ప్రస్తుతం బొప్పాయి తోటల్లో వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తున్నాయి.ముఖ్యంగా ఆకుముడత,రింగు స్పాట్ వైరస్ ,మొజాయిక్ తెగుళ్ళు ఆశిస్తున్నాయి.వీటికి తీసుకోవలసిన నివారణ చర్యలు
ఆకుముడత వైరస్:
ఈ వైరస్ తెగులును బొప్పాయి పంట పై మొదట 1939లో తమిళనాడులో గుర్తించడంజరిగింది. వైరస్ మొక్కలో ప్రవేశించిన తర్వాత 3-4 వారాలకు గాని తెగులు లక్షణాలు కనిపించవు. మొదట లేత ఆకులు కిందకి ముడుచుకొని, ఈనెలు లావుగామారి, ఆకుకాడలు సాగకుండా పొట్టిగా వంకర టింకరగా మారి ఆకులన్నీ చుట్టుకొని బంతి ఆకారంలో ఏర్పడతాయి. తీవ్రత ఎక్కువైనప్పుడు కింది ఆకులు రాలిపోతాయి. చెట్ల పై కేవలం చిగురాకులతో ఏర్పడిన కుచ్చు మాత్రమే ఉండి, మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు ఏ దశలోనైన ఆశించవచ్చు. నారు మొక్కల దశలో ఆశించినా, ప్రారంభంలోనే ఆశించినా చెట్ల పెరుగుదల లోపించి గొడ్డు చెట్టుగా మారిపోతాయి. పూత, పిందె దశలో ఆశించినట్లయితే పూత పట్టదు. పూలు, పిందెలు ఏర్పడకముందే రాలిపోతాయి. పిందెలు వృద్దిచెందవు. కాయల రూపుమారి మార్కెట్ కు పనికిరావు. కాయ దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పక్వానికి వచ్చిన కాయలను కోసి మార్కెట్ కు తరలించవచు కానీ తర్వాత కాయలు వృధ్ధిచెందవు. ఫలింతగా కాపురాదు. గతంలో ఈ వైరస్ చాలా తక్కువగా కనిపించినా ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఆశించి బొప్పాయి దిగుబడులను శాసిస్తోంది.
తెగులు వ్యాప్తి: ఈ వైరస్ నేరుగా మొక్కల భాగాల్లోకి ప్రవేశించలేవు. ఈ తెగులు తెల్ల దోమ ద్వారా బొప్పాయిలో మొక్క నుంచి మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన ఆకుల నుంచి రసం పీల్చినప్పుడు వైరస్ క్రిములు తెల్లదోమలోకి ప్రవేశించి తర్వాతి కాలంలో ఆరోగ్యమైన మొక్కలనుంచి రసం పీల్చే సమయంలో మొక్కలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా మొదట పొలంలో అక్కడక్కడా వైరస్ తెగులు సోకిన మొక్కలకు వ్యాప్తి చెంది పొలమంత విస్తరిస్తుంది. సాధారణంగా తెల్లదోమ వృద్ధికి, వ్యాప్తికి, వేడి, పొడి వాతావరణం అనువుగా ఉంటుంది. అదే చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు దోమ కదలికలకు, ప్రత్యుత్పత్తికి అనువుగా లేనందువల్ల తెగుల వ్యాప్తి తక్కువుగా ఉంటుంది. అందుకే పొడి వాతావరణం ఉన్న కాలంలో, వేసవిలో ఈ తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది.
రింగు స్పాట్ వైరస్:
ప్రపంచ వ్యాప్తంగా బొప్పాయి సాగు చేసి అన్ని దేశాల్లో ఈ వైరస్ తెగులును గమనించారు. మన దేశంలో తైవాన్ రకం సాగులోకి వచ్చిన తర్వాత దీని ఉధృతి ఎక్కువైంది.
లక్షణాలు: ఈ వైరస్ తెగులు ఆశించిన మొక్కల ఆకుకాడలు లేత కాండం పై మొదట నూనెతో కూడిన మచ్చలుగాని, పొడవైన చారలు గాని కనిపిస్తాయి. లేత ఆకుల్లో పత్రదళం సైజు తగ్గి, ఈనెల వెంబడి కుంచించు కొనిపోవడం వల్ల ఆకుల ఆకారం కోల్పోయి ఈనెల వెంబడి సన్నగా పక్షి ఈకల్లాగా మారుతాయి. ఆకులసైజు తగ్గిపోవడం, ఈనెలు మాత్రమే ఉండడం, పసుపు రంగుకు మారడం వల్ల మొక్కలు అకస్మాత్తుగా బలహీనంగా మారి పెరుగుదల తగ్గుతుంది. తెగులు ఆశించిన చెట్ల పైనున్న పిందెలు, కాయల పై సన్నని ముదురు ఆకుపచ్చని రంగు గీతలతో కూడిన గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రతను బట్టి మొక్కల పెరుగుదల, దిగుబడి తగ్గి పోతుంది.
తెగులు వ్యాప్తి:
ఈ వైరస్ క్రిములు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొలంలో సాధారణంగా పేనుబంక సోకిన లక్షణాలు పొలంలో అన్ని చెట్లకూ ఈ తెగులు సోకిన లక్షణాలు కనిపిస్తాయి. పేనుబంక రసం పీల్చినప్పుడు వాటి నోటి భాగాల్లోకి చేరిన వైరస్ క్రిములు శరీరంలోకి పోకుండానే నోటిలో ఉండి మళ్ళీ రసం పీల్చే సమయంలో ఆకుల్లోకి ప్రవేశిస్తాయి. కేవలం నోటి భాగాలకే పరిమితమై ఉండడం వల్ల రసంపీల్చే ప్రతిసారి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా ఈ వైరస్ మొక్కలకు చాలా సులువుగా వ్యాప్తి చెందుతుంది. బొప్పాయి పంటలో అంతర పంటలుగా గాని, గట్ల వెంబడి లేదా పరిసరాల్లో పుచ్చ, కర్భూజ, దోస, టొమాటో, బీన్సు, చిక్కుడు, అలసంద లాంటి పంటలు సాగులో ఉన్నట్లయితే మరింత సులువుగా వ్యాప్తి చెందతుంది. సూక్ష్మపోషక లోపాలు కల్గిన మొక్కల పై ఈ వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పొలంలో లేదా గట్ల వెంబడి కలుపు మొక్కలు ఉన్నట్లయితే సులువుగా వ్యాప్తి చెంది వైరస్ తెగులు ఆశిస్తుంది.
మొజాయిక్ వైరస్ తెగులు:
దీనినే పల్లాకు తెగులు అని కూడ అంటారు. ఈ వైరస్ ఆశించిన మొక్కల లేత ఆకుల ఈనెల మధ్య ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు రంగు ఏర్పడడం వల మొజాయక్ లాగా కనిపిస్తాయి. ఆకుల సైజు కూడ తగ్గి పత్రహరితం తగ్గడం వల్ల పల్లాకు లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పెరుగుదల లోపించి పొలంలో తెగులు ఆశించిన మొక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. పూత రాలిపోతాయి. కాయలు పెరుగుదల లేక దిగుబడి తగ్గిపోతుంది.
తెగులు వ్యాప్తి:
ఈ వైరస్ క్రిములు పేనుబంక ద్వారా మొక్కకు మొక్కకు వ్యాప్తి చెందుతాయి. బొప్పాయి పొలంలో గట్ల వెంబడి, పరిసరాల్లో మిరప, బెండ, చిక్కుడు, బీర, కాకర, దోస, అలసంద లాంటి పంటలు సాగు చేసినట్లయితే పేనుబంక వృద్ధి చెంది తద్వారా వైరస్ వ్యాప్తికి దోహ దపడుతుంది.
తెగుళ్ళ యాజమాన్యం
ధృవీకరించిన, నాణ్యమైన విత్తనాలను వాడాలి. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయలి. నారుమొక్కలు ప్రధాన పొలములో నాటేటఫ్పుడు వైరస్ తెగుళ్ళ లక్షణాలు గల వాటిని నాటరాదు. అంతరపంటగా మిరప, టమోటా, దోస, పుచ్చ, గుమ్మడి లాంటి పంటలను సాగుచేయరాదు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల, సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్ష్మధాతు మిశ్రమాన్ని 3,4 నెలల వయసులో ఒకమారు చెట్ల పై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలి. అంతర సేద్యం చేయనప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. వైరస్ తెగులును వ్యాప్తి చేయు పేనుబంక మరియు తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. ఇందుకు గాను లీటరు నీటికి 2 మి.లీ. డైమిధోయేట్ లేదా మిధైల్ డెమటాన్ లేదా 1.6 మి.మీ. మోనోక్రోటోఫాస్ లేదా 1 గ్రా ఎసిఫేట్ వంతున కలిపి చెట్టు పై పిచికారి చేయునపుడు మందు ద్రావణము చెట్టు సుడి భాగం బాగా తడిసేటట్లు చూడాలి.