వార్తలు

వరిలో జింక్ లోపం… కారణాలు ఏంటి ?

0
Zinc Deficiency of Crops
Zinc Deficiency of Crops

దిగుబడి పెంచేందుకు రైతులు రసాయనాలతో పంటలు పండిస్తున్నారు . రసాయన ఎరువులతో అధిక దిగుబడిని పొందేందుకు పెట్టే శ్రద్ధ నేలల సంరక్షణపై పెట్టడం లేదు. దీంతో అనేక మార్పలు మనం చూస్తున్నాం. ఆహారోత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగాం కానీ, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఆహార పంటల్లో పోషకాల లభ్యత క్రమంగా పడిపోవడం, నాణ్యత లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద సరైన మద్దతు ధర పలకడంలేదు. దీంతో రైతుకి పెద్ద సవాలుగా మారింది.

వరి, గోధుమ, మొక్కజొన్నల్లో గతంలో ఉన్న పోషకాలు నేడు కనిపించడం లేదు. గతంలో వరిలో జింక్‌ కిలోకు 27.1మి.గ్రా, ఐరన్‌ కిలోకు 59.8 మి.గ్రా. చొప్పున నమోదయ్యాయి. గోధుమలో ఇవి కిలోకు 33.3 మి.గ్రా, 57.6 మిల్లీ గ్రాముల చొప్పున ఉండేవి. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ పోషకాలు తగ్గినట్టు గుర్తించారు. వరిలో జింక్‌ కిలోకు 20.6 మి.గ్రా, ఐరన్‌ కిలోకు 43.1 మిల్లీ గ్రాములకు తగ్గగా, గోధుమలోనూ ఇవి కిలోకు 23.5 మి.గ్రా, 46.4 మిల్లీ గ్రాముల మేరకే నమోదయ్యాయి. జింక్‌ పాస్ఫేట్‌ మొక్కలకు అందకుండా భూమిలోనే ఉండిపోతున్నందు వల్లే వరి, గోధుమల్లో జింకు లోపం తలెత్తుతోంది.

ఇంతకీ జింక్ తగ్గడంతో పంటపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?. వరి ఆకులపై నుంచి 3లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నదిగా , పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బి చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్త పడకపోతే అధిక మొత్తంలో నష్టం చూడాల్సి ఉంటుంది.

వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరు పై జింక్‌ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్‌ లోపం వల్ల దాదాపు 10 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వ్యవసాయ శాఖ తరఫున సబ్సిడీపై జింక్‌ సల్ఫేట్‌ అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి. ఇటుక రంగుతో పైరు ఎర్రబారిన వెంటనే జింక్‌ వేసుకోవాలి . జింక్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది. పంటల్లో పోషకాల స్థాయి ఇనుమడించాలంటే సేంద్రియ వ్యవసాయ విధానాల ఆచరణ అత్యుత్తమ మార్గం.

#ZincDeficiency #Crops #EffectsofZincDeficiency #AgricultureLatestNews #Eruvaaka

Leave Your Comments

ఆ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

Previous article

దేశాభివృద్ధిలో వ్యవసాయం కీలకం : నీతి ఆయోగ్

Next article

You may also like