Eruvaaka Foundation Kisan Mahotsav 2023: ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవం 2023 మరియు వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, సిబ్బందికి అలానే కేఎల్-ఎసిఐసి బృందానికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరమండల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జీవి సుబ్బారెడ్డి గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ మార్కెటింగ్ అండ్ కోపరేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ చిరంజీవి చౌదరి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.
మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి, రైతులకు మరింతగా మేలు చేసే విధంగా నిర్వహించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను.
వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతులకు వాటి మీద అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా వాటి ఫలాలు అందరికీ అందటం లేదని చాలామంది రైతులు అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ముఖ్యంగా రైతులకు మరియు వ్యవసాయానికి సంబంధించిన సంస్థలకు మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందేమోనని అనిపిస్తుంది మరియు రైతులు అవగాహన కార్యక్రమంలో పాల్గొనటమే కష్టంగా మారింది.
రైతులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలకు వ్యవసాయ రంగ సంస్థల ప్రోత్సాహం చాలా అవసరం. రైతులకు వ్యవసాయ సంబంధ కార్యక్రమాల మీద ఆసక్తి కలగాలన్న లేదా వారికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అని నమ్మకం కలిగించాలన్న వ్యవసాయ సంబంధిత సంస్థల కృషి ఎంతైనా అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి చెందిన సంస్థలు కొన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. కానీ రైతు అవగాహన కార్యక్రమాల మీద ఎంత ఖర్చు చేస్తున్నాయి అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది రైతులు తమ బాధ్యతగా భావించి పర్యావరణానికి, భూమికి మేలు చేసే విధంగా తమ వంతు ప్రయత్నంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఆరోగ్య రీత్యా పట్టణాల్లో ఉండే ఒత్సాహికులు కొద్ది మంది గృహిణులు, విశ్రాంతి ఉద్యోగులు మిద్దె తోటలు నిర్వహిస్తున్నారు.
Also Read: ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవం – 2023, వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా
రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో వీరి మద్దతు అన్నివేళలా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మిద్దేతోట నిర్వాహకులు హాజరై తమ మద్దతును తెలపటమే కాకుండా వారి అనుభవాలను, సాగులోని మెళకువలను మిగతా వారితో పంచుకొంటూ ఎక్కువ మందిని ఆ రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారు. కాని గ్రామాల్లో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులు అవగాహన కార్యక్రమాల మీద అంత ఆసక్తి కనపర్చినట్టుగా వుండటం లేదు. ఎఫ్‌పిఒ సంస్థల్లో కూడా ముఖ్యమైన సభ్యులు తప్పించి మిగతా సభ్యులు కూడా అంత ఉత్సాహంగా ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు.
కార్యక్రమాలకు హాజరు అవ్వడానికి కూడాను ఆర్థిక సంబంధించిన విషయాలు కూడా ఉండవచ్చు లేదా వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు జరగటం లేదు అనే భావనలో ఉండవచ్చు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు గాని అలానే వ్యవసాయ సంస్థలు గాని రైతు అవగాహన కార్యక్రమాలకు తమ ప్రోత్సాహాన్ని అందించి వ్యవసాయ రంగానికి చెందిన కార్యక్రమాలకు రైతులు పాల్గొనే విధంగా మరింత సహకారం అందిస్తే వారు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మరింత మెళలకువలతో వ్యవసాయాన్ని మరింత లాభంగా చేసుకునే అవకాశం ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు మారిన రోజు నాణ్యమైన ఆహారం సమాజానికి అందించటమే కాకుండా రైతుల ఆర్ధిక పరిస్థితులు కూడా మారతాయి. ఆ దిశగా ఆలోచన చేసి ప్రబుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలు రైతులకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము.
Also Read: ఏరువాక ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్-2022.!