Sugarcane: చెరకు దీర్ఘ కాలిక పంట. అంటే సంవత్సరం పాడుగునా పొలం లో ఉండి వాతావరణంలో వచ్చే మార్పులన్నింటిని ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే తేడాలు ముఖ్యంగా… గ్రీన్ హౌస్ గ్యాసెస్ అందులో కార్బన్ డై ఆక్సైడ్, ఉష్ణోగ్రతలు, నీటిఎద్దడి, నీటి ముంపు, చౌడు నేలలు ముఖ్యమైన అంశాలు.ఈ మార్పులు చెరకు దిగుబడిని, పంచదార నాణ్యతని, పంచదార తయారీని, చెరకు పక్వతని, విత్తన లభ్యతని ప్రభావితం చేస్తాయి.
నీటి ఎద్దడి పరిస్థితుల్లోచెరకు సాగు :
చెరకు దిగుబడి సామర్థ్యంలో మన పొరుగు రాష్ట్రాలైన తమళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది.ఈ వెనుకబాటు తనానికి ముఖ్యకారణం పరిమిత నీటి వనరులలో చెరకు సాగుకు తోడు చెరకు సాగులో వేసవి నీటి ఎద్దడిని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెరకులో నీటి ఎద్దడి కారణంగా సుమారు 20-50 శాతం వరకు దిగుబడి నష్టం వాటిల్లుతున్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి తోడు ఉత్తరకోస్తాలోని విశాఖ,శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల సాగు విస్తీర్ణంలో 40-50 శాతం వరకు చెరకు సాగు వర్షాధారితమే. దీని కారణంగా మన చెరకు ఉత్పత్తి,ఉత్పాదకతలో వెనుకంజలో ఉంది.
కొన్ని ప్రాంతాలలో వర్షాధారంగా పూర్తిగా కాలువ, బోర్లపై ఆధారపడి చెరకు సాగుచేస్తున్నారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ సరఫరాలో లోటు కారణంగా చెరకు తోటకు నీరు పారించలేని స్థితిలో చెరకు పంటపై చీడపీడలు ఆశించి దిగుబడులు పడిపోతున్నాయి. దీనికి తోడు అనిశ్చిత వర్షపాతం కూడా చెరకు తోటకు సరిపడే తడులు ఇవ్వడానికి వీలుకాని పరిస్థితులు కల్పిస్తుంది. దీనికి అదనంగా వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత, వడగాడ్పులు, వర్షపాత లోటు కారణంగా చెరకు పంట నీటి ఎద్దడికి గురవుతుంది. సాధరణంగా వేసవి కాలం మొదలయ్యే సరికి చెరకు పంట ఎంత ముదురు పంట అయితే అంత మంచిది.ఈ పరిస్థితులతో చెరకు పైరును వేసవిలో అధిక వేడిమి, వడగాలులకు తట్టుకునే విధంగా తోటలపెంపకంలోను, యాజమాన్య పద్ధతుల్లోను కొన్ని మెలకువలను పాటించాలి
చెరకు పంటపై నీటి ఎద్దడి ప్రభావం :
* మొక్కలలోపెరుగుదల ఉండదు. దీని కారణంగా పైరు ఎత్తు, ఆకుల విస్తీర్ణం, పిలకల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
* ఆకులు పసుపు రంగులోకి మారి వలయాకారంలోకి మారుతాయి.
* నీటి ఎద్దడికి లోనయినప్పుడు గానుగాడు గడల సంఖ్య తగ్గిపోతుంది.
* ముఖ్యంగా చెరకు గడల కణుపుల మధ్య దూరం తగ్గతుంది. దీని కారణం చెరకు గడల పొడువు తగ్గుతుంది.
* చెరకు దిగుబడి, రస నాణ్యత పడిపోతుంది.
సాధారణంగా చెరకు పంట కాలంలో పిలకలు తొడిగే దశ నీటి ఎద్దడికి చాలా సున్నిత మైనది. చెరకు గానుగాడు గడల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దీనికి తోడు ఈ దశ సాధారణంగా వేసవిలో వస్తుంది. ఎందుకంటే మన ప్రాంతంలో వరి కోసిన తర్వాత జనవరి నుంచి చెరకు నాట్లు మొదలు పెడతారు కాబట్టి వేసవి నీటి ఎద్దడికి తట్టుకునే విధంగా చెరకు పంటలో యంజమాన్య పద్ధతులు చేపట్టాలి.
నీటి ఎద్దడి పరిస్థితులకు అనువైన రకాలు :
కో. 6907, కో. 7219, 85A 261, 87A 298, కో.7805, 83R 23, 85R 186, కో. 86032, 2001A 63, 97A 85, 2003V 46, 98A163, కొ.టి. 8201, 2009A 107, 2009 A 252.
వర్షాధారానికి అనువైన చెరకు రకాలు :
డిసెంబర్ /జనవరి లో నాట్లకు: కో. 6907, 83R 23, 85A 261, 83A30, 84A 125, 93A 145, కో. 7219, 97A 85, 87A 298, 98A 163, 2001A 63, 2000A 225, 2003A 255, 2009A 107, 2009A 252
మే /జూన్ లో నాట్లకు: కో. 6907, 85A 261, 83A 30, 90A272, 93A 145, 97A85, 87A 298, 2001A 63, 2003A 255, 2009A 107
నీటి ముంపు పరిస్థితుల్లో చెరకు సాగు :
వర్షాకాలంలో మాగాణి, పల్లపు భూములు, వరిచేలకు దగ్గరగా సాగు చేసిన చెరకు తోటలు సాధారణంగా నీటి ముంపునకు గురవుతాయి. చెరకు పైరులో నీరు నిలిచి ఉన్నప్పుడు భూమిలోని మట్టి మధ్యగల ఖాళీలు పూర్తిగా నీటితో నిండడం వల్ల ప్రాణవాయువు అందక, వేర్లు పెరుగుదల, వ్యాప్తి తగ్గుతుంది. వేర్లు కుళ్లిపోతాయి. కొత్త వేర్లు ఏర్పడక పోవడం వల్ల మొక్క పోషకాలను, నీటిని కావలసినంత తీసుకోలేదు. క్రమంగా పైరు ఎదుగుదల క్షీణిస్తుంది. నీటి ముంపునకు గురైన తోటల్లోని మొక్కల ఆకులు ఎండి పసుపు పచ్చగా మారుతాయి. చచ్చు కర్రలు ఎక్కువుగా ఏర్పడతాయి. మురుగు నీటిని త్వరగా తీయకపోతే దిగుబడులు, రసనాణ్యత గణనీయంగా తగ్గుతాయి.
వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వల్ల ఎదిగిన తోటలు వేరువేరు స్థాయిల్లో పడిపోతాయి. పడిపోయిన చెరకులు భూమిని అంటిపెట్టుకోవడం వల్ల కణుపుల దగ్గర వేర్లు ఏర్పడతాయి. సుమారు 8 నుంచి 10 కణుపుల వరకు వేర్లు ఏర్పడితే రసంలో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. పడిపోయిన తోటల్లో చెరకు రసంలో తక్కువ జాతి పంచదార (గ్లూకోజ్) హెచ్చుగా ఉండటం వల్ల పంచదార, బెల్లం దిగుబడులు తగ్గుతాయి. చెరకు రసంలో పంచదార శాతం నిటారుగా ఉన్న చెరకు తోటల రసంలోని పంచదార కన్నా 4 శాతం తగ్గుతుంది. చెరకు గడలు విరుగుతాయి. దీని కారణంగా చచ్చు కర్రలు / గెడల శాతం పెరుగుతాయి.
తోట నరకడం, కార్శి చేయడం కష్టమవుతుంది. నీటి ముంపు వల్ల చెరకు గడలలో బోలు (ఊలు ) ఏర్పడి బరువు తగ్గుతుంది.పూత పూసే రకాలలో (కొ.8014, 81V 48, కొ.టి. 8201, కొ.ఎ.7602, 89A 298, కొ.ఆర్. 8001) పూత ఎక్కువుగా వస్తుంది. రస నాణ్యత తగ్గుతుంది. స్వల్పకాలిక రకాల్లో కన్నా ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాల్లో రస నాణ్యత బాగా తగ్గుతుంది. ముంపునకు గురైన తోటల నుంచి తయారు చేసిన బెల్లం నిల్వకు కూడా పనికిరాదు. సుమారు హెక్టారుకు 20-25 టన్నుల చెరకు దిగుబడి నీటి ముంపు వల్ల తగ్గుతుందని పరి శోధనల్లో వెల్లడైంది. చెరకు తోటల్లో నీరు నిలకడగా ఉన్నపుడు చెరకుపై బెండు మెత్తబడి తేలిగ్గా చీలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎర్ర కుళ్ళు కారక శిలీంద్ర బీజాలు మొక్క లోపలికి సులువుగా వ్యాపించి తెగులును కలుగజేస్తాయి. నీటి ముంపు తోటల్లో తెగులు వ్యాప్తి చాల అధికంగా ఉంటుంది.
ఎర్రకుళ్ళు తెగులును తట్టుకునే రకాలు ఎన్నుకోవాలి. ఉదాహరణకు కొ. 6907, 85A 261, కొ.టి. 8201, 86A 46, కొ.7217, కొ.ఎ.7602, కొ.7219, 87A 298, 2001A63, 98A 163, 2003V 46, 97A 85, 2009A 107, 2009A252 ,2010A229, 2012A 319.
పూతకు రాని లేదా పూత తక్కువగా వచ్చే రకాలు నాటుకోవాలి.ఉదాహరణకు కొ.6907, 84A125, 85A261, 86V96, 88A189, కొ.7706, 87A 397, కొ.7219, 86A146, కొ.టి. 8201 రకాలు. ఫ్యాక్టరీలు పనిచేయడం ప్రారంభించిన వెంటనే నీటి ముంపుకు గురైన తొటల నుంచి చెరకును ముందుగా మిల్లుకు సరఫరా చేయాలి. ఆలస్యం చేస్తే దిగుబడులు, రసనాణ్యత తగ్గుతాయి.వర్షాకాలంలో నీటి ముంపునకు లోనైన మొక్క తోటలను తీసిన తరువాత కార్శి చేయడం ఎంత ముందుగా వీలైతే అంత ముందుగా ( ఫిబ్రవరి 15 లోపు) చేసుకోవాలి.
సమస్యాత్మక భూములు సాధారణంగా రెండు రకాలు
1. ఆమ్ల భూములు
2. చౌడు భూములు (పాల చౌడు, క్లార చౌడు, మిశ్రమ చౌడు)
1. ఆమ్ల భూములు:
కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని అక్కడక్కడ ఆమ్ల గుణం కలిగిన భూములున్నాయి. ఈ భూముల్లో ఉదజని సూచిక 6.5 కంటే తక్కువగా ఉంటుంది. కాల్షియం లభ్యత ఈ నేలల్లో తక్కువ. ఈ నేలల్ని బాగు చేసుకోవడానికి సున్నపు పాడిని వాడాలి.
2. చౌడు భూములు :
పాల చౌడు భూములు: ఈ భూములు సాధారణంగా వర్షపాతం
తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. వీటిలో నీటిలో కరిగి ఉన్న లవణాలు ము ఖ్యంగా క్లోరైడ్లు, సల్ఫేట్ లు అధిక పరిమాణంలో ఉండి చెరకు పంటకు హాని కలిగిస్తాయి. ఇటువంటి భూముల్లో నీరు సమృద్ధిగా ఉన్నా చెరకు మొక్కలు నీటిని గ్రహించలేక ఎండిపోతాయి.
చెరకు పంటపై పాల చౌడు భూముల ప్రభావం:
* నాటిన ముచ్చెలు సరిగా మొలకెత్తవు.
* మొలకెత్తిన మొక్కలు కూడా ఏపుగాపెరగక అక్కడక్కడ చనిపోతాయి.
* ద్రవించిన లవణాలు చెరకు రసంలో ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల రసనాణ్యత బాగా తగ్గుతుంది.
* చక్కెర కర్మాగారం లో మొలాసిస్ దిగుబడి పెరిగి, పంచదార దిగుబడి తగ్గుతుంది.
* ఈ చౌడు భూముల నుంచి తయారు చేసిన బెల్లం ఉప్పగా ఉండి, గట్టిదనం తగ్గి తొందరగా నీరు కారిపోతుంది.
క్షార చౌడు భూములు: నేలలో మార్పు చెందే సోడియం అధిక పరిమాణంలో జమ కూడినప్పుడు అవి క్షార భూములుగా ఏర్పడతాయి.
చెరకు పంటపై క్షార చౌడు భూముల ప్రభావం:
* సోడియం శాతం అధికంగా ఉండటం వల్ల కాల్షియం,మెగ్నీషియం లభ్యత తగ్గిపోతుంది.
* సోడియం ఎక్కువుగా ఉండటం వల్ల మట్టి కణాలు విడివిడిగా ఉండి ఎండిన తర్వాత నేల చాలా గట్టి పడి పోతుంది. అందువల్ల చెరకు వేర్లు భూమిలోకి సరిగా వ్యాపించలేవు.
• చెరకు పంటలో పిలకల సంఖ్య తగ్గిపోయి, మొక్క పెరుగుదల తగ్గుతుంది.
• చెరకు మొక్కలు కావలసిన పోషకాలు తగు మోతాదులో తీసుకోలేక ఆకులు ఎండి, రాలి పోతాయి.
మిశ్రమ చౌడు భూములు :
కొన్ని క్షారభూముల్లో నేలలో మార్పు చెందే సోడియం ఎక్కువుగా ఉండడంతో పాటు, నీటిలో కరిగి ఉండే లవణాల పరిమాణం కూడా ఎక్కువుగా ఉంటుంది. అంటే పాల చౌడు, కారుచౌడు భూములు రెండింటి రకాల అవలక్షణాలు కలసి ఉంటాయి.
చౌడును తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి. చౌడును తట్టుకునే రకాలు: 81A 99, 81V 48. 93A145, 2000V 59, 99V30, కొ.7219. కొ.టి.8201, 2009A107, 2009A 252
డా.డి. ఆదిలక్ష్మి, డా.పి.వి.పద్మావతి,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,
అనకాపల్లి, ఫోన్. 9490 290781