గడ్డే కదా అనుకోకండి.. ఆ పరకలే ఇప్పుడు ఓ రైతును గెలిపించాయి. పలువురు అటువైపు దృష్టిసారించేలా చేశాయి. మార్కెట్ అవసరాలను గుర్తెరిగి వినూత్నంగా ముందుకు సాగితే లాభాలు సాధ్యమే అని నిరూపించారు. బేస్తవారపేటకు చెందిన రైతు లక్కిరెడ్డి చెన్నారెడ్డి మండలంలోని కలగొట్ల సమీపంలో సుమారు 60 ఎకరాల్లో పామారోజా గడ్డి, మరో 10 ఎకరాల్లో తులసి, దవనం పంటలు సాగు చేస్తున్నారు. వీటి నుంచి సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగించే నూనెను తయారు చేస్తూ పదుగురికి ఉపాధి చూపుతున్నారు.
రైతు చెన్నారెడ్డి గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. ఆశించిన లాభాలు ఉండేవి కాదు. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను కోల్పోవాల్సి వచ్చేది. దీనివల్ల పెట్టిన పెట్టుబడులూ చేతికి వచ్చేవి కాదు. ఈ నేపథ్యంలో పామారోజా గడ్డి, తులసి పంటల సాగు చేస్తూ ప్రస్తుతం మంచి ఆదాయం పొందుతున్నారు. తుఫాన్లు, ఎండలు, ఇతర జంతువుల బెడద ఉండదు. కాపలా వంటి ఇబ్బందులూ తలెత్తవు. మూడు, నాలుగు నెలలు నీళ్లు లేకపోయినా పైరు బతుకుతుంది. బేస్తవారిపేట వంటి వర్షాభావ ప్రాంతాల్లో ఈ పంటల సాగు లాభదాయకంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన డెబ్భై ఎకరాల్లో ఈ రకాల పంటను సాగు చేస్తూ.. ఏటా సుమారు రూ. 30 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. రోజూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గడ్డి సాగుతో తన జీవితమే మారిపోయిందని చెన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పొలంలో ఒక్కసారి విత్తనాలు నాటితే సుమారు అయిదేళ్ల వరకూ పంట చేతికి వస్తుందంటారు చెన్నారెడ్డి వీటి నుంచి నూనె తీసేందుకు పొలం వద్ద ప్రత్యేకంగా బాయిలర్ ను ఏర్పాటు చేసుకున్నారు. తొలుత ప్రత్యేకంగా తయారు చేసుకున్న ట్రాక్టర్ పరికరాలతో కోత కోస్తారు. ఆ తర్వాత ఒకరోజు ఎండబెట్టి, పెద్ద డబ్బాల్లో గడ్డిని వేస్తారు. బాయిలర్ ద్వారా ఆవిరిని ఆ డబ్బాల్లోకి పంపి గడ్డిని ఉడికిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గొట్టాల ద్వారా ఆవిరి, నూనెను బయటికి వచ్చేలా చేస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు నూనె తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. పామారోజా నుంచి వచ్చే నూనె ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ. 1500 పలుకుతోంది. ఏడాదికి అయిదు కోతలు వస్తాయని.. ఎకరాకు 50 నుంచి 65 కిలోల నినె ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. తులసి రెండేళ్ల కాలం పైరు అని.. కోత కోసిన మరుసటి రోజు ( జూన్ నుంచి జనవరి), జనవరి నుంచి జూన్ వరకూ అదే రోజూ స్టీమ్ లో ఉడికించి బ్రాయిలర్ ద్వారా నూనెను తీస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ కిలో నూనె రూ. 6వేల వరకు పలుకుతోంది.. ఎకరాకు 5 నుంచి 6 కిలోలు వస్తున్నట్టు వివరించారు. ఏడాదికి అయిదు పంటలు వస్తాయని అంటే ఏటా 30 కిలోల నూనె తీస్తున్నట్టు తెలిపారు.
పామారోజా గడ్డి సాగుతో .. రైతులకు ఉపాధి
Leave Your Comments