వార్తలు

అమ్మ చెప్పిందని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న యోగానంద్

0

పేరుకు ఆర్గానిక్ .. కానీ ఏది తినాలన్నా భయం.. సంకోచం. అది కూరగాయైన.. ఆకుకూరైనా .. పండ్లయినా.. తినే ఏ పదార్థమైనా కల్తీమయం.. ఇంకా చెప్పాలంటే రసాయనిక ఎరువులు.. పురుగుల మందుల మయం..దీంతో ఎక్కడ ఏది కొనాలన్నా.. తినాలన్నా భయం భయంగానే కొంటున్నాం.. తింటున్నాం.. దీనికి పరిష్కారమే ఉందంటున్నారు యోగానంద్. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వేయని కూరగాయల్ని, ఆకు కూరల్ని తినాలన్న లక్ష్యంతో సొంతంగా ఆయన సాగులోకి దిగారు. స్వతహాగా బిల్డర్ అయినా యోగానంద్ తీరిక వేళల్లో ఇక్కడ గడుపుతుంటారు. ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కు దగ్గరలో తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఓ ఎకరం స్థలంలో ఆయన సేంద్రియ సాగును మొదలుపెట్టారు. ఎలాంటి రసాయన ఎరువులు,పురుగు మందులు, తెగుళ్ల మందులు వాడకుండానే సహజ పద్ధతుల్లో ఆయన సాగు చేస్తున్నారు.
పాలకూర.. చుక్కకూర.. కొత్తిమీర .. పుదీనా.. మెంతికూర.. గోంగూర.. ఇలా మనం నిత్యా జీవితంలో ఉపయోగించే అన్ని రకాల ఆకుకూరలను సాగుచేస్తున్నారు.. తన ఇంటి అవసరాలు తీరాక.. ఎవరికీ అమ్మాల్సి అవసరం.. ఆలోచన లేకపోయినా.. నలుగురికి ఉపయోపడే పనిని విస్తరించి.. కొనసాగించాలన్న ఆలోచన చేశానంటున్నారు యోగానంద్. పూర్వికులది వ్యవసాయ కుటుంబమే అయినా.. ఈ జనరేషన్ పూర్తిగా వ్యాపార రంగంలోనే ఉండిపోయింది. అయినా తన తల్లి కోరిక మేరకు తొలుత ఇంటి కోసం మొదలు పెట్టిన ఈ సాగు ఇప్పుడు అందరికోసం చేస్తున్నామంటున్నారు. అయితే నిత్యం దీన్లో కలుపు తీయడం.. వచ్చిన వారికి కట్ చేసి ఇవ్వడం కోసం మనుషులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసిన పైరుకు నీటి కోసం డ్రిప్ సిస్టం ఏర్పాటు చేశారు. నిత్యం నీరు అవసరమైన ఈ పైరు పెంచడానికి కొద్దిగా ఓపిక, శ్రద్ధ కావాలి లేదంటే ఎండిపోతుంది. ఎప్పటిదప్పుడు కట్ చేయకపోయినా ముదిరిపోతుంది. పెరిగింది పెరిగినట్లు ఎప్పటికప్పుడు కట్ చూస్తుంటేనే మళ్లీ పెరుగుతుంది. దీనికి భిన్నంగా చేశామంటే మొక్క ముదిరిపోవడం.. తినడానికి పనికిరాకపోవడం ఖాయం. అందుకే ఆకుకూరల పెంపకం కష్టసాధ్యమైన పని. అయినా ఓపిగ్గా చేస్తున్న యోగానంద్ కుటుంబం పులువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మొదట్లో బంధువులు, స్నేహితులు.. తెలిసిన వారికి ఉచితంగానే ఇచ్చినా దీన్ని ఓ పనిగా మనుషులను పెట్టి చేస్తున్నందున గిట్టుబాటయ్యెలా చేయాలన్న ఆలోచన.. తద్వారా ఆకు కూరల పెంపకాన్ని కొనసాగించాలన్న ఆలోచన వచ్చిందంటున్నారు యోగానంద్ .
తాను చేపట్టిన ఆకుకూరల పెంపకంపై యోగానంద్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల.. మనం తినే ఆహారంలో ఉండిపోయినా వాటి కారకాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి కేవలం తినే తిండిలో హానికారక రసాయనాల వల్ల మాత్రమే వస్తుందని, దీనికోసం ప్రతి ఒక్కరు తమకున్న కాసింత చోటులో ఏదో ఒక కూరగాయనో .. ఆకుకూరనో వేసుకుంటే మేలని సూచిస్తున్నారు. దీన్ని వృత్తిగా పెద్ద స్థాయిలో చేపట్టాలంటే ఖర్చు, వ్యయప్రయాసలతో కూడిన పని కాబట్టి ఎవరికీ వాళ్ళు పెంచుకుంటే సరిపోతుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని నమ్మి తాను ఆచరణలోకి దిగానన్నారు.
మొదట్లో తల్లి కోరిక మేరకు స్థలంలో సాగుచేసిన యోగానంద్.. సేంద్రియ ఎరువులు, వేపనూనె మాత్రమే వాడుతూ ఆకుకూరల్ని పెంచుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. దీంతో ఆయనకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్టు యోగానంద్ చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే పెద్దపెద్ద నగరాల్లో దీనిపై అవగాహన కలగడంతోనే టెర్రస్ లను కూడా వదలకుండా ఆకుకూరల సాగులోకి దిగుతున్నారు. సొంతంగా కాసింత జాగా ఉన్నవాళ్లు సైతం ఆకుకూరలు.. కూరగాయలు పండించుకుంటే తాజాగా తినొచ్చు.. ఆరోగ్యాన్ని పదిలపర్చుకోవచ్చంటున్నారు.

Leave Your Comments

నిమ్మలో బోరాన్ లోపం – నివారణ

Previous article

కందులకు సరైన ధరలు లేక రైతుల ఆందోళన..

Next article

You may also like