వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దుక్కిదున్నడం మొదలుకొని విత్తనాలను విక్రయించే వరకు పెట్టుబడి పెట్టాల్సిందే. ట్రాక్టర్, విత్తనాలు, కూలీలు, రసాయనాలు, ఎరువులు ఖర్చులు బోల్డెంత అవుతాయి. ఇంత కష్టపడి పనిచేసినా.. ఆకాల వర్షాలు, పురుగులు, తెగులు పడితే పంట నాశనమై పెట్టుబడి కూడా మిగలదు. చివరికి అప్పులే మిగులుతాయి. కానీ లాభదాయకమైన పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చు. చాలామంది రైతులు లాభదాయకమైన పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి పంటల్లో వైట్ మస్లీ ఒకటి.
కరోనా పుణ్యమా అని ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. రసాయన పంటలను పక్కనపెట్టి సొంతంగా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. మరికొందరు ఔషధ మొక్కలపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఔషధ మొక్కలపై అందరిలోను ఆసక్తి మొదలైంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఔషధ పంట అయిన వైట్ మస్లీ మూలిక పంటతో ఆదాయాన్ని రెండింతలు పెంచుకోవచ్చు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇప్పటికే ఈ సాగు ప్రచారంలోకి వచ్చింది. మంచి డిమాండ్ ఉన్న ఈ మూలిక సాగుని గుజరాత్ లో పండిస్తున్నారు. గుజరాత్‌లోని దాంగ్ జిల్లా రైతులు వందలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ మూలికల పంటతో కాసులు పండిస్తున్నారు. దీన్నే సఫేద్ మస్లీ అని కూడా అంటారు. వర్షాకాలంలో చేపట్టే ఈ మూలిక సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు.పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ మూలికల సాగు చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే పంటను సాధిస్తున్నారు.
వైట్ మస్లీ మూలికతో అధిక లాభాలు పొందవచ్చు అంటున్నారు ఆ రైతులు. వైట్ మస్లీ మూలిక అధిక బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్ రోగులకు ఇది అమృతంలా పనిచేస్తుంది. అందువల్ల ఈ వైట్ మస్లీకి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ మూలికను అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫార్మా కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి. టానిక్ రూపంలోకి మార్చి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకు తుండగా స్థానిక ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సాయం కూడా కలిసిరావడంతో ఈ పంట రైతుల ఇంట సిరుల పంట కురిపిస్తోంది. దీంతో వీరి జీవన శైలి చాలా మెరుగైంది. పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ మూలికల సాగు చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే పంటను సాధిస్తున్నారు. మరోవైపు మార్కెటింగ్ కూడా చాలా సులభతరంగా ఉండడంతో ఇక్కడి రైతులు వెనక్కు తిరిగి చూసే అవసరం లేకుండా సాగు మీద దృష్టి పెడుతున్నారు.
అటు మార్కెట్‌లో కూడా వైట్ మస్లీకి చాలా డిమాండ్ ఉండడంతో ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా అమ్ముతున్నారు. దాంగ్ ఫారెస్ట్ విభాగం ఈ తరహా వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ రైతులకు విత్తనాలు సప్లై చేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. దాంగ్ జిల్లాలో మొత్తం 350 మంది రైతులు ఈ సాగు చేపట్టగా మొత్తం 40 ఎకరాల్లో ప్రస్తుతం పంట సాగవుతోంది.
#WhiteMusliFarming #DongDistrict #Gujaratfarmers #Benefitsofwhitemusli #agriculturelatestnews #eruvaaka