుంది
- సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, కైరోలాయిక్ యాసిడ్, విటమిన్-సి ఉంటాయి. సీతాఫలం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను ఈ పండ్లు నివారిస్తాయి. ఇంకా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అందుకే పరిమితంగా సీతాఫలం పండ్లను తింటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి.