Pests in Millet Crop

Pests in Millet Crop:
1. వైరస్‌ తెగుళ్ళు:
పల్లాకు తెగులు : ఈ తెగులుకు కారకమైన జెమిని వైరస్‌ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులుపైన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి పసుపు మచ్చలు పెరిగి పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలుగా మొజాయిక్‌లా కనిపిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. పైరు మొత్తం పసుపు రంగులో కనిపిస్తుంది. పైరు లేత దశలో ఈ తెగులు ఆశించినట్లైతే మొక్కలు గిడసబారి, పూత రాక దిగుబడికి పూర్తి నష్టం వాటిల్లుతుంది. పైరు 40 – 50 రోజుల తర్వాత ఆశించినట్లైతే కాయలు వంకరలు తిరిగి పసుపుబారి గింజలు ఏర్పడక గింజ నాణ్యత కూడా తగ్గిపోయి మార్కెట్‌ ధర తగ్గుతుంది.
నివారణ: పల్లాకు తెగులును తట్టుకునే రకాలను (ఎల్‌.బి.జి. 752, టి.బి.జి 104, ఎల్‌.బి.జి. 787, పి.యు. 31) సాగు చేసుకోవాలి. పొలం చుట్టూ రక్షక పంటగా జొన్న కాని, మొక్కజొన్న కాని నాలుగు వరుసలలో విత్తుకున్నట్లయితే వైరస్‌ తెగుళ్ళను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులు అయిన తెల్లదోమ, పేనుబంక మరియు తామర పురుగులను ఒక పొలం నుండి వేరొక పొలంకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.
విత్తనశుద్ధి : 5 గ్రా. థయోమిథాక్సమ్‌ 70 డబ్ల్యు.ఎస్‌. లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. మందుతో విత్తనశుద్ధి చేసుకుని విత్తుకుంటే పైరు తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగులు నుండి రక్షణ పొందవచ్చు. పొలం గట్ల మీద, రోడ్డు ప్రక్కన పెరిగే పల్లాకు తెగులు కలుగ చేసే వైరస్‌కు ఆశ్రయం ఇచ్చే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి వేయాలి. పల్లాకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడా 20 గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు/పళ్లాలు/డబ్బాలను పైరు పైన ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. తెల్ల దోమ పంటను ఆశించకుండా విత్తిన 15 – 20 రోజుల వయసులో వికర్షకాలుగా పనిచేసే వేప నూనెను 5 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్‌ 1.5 గ్రా లేదా ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ లేదా అసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సమ్‌ 0.2 గ్రా. చొప్పున ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Pests in Millet Crop

Pests in Millet Crop

సీతాఫలం తెగులు : దీనినే బొబ్బరాకు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు లీఫ్‌ క్రింకిల్‌ వైరస్‌ వలన ఆశిస్తుంది. పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవిగా అయి ఆకుపై ఉబ్బెత్తుగా సీతాఫలం కాయలా కనిపిస్తాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలు సాధారణంగా పూత పూయవు, పూత పూసినా 10`15 రోజులు ఆలస్యంగానూ, కాపు తక్కువగాను ఉంటుంది.
నివారణ: దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకివేయాలి. విత్తనం ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది కావున తెగులు సోకిన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించరాదు. తెగులు వ్యాప్తికి కారకమైన పేనుబంక నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా అసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సమ్‌ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
ఆకు ముడత తెగులు : దీనినే తలమాడు తెగులు లేదా మొవ్వు కుళ్ళు తెగులు అని కూడా అంటారు. ఈ వైరస్‌ తెగులు తామర పురుగులు (త్రిప్స్‌) ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్ట వాతావరణ పరిస్థితులలో తామర పురుగు సంతతి పెరుగుదల ఎక్కువగా ఉండి తెగులు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగం లోని ఈనెలు ఎర్రగా రక్త వర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు కాస్తుంది.
నివారణ: దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరు లోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.పొలంలో అక్కడక్కడా 20 గ్రీజు పూసిన నీలం రంగు అట్టలు/పళ్లాలు/డబ్బాలను పైరు పైన ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి.తెగులు వ్యాప్తికి కారకమైన తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
2. శిలీంధ్ర తెగుళ్ళు :
బూడిద తెగులు :
ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తరువాత మచ్చలు నుండి శీలీంధ్ర భీజాలు ఉత్పత్తి అయి ఆకుల మీద తెల్లటి పొరగా ఏర్పడతాయి. ఆకులమీద బూడిద లాంటి పొర ఏర్పడటం వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు తగ్గడమే గాక గింజ నాణ్యత కూడా తగ్గుతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర కాండము, పిందెలు మరియు కాయల మీద కూడా వ్యాప్తి చెందుతుంది. రాత్రి పూట చలి గాను, పగటి పూట వేడి గాను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బూడిద తెగులు ఆశించడానికి మరియు ఉధృతి పెరగటానికి అనుకూలమైనవి.

Also Read: Foxtail Millets: అండుకొర్రల సాగు వర్షాభావ పరిస్థితులకు సరైన సమాధానం

నివారణ :
తెగులు నివారణ కొరకు మైక్లోబ్యుటానిల్‌ 1.0 గ్రా. లేదా హెక్సాకోనజోల్‌ 2.0 మి.లీ లేదా ప్రోపికోనాజోల్‌ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి 10 – 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారి చేసుకోవాలి.

కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు :
ఈ తెగులు కేవలం మినుము పంటను మాత్రమే ఆశిస్తుంది. పైరు 30 – 35 రోజుల దశలో ఈ తెగులు ఉధృతి ఉంటుంది. మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకు మారి ఆకులు ఎండిపోతాయి.
నివారణ :
కాపర్‌ ఆక్సీిక్లోరైడ్‌ 3.0 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 2.0 మి.లీ లేదా ప్రోపకొనజోల్‌ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు :
తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద చిన్న చిన్న గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల అంచులు క్రమేపీ ముదురు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మధ్యలో బూడిద రంగు చుక్కలు కలిగి ఉంటాయి. మచ్చలు క్రమేనా పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.

A Farmer from Millet crop

A Farmer from Millet crop

నివారణ :
ప్రోపికొనజోల్‌ 1.0 మి.లీ లేదా హెక్సాకొనజోల్‌ 2.0 మి.లీ లేదా థయోఫనేట్‌ మిథైల్‌ 1.0 గ్రా. లీటరు నీటికి కలిపి 10 – 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారి చేసుకోవాలి.
వడలు తెగులు/ ఎండు తెగులు :
వరి మాగాణి మినుము పంటలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం పై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు వంకర్లు తిరిగి క్రిందకు ముడుచుకొని, పసుపు రంగుకు మారి మొక్కలు వడలిపోయి క్రమేపీ చనిపోతాయి.
సమగ్ర యాజమాన్యం:
వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకుంటే భూమిలోని శిలీంద్ర బీజాలు చనిపోతాయి. పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎండు తెగులును తట్టుకొనే రకాలను (ఎల్‌.బి.జి 645, ఎల్‌.బి.జి 648) ఎన్నుకోవాలి. కిలో విత్తనానికి మాంకోజెబ్‌ 3 గ్రా. లేదా కార్బండజిం 2 గ్రా. కలిపి విత్తనశుద్ది చేసి విత్తుకునే ముందుగా కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తినట్లయితే ఈ తెగులును కొంతవరకు తగ్గించవచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని 80 కిలోలు మాగిన పశువుల ఎరువు మరియు 20 కిలోల వేపపిండితో కలిపి అభివృద్ధి పరచి విత్తుకునేటప్పుడు తగినంత తేమ ఉన్నప్పుడు భూమిలో కలియపెట్టవలెను.

Also Read: Ginger Cultivation: అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Also Watch: