వార్తలు

మల్టీలెవల్ షేడ్ నెట్ లో కూరగాయల సాగు..

0

మల్టీలెవల్ షేడ్ నెట్ లో సాగు చేస్తే.. ఇతర కాలాల్లో వచ్చే పంట దిగుబడులు వేసవిలోనూ వస్తాయి. పైగా ఖర్చు కూడా తక్కువే. రూప్ టాప్,కాలమ్స్ నెట్ హౌస్ రూప్ టాప్ నెట్, కేబుల్ పర్లిన్ నెట్ హౌస్, మేజర్ గా మల్టీలెవల్ షేడ్ నెట్ హౌస్ లో అధిక ప్రయోజనాలు ఉంటాయి. సుమారు 460 స్కెర్ ఫీట్ల విస్తీర్ణంలో సాగు చేసే పంటకు ఒక్కో స్కెర్ ఫీట్ కు రూ. 200 నుంచి రూ. 300 వరకు వెచ్చించి ఏర్పాటు చేసుకునే మల్టీలెవల్ షేడ్ నెట్ ద్వారా గాలి ప్రసరణ, వెలుతురు మొక్కలకు సమానంగా అందుతుంది. ఈ విధానం ద్వారా బయట పండించే కూరగాయల సాగులో ఒక్కో చెట్టు నుంచి 2 కేజీలు వస్తే.. మల్టీలెవల్ షేడ్ పద్ధతులతో పండించిన పంటలో ఒక్కో మొక్కకు 10 కేజీల వరకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఈ పద్ధతిలో పండించిన టమాటా దిగుబడి అధికంగా ఉండటం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో వేసవి వాతావరణాన్ని తట్టుకొని పండించే పంటలు తక్కువే. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని సాగు చేయాలంటే మాత్రం మేలైన నూతన పద్ధతులు అవలంభించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. టమాటా సాగులో అత్యధికంగా సాహో, యూఎస్ 440, పీహెచ్ ఎస్ 448 వంటి రకాల విత్తనాలు నాటుతారు. ఇలాంటి రకమైన పంటల్లో సాధారణంగా మొక్క కేవలం 38 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటేనే తట్టుకుంటాయి. దీని కంటే ఎక్కువైనా.. పూత, పిందె, కాయ దశలోనే వేసవిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ గానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో పండించే పంట పూర్తిగా దెబ్బతినకుండా ఉండేందుకు మల్టీ లెవల్ షేడ్ నెట్ లు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. షేడ్ లో దారాల ఆధారంగా మొక్కలను పెంచుకొని, వాటి కింద ఇతర రకాలైన ఆకుకూరలను సేద్యం చేసుకొని, మధ్య మధ్యలో బంతిపూల సాగు వంటివి చేయడం ద్వారా ఒకే దశలో మూడు రకాలైన మేలైన పంటలను పండించుకునేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. మల్టీ లెవల్ షేడ్ నెట్ ద్వారా సాగు చేయడంపై రైతులు అవగాహన కలిగి ఉండాలి. వేసవిలో ఇలాంటి పంటల ద్వారా 80 నుంచి లక్ష రూపాయల ఆదాయం పొందేందుకు అవకాశాలుంటాయి. ఎన్ని నూతన వంగడాలు వచ్చినా వేసవిలో ఉష్ణోగ్రతలు తట్టుకుని దిగుబడి రావాలంటే షేడ్ నెట్ ల వినియోగం అత్యవసరం.

Leave Your Comments

నువ్వు పంటలో సస్య రక్షణ చర్యలు..

Previous article

బంగ్లాపై షేడ్ నెట్ లో వివిధ రకాల సాగు..

Next article

You may also like