ఆరోగ్యం / జీవన విధానం

అండు కొర్రలతో ఎన్నో ప్రయోజనాలు..

0

తృణ ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులోనూ అండు కొర్రల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయం, ఆత్రయిటిస్ (కీళ్ల వాతం), బీపీ, థైరాయిడ్, ఊబకాయం, కంటి సమస్యలు నివారణకు బాగా ఉపయోగపడుతాయి. అలాగే మెదడు, రక్తం, రొమ్ము, ఎముకలు, ఉదర, పేగులు, ఫిషర్, అల్సర్, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు కూడా బాగా పనిచేస్తాయి. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. అలాంటి అండు కొర్రలతో కొన్ని వంటకాలు చూద్దాం.
ఊతప్పం:
కావాల్సిన పదార్థాలు: అండు కొర్రలు – పావు కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద – టీ స్పూన్, నూనె – తగినంత, మినప్పప్పు – టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, టొమాటో తరుగు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం:
అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి గ్రైండర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ మీద పెనం వేడయ్యాక గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీరా తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరువాత ( రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
పొంగలి:
కావాల్సిన పదార్థాలు:
అండు కొర్రలు – అర కప్పు, నెయ్యి లేదా నూనె- తగినంత, కొబ్బరి పాలు- రెండు కప్పులు, పెసర పప్పు – అర కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, జీడీ పప్పు – 10, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – టీ స్పూను.
తయారీ విధానం:
పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టవ్ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఓ పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు వేసి మరోమారు కలియబెట్టాలి. స్టవ్ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది.
కిచిడి:
కావాల్సిన పదార్థాలు:
పెసర పప్పు – అర కప్పు, ఉల్లి తరుగు – అర కప్పు, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను, అండు కొర్రల రవ్వ – కప్పు, తరిగిన పచ్చి మిర్చి – నాలుగు, ఉప్పు – తగినంత, తరిగిన టొమాటో – ఒకటి, అల్లం – తురుము – అర టీ స్పూన్, ఆవాలు – టీ స్పూన్, పసుపు – కొద్దిగా , నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద బాణలిలో నెయ్యి వేసి నెయ్యి వేసి కరిగించుకొని ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించుకొని గిన్నె మీద మూత పెట్టి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. అంతే వేడి వేడి అండు కొర్రల కిచిడీ రెడీ.
ఉప్మా:
కావలసిన పదార్థాలు:
అండు కొర్రల రవ్వ – మూడు కప్పులు, పచ్చి శనగ పప్పు – టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, టొమాటో తరుగు – పావు కప్పు, మినప్పప్పు – టేబుల్ స్పూన్, ఉల్లి తరుగు – పావు కప్పు, అల్లం తరుము – టీ స్పూన్, జీల కర్ర – టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెమ్మలు, క్యారట్ తరుగు – పావు కప్పు.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద బాణలి వేడయ్యాక అండు కొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, పచ్చి శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, క్యారట్ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. అంతే వేడి వేడి అండు కొర్రల ఉప్మా రెడీ. దీన్ని కొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.

Leave Your Comments

ఉలవలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

కడక్ నాథ్ కోళ్ల పెంపకంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు..

Next article

You may also like