వార్తలు

తిప్పతీగ ఔషధ మొక్క యొక్క ప్రయోజనాలు

0

తన పొలంలో అతడు పెంచుతున్న తీగ జాతి మొక్కలు నేల మీద పాకడం వల్ల మట్టి కొట్టుకుపోయి చనిపోవడం చూసి చలించిపోయాడు.అలాగే మట్టి వాసనతో పొలం నుండి నేరుగా ఉద్యాన వన శాఖ అధికారులను కలిసి “పందిళ్ళు” వేసుకోవడానికి రాయితీలు కావాలని అడిగాడు.”బీరకాయలు,పోట్లకాయల వంటి తీగలకు పందిళ్ళు ఇస్తాం….కానీ నువ్వు పెంచే మొక్కలకు సాధ్యం కాదని,రూల్స్ ఒప్పుకోవని” అన్నారు.

ఇంతకీఅతను పందిళ్ళ మీద పెంచాలనుకున్న మొక్కలు ఏంటో తెలుసా?అమృత వల్లి!!దానినే “తిప్పతీగ”అని కూడా అంటారు.రైతులంతా వరి,చెరకు పండించి,శరీరాల్లో కార్బోహైడ్రేట్ లు పెంచుతుంటే,వాటివల్ల వచ్చే షుగర్,బీపీలను అదుపు చేసే ఔషధ గుణాలున్న మొక్కలను పెంచాలనుకొని,తొలి ప్రయత్నంలో విఫలం అయ్యాడు ఆ బడుగు రైతు.

ప్రభుత్వ రాయితీ అందక పోయినా నిరుత్సాహ పడక,తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందుకే సాగాడు…

కృష్ణా జిల్లా,నూజివీడు మండలం,రాట్నాల గూడేనికి చెందిన రైతు పరిమే మరియదాసు కు ప్రాచీన వైద్య విధానాల మీద మక్కువ. ఆయుర్వేద మందులపై అవగాహన పెంచుకొని,దానికి అవసమైన మొక్కలను తానే ఎందుకు సాగు చేయకూడదనే భావన తో పాటు ప్రజలకు ఆయుర్వేదంపైఅవగాహన కల్పించడం కోసం మందు మొక్కల పెంపకం మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ అతడికి సెంటు భూమిని 2017లో కౌలుకు తీసుకొని తిప్ప తీగ పాదులను సేంద్రియపద్దతిలో పెంచడం మొదలు పెట్టాడు.నేల మీద పాకించడం వల్ల చాలా మొక్కలు చనిపోయాయి.ఉద్యాన శాఖ రాయితీ కోసం చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో సొంతంగా కర్రలతో పందిళ్ళు నిర్మించి సాగు చేస్తున్నాడు.

ఈ మొక్కలో విశేషం ఏమిటి?

తీగజాతి ఔషధ మొక్క తిప్పతీగకు ఆయుర్వేదంలో విశిష్ట స్దానం ఉంది.దీని శాస్త్రీయ నామం “టీనొస్పోరా కోర్ది ఫోలియా”.”అమృత వల్లి” అని కూడా పిలుస్తారు.అన్ని సీజన్ లలో పచ్చగా ఎదుగుతూ,ఇతర చెట్ల ఆసరాతో అల్లుకుపోయో మొక్క ఇది.అడవుల్లో ఎక్కువగా ఎదుగుతుంది.అరుదైన ఔషధ గుణాలున్న ఈ మొక్క క్రమంగా అంతరించి పోవడం గమనించిన దాసు దీనిని అన్ని పంటల్లాగే సంప్రదాయ సాగుబడిలోకి తీసుకు వచ్చి కాపాడాలనుకున్నాడు. అటవీ ప్రాంతంలో ఈ తిప్పతీగను సేకరించి తెచ్చి,రెండు గజాల దూరం చొప్పున 60 సెంట్లకు 720 మొక్కలు నాటాడు.

నేల మీద కన్నా పందిరి పైకి పాకిస్తే దిగుబడి ఎక్కువ వస్తుందంటాడు దాసు.”ఒక చెట్టుకు కనీసం పది కిలోల దిగుబడి వస్తుంది.పది కిలోల తిప్పతీగ నుండి 200 గ్రాముల తిప్ప సత్తు వస్తుంది. 30 వేల పెట్టుబడి అయింది.ఖర్చులన్నీ పోను లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. కిలో తిప్ప సత్తు మార్కెట్ లో 4 వేల ధర పలుకుతుంది.వర్షం పడినా పడక పోయినా ఈ సాగుకు ఇబ్బంది లేదు.ఎక్కడైనా పెరుగుతుంది.సేంద్రియ ఎరువు వాడితే కాండం బలంగా ఉంటుంది. ఈ తిప్ప తీగను కత్తిరించి పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి అధిక పాలను ఇస్తాయి.పశుసంపద పెరుగుతుంది అంటాడు దాసు.

తిప్ప సత్తు అంటే?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మూలికల్లో ముఖ్యమైనది తిప్పతీగ. మన శరీరంలోని చాలా తిప్పలను తగ్గిస్తుంది.తిప్పతీగలో అంటువ్యాధులను అధిగమించే సహజ సామర్ధ్యం ఉంటుంది.అలాగే పేగుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. తిప్ప తీగ ఆకుల ఆయుర్వేదంలో ఉపయోగపడినా కాండం నుండి వచ్చిన గుజ్జును నిలువ చేసుకొని మందుగా ఉపయోగించు కోవచ్చు.తిప్ప తీగ కాండాలను చిన్న ముక్కలుగా చేసి,మిక్సీ లో అల్లం పేస్ట్ లాగా తయారు చేసి,ఆ పేస్టుకి  నీటిని కలిపి వడకట్టితే, తెల్లని పదార్దం వస్తుంది.దానినే తిప్ప సత్తు అంటారు.రోజూ పది గ్రాములు చొప్పున 3 పూటలా తీసుకోవాలి.షుగర్,బీపీ అదుపులో ఉంచుతుంది అంటాడు దాసు.

వ్యాధుల నివారణకు…

తిప్పతీగ శరీరానికి సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.దీర్ఘకాలిక వ్యాధుల నివారణ తగ్గింపునకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది.కీళ్ళ నొప్పులు,కీళ్లలో మంట తగ్గుతాయి.శరీరం నుంచి విష వ్యర్ధాలను తొలగించడానికి కాలేయానికి తోడ్పడుతుంది.కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.దీర్ఘకాలిక దగ్గు వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది.శ్యాస కోశ  వ్యవస్ద శ్లేష్మ పొరను శాంతింపజేస్తుంది. ఉబ్బసం,దగ్గు,జలుబు,టాన్సిల్స్,శ్యాస కోశ సమస్యల నుంచి కాపాడుతుంది.

ఆయుర్వేద గ్రంధాలు చదివి వన మూలికల మీద అవగాహన పెంచుకొని వైద్యం కూడా చేస్తున్నాడు ఈ రైతు దాసు పొలంలో తిప్ప తీగ పాదులతో పాటు సరస్వతి,పొడపత్రి,నేల వేము వంటి అపార ఔషధ గుణాలున్న మొక్కలను కూడా పెంచుతున్నాడు.అయిదు ఎకరాలున్న రైతులు మిగతా పంటలతో పాటు,కనీసం అర ఎకరంలో నైనా ఇలాంటి ఔషధ మొక్కలు పెంచితే మనకు సగం వ్యాధులు తగ్గిపోతాయి.ఈ పంటలపై ప్రతీ రైతు అవగాహన పెంచుకోవాలి.సలహాలు కావాల్సిన వారికి శిక్షణ ఇస్తున్నాడు.

Leave Your Comments

హైడ్రోఫోనిక్స్  పద్దతిలో ఆకుకూరల సాగు

Previous article

వేసవిలో మినుము సాగు-యాజమాన్య పద్దతులు

Next article

You may also like