తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం బుధవారం వరకు 63.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో ఉద్యాన పంటలను మినహాయిస్తే 63 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నది. ఇప్పటికే లక్ష్యం దాటి సాగయ్యాయి. గత యాసంగితో పోల్చితే 23.28 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి 39.84 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఈ యాసంగిలో వరినాట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ప్రభుత్వం 50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాలని ప్రణాళిక రూపొందించగా.. ఇప్పటికే 49.16 లక్షల ఎకరాల్లో పూర్తయ్యాయి. ఇతర పంటలు లక్ష్యానికి అటు ఇటుగా సాగయ్యాయి. జొన్నలు లక్ష ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. 1.14 లక్షల ఎకరాల్లో సాగైంది. శనగ 3.33 లక్షలు, వేరుశనగ 2.49 లక్షలు,నువ్వులు 52,830 ,మినుములు 44 వేలు , పెసర్లు 31 వేల ఎకరాల్లో సాగయ్యాయి. యాసంగి సాగులో నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు టాప్లో నిలిచాయి. 4.77 లక్షల ఎకరాలతో నిజామాబాద్ తొలిస్థానంలో, 4.72 లక్షల ఎకరాలతో నల్లగొండ రెండోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, కామారెడ్డి ఉన్నాయి. గత సీజన్ తో పోల్చితే మెజార్టీ రెట్టింపు సాగు జరిగింది. కాగా, మక్కల సాగుపై రైతులకు మక్కువ తగ్గడం లేదు. గత సీజన్ తో సమానంగా ఈసారి మక్కలు సాగుచేశారు. గత యాసంగిలో ఈ సమయానికి 4.09 లక్షల ఎకరాల్లో మక్కలు వేయగా.. ఈసారి కూడా అంతే స్థాయిలో వేయడం గమనార్హం.
తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగు నమోదుకానున్నది. వానాకాలం, యాసంగి సీజన్లు కలిపితే కొన్ని రోజుల్లో ఈ ఏడాది సాగు మొత్తం 2 కోట్ల ఎకరాలకు చేరనున్నది. వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాలు సాగు కాగా యాసంగిలో ఇప్పటి వరకు 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. మరో 1.23 లక్షల ఎకరాల్లో సాగైతే తెలంగాణ నూతన అధ్యాయం లిఖించనున్నది.
తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది..
Leave Your Comments