ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం / జీవన విధానంఉద్యానశోభవార్తలు

పాఠశాలల్లో తోటల పెంపకంతో విద్యార్థుల్లో  వికాసం !

0

ప్రపంచం నేడు వేగంగా వృద్ధి చెందుతున్న దశలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ,యాంత్రీకరణ, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు… ఇవన్నీ  సహజ వనరులకు విఘాతం కలిగిస్తున్నాయి. గాలి, నేల నీరు, మొక్కలు జగతిలో జీవకోటికి జీవనాధారం అని మర్చిపోతున్న తరుణంలో దాని ఫలితంగా వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి.ఉష్ణోగ్రతలు పెరగడం, కరవు పరిస్థితులు అకాల వర్షాలతో వ్యవసాయం కుంటుబడుతుంది. దీంతో విద్య, ఉపాధి కోసం గ్రామీణ యువత పట్టణాలకు వలస వెళ్ళుతుండడంతో గ్రామాల్లో వ్యవసాయం చేసే వారి సంఖ్య ఘననీయంగా తగ్గిపోతుంది. ఆధునీకరణ, నాగరికత పేరుతో అనారోగ్య ఆహార అలవాట్లు పెరుగుతున్నాయి.దీంతో అనేక జీవనశైలి వ్యాధులు ప్రబులుతూ ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి.
పాఠశాలల స్థాయి నుంచే అవగాహన !
నేటి యువతలో పర్యావరణం, ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే పరిస్థితితో ముందుకెళితే మునుముందు అనేక ముప్పులు చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి విషమ పరిస్థితి నుంచి భావితరాలను కాపాడడానికి పాఠశాలల స్థాయి నుంచే పిల్లలను సన్నద్ధం చేయాలి. పర్యావరణం, ఆహారం, ఆరోగ్యానికి గల సంబంధాన్ని పిల్లలకు అర్థమయ్యేలా నేర్పించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. పాఠశాలల్లో తోటల పెంపకాన్ని పాఠ్యాంశంగా చేయడం ద్వారా ఈ బృహత్తర కార్యాన్ని నెరవేర్చవచ్చు. పాఠశాలలో తోటల పెంపకం ‘సమాజానికి ఉపయోగకర  పని” అనే పాఠ్యాంశంగా కొన్ని కేంద్రపాఠశాలల్లో అమలుచేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలుచేయాల్సిన అవసరం నేడు ఎంతైన ఉంది.

పాఠశాల తోటల పెంపకం- చేయదగ్గ పనులు:

  • విద్యార్థులను క్లాసుల వారీగా లేదా బృందాల వారీగా విభజించడం. తరగతి గదులకు దూరంగా ఒక చోట గుంతను తీసి పాఠశాల ఆవరణను శుభ్రపరచగా వచ్చిన చెత్త, వ్యర్థ పదార్థాలను పోగుచేసి ఈ గుంతల్లో వేసి కంపోస్టు ఎరువు తయారుచేయడం.
  • పాఠశాల ఆవరణలో పెంపకానికి అనువైన చెట్లను తయారు చేయడానికి వీలుగా నీటి ఆధారం ఉన్నచోట నర్సరీ ఏర్పాటు చేయడం.
  • నర్సరీలో పెంచిన మొక్కలను పాఠశాల ఆవరణలో అనువుగా నాటడం. ఉదాహరణకు నీడనిచ్చే చెట్లు, అలంకరణ చెట్లు, కూరగాయలు, పండ్లు, పూల చెట్లు మొదలైనవి. ఈ చెట్లకు కంపోస్టు గుంతలో తయారుచేసిన ఎరువు వాడుకోవడం.
  • చెట్లకు అవసరం మేరకు నీరు పెట్టడం, సంరక్షణ, చెట్లు పెరిగే వివిధ దశల గురించి విద్యార్థులకు విషదీకరించడం. ఉదాహరణకు నేల తయారీ, విత్తనం, ప్రవర్ధనం, నారు పెంపకం, నాటటడం పూత, కోత మొదలైనవి.
  • పర్యావరణ పరిరక్షణ -కాలుష్య నివారణ, ఆహారం, ఆరోగ్యంలో మొక్కల పాత్రను విద్యార్థులకు వివరించడం.

     పాఠశాలలో తోటల పెంపకంతో ప్రయోజనాలు:

  •    విద్యార్థులకు తోటపని చేయడం ద్వారా పనిపై గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అలవడుతుంది. పరస్పర సహకరాంతో సంఘటితంగా పనిచేయడం      విద్యార్థులకు అలవాటవుతుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి దేనినైనా   చేయగలమనే సామర్థ్యం సమకూరుతుంది.సహనం, నిశిత పరిశీలన  అలవాటవుతుంది. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపై అధ్యయనానికి వీలు కలుగుతుంది. జీవశాస్త్రంలో వివిధ అంశాలను నేరుగా పరిశీలించేందుకు సహజ ప్రయోగశాలగా తోటలు ఉపయోగపడతాయి.
  • ఆరోగ్యం, సమతులిత ఆహారం పట్ల అవగాహన పెరుగుతుంది.విద్యార్థుల్లో మొక్కల పెంపకం, పంటల సాగుపై ఆసక్తి పెరుగుతుంది.పాఠశాల ఆవణలు కాలుష్యరహితంగా, పరిశుభ్రంగా ఉండి విద్యాభివృద్ధికి దోహదపడుతుంది. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఉపయోగకరంగా ఉంటుంది.
    గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలన్నింటిలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. ఈ కార్యక్రమం అమలుకు అవసరమైన సాంకేతిక సూచనలను మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, అటవీశాఖ అధికారుల సహాయ సహకారాలు పొందవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే పాఠశాలల్లో తోటల పెంపకం ద్వారా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆహారం, ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలియజెప్పడంతో పాటు వారి మానసిన వికాసాన్ని పెంపొందించవచ్చు.
  •   –-మెరుగు భాస్కరయ్య, ఎడిఎ,
       వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రం,
       తిరుపతి, ఫోన్:8331057872.
Leave Your Comments

దోస జాతి మొక్కల్లో జిగురు కాండం తెగులు సమస్యా ?  

Previous article

గోగు పంటను ఆశించే పురుగులు – నివారణ

Next article

You may also like