Uses Of Neem: ప్రాచీన కాలం నుంచి వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. వేప చెట్టులోని ఒక్కో భాగం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. గృహవైద్యంతోపాటు పంటల్లో చీడపీడల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. వేప పిండి, నూనె, కషాయం, చెక్క రూపంలో దీనిని వాడుతారు. భూమిని సారవంతం చేయడంతోపాటు పంట ఉత్పత్తుల నిల్వలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎండిన వేప ఆకులను పెసర, మినుము, బియ్యం తదితర పంటలు నిల్వ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. పంటల సాగులో వేప ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. సేంద్రియ ఎరువుగానూ ఉపయోగిస్తున్నారు.
ఫలితాలు అద్భుతం:
క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చీడపీడల నివారణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో విరివిగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమిద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణలో ఇది ఉపయోగపడుతోంది.
నత్రజని ఎరువుల సామర్థ్యం పెంపు:
రైతులు వాడే పోషక పదార్థాలలో నత్రజని ముఖ్యమైనది. పంటకు వేసే నత్రజని ఎరువులో కేవలం 40 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగిలింది ఆవిరి, వాయురూపంలో వృథా అవుతోంది. కొంతభాగం నీటిలో కొట్టుకుపోతుంది. అందుకే వేపపిండిని యూరియాతో పాటు కలిపి వేస్తే 20 నుంచి 30 శాతం మేర నత్రజని వినియోగాన్నిపెంచవచ్చు. వరి, చెరకు వంటి అధిక నత్రజని వినియోగించే పంటల్లో వేపపిండి ఎంతో కీలకమైంది. ఇది నత్రజని ఎరువును ఒకేసారి కాకుండా క్రమంగా మొక్కకు అందేలా చేస్తుంది.
వేప మందుల్లో రకాలు:
పంటల సస్యరక్షణలో వేప ఉత్పత్తులను అనేక రకాలుగా వాడవచ్చు. వీటిలో ముఖ్యమైనవి.
• 5 శాతం వేపగింజల కషాయం
• 0.5-1.0 శాతం వేపనూనె పిచికారీ
• వేప ఆధారిత ఫార్ములేషన్స్: వీటిని స్థానిక వ్యవసాయ అధికారుల సలహామేరకు అవసరాన్నిబట్టి వినియోగించాలి.
వేప గింజల కషాయం:
పంటకు రక్ష: వేప గింజల పొడిని ఒక గుడ్డలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 గంటల పాటు నానబెట్టి కషాయం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కషాయాన్ని వంద లీటర్ల నీటిలో వంద గ్రాములు కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే పురుగు గుడ్డు దశ, కోశస్థ దశ, ప్యూపా దశలను సమర్థంగా అరికట్టవచ్చు.
దిగుబడులు పెంచే వేప చెక్క:
వేప నుంచి నూనె తీశాక చెక్క మిగులుతుంది. ఈ వేప చెక్కలో నత్రజని నాలుగు నుంచి ఆరు శాతం, భాస్వరం, పొటాష్ 0.5 శాతం ఉంటాయి. సల్ఫర్ కూడా ఉంటుంది. నూనె గింజ పంటల్లో దిగుబడి పెంచడంలో సల్ఫర్ తోడ్పడుతుంది.
వేప నూనెతో అనేక లాభాలు:
రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు, కాండం తొలుచు పురుగుల నివారణకు వేప నూనె పని చేస్తుంది. లీటరు నీటికి 5 మి.లీ.వేప నూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ వాసనకు ఆడ రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండకుండా చేయడమే కాకుండా పెట్టిన గుడ్లను పొదగకుండా చేస్తుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లార్వాలను సమర్థంగా అరికడుతుంది. దీన్ని మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా పిచికారీ చేస్తే ఆకులు బిరుసుగా మారుతాయి. ఉదయం, సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. పూత సమయంలో పిచికారీ చేస్తే పూత రాలే అవకాశం ఉంటుంది. పూత దశకు ముందు, ఆ తరువాత పిచికారీ చేయాలి. రెక్కల పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగయిదు ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతిని బట్టి పిచికారీ చేస్తే తక్కువ ఖర్చుతో పంట దిగుబడి సాధించవచ్చు. గొంగళి పురుగుపైన పిచికారీ చేస్తే ఆ పురుగు తరువాత దశను చేరుకోలేక చనిపోతుంది. కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వామ్) ముఖ్యంగా మొక్కజొన్న, పసుపు ఇతర పంటలను ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు 10 వేల పీపీఎం అజాడిరక్టిన్ పిచికారీ చేస్తే ఈ పురుగు అదుపులో ఉంటుంది.
చీడపీడల నివారణ:
• దుక్కి సమయంలో వేప పిండిని వాడటం వల్ల భూమి నుంచి వచ్చే కొన్ని రకాల తెగుళ్లను అరికట్టవచ్చు.వేప పదార్థాలు కొన్ని రకాల శిలీంద్రాలు, బాక్టీరియాలు, వైరస్, కీటకాల వల్ల కలిగే తెగుళ్ల నుంచి పంటను రక్షిస్తాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది.
• నిమ్మజాతి మొక్కల్లో వచ్చే గజ్జి తెగులును మొక్కకు 3 నుంచి 5 కిలోల వేప పిండి వేసి సమర్థంగా నియంత్రించవచ్చు.
• వరిలో దుక్కి సమయంలో ఎకరానికి 100 నుంచి 150 కిలోల వేపపిండిని వాడటం ద్వారా టుంగ్రో వైరస్ ఉద్దృతిని నియంత్రించవచ్చు. వరిలో వేపపిండి వాడకం, వేపనూనె పిచికారీ ద్వారా ఆకుముడత సమస్యను అరికట్టవచ్చు.
వేప మందుల వాడకంలో మెలకువలు:
• ద్రవ రూపంలోని వేప మందును నీటిలో కలిపే ముందు సీసాలో బాగా కలపాలి.
• వేప నూనె వినియోగించేటప్పుడు సబ్బు ద్రావణాన్ని తప్పనిసరిగా వాడాలి.
• వేపనూనె, ద్రావణాలను సాయంత్రం సమయంలో చల్లితే ఫలితం బాగా ఉంటుంది.
• మందు ద్రావణం తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు.
• పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు.
• పంటల్లో తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వేపమందుల ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
• బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.
వేప పిండి వాడకంలో సూచనలు:
• వేప పిండిని దుక్కిలో వాడినప్పుడు నేలపై చల్లేకంటే మట్టిలో కలిపితే మంచిది.
• లోతుగా దుక్కిదున్నిన తర్వాత వేప పిండిని వినియోగిస్తే ఫలితాలు బాగుంటాయి.
• ఎలాంటి రసాయన ఎరువుతోనైనా వేపపిండిని కలపవచ్చు.
• వర్షాకాలంలో పంటల్లో వాడే రసాయన ఎరువులు ఎక్కువగా వృథా అవుతాయి. ఈ కాలంలో వ్యవసాయ అధికారుల సలహామేరకు వేప పిండిని వాడటం శ్రేయస్కరం.
• కూరగాయ పంటల్లో కేవలం నారుమడిలో వేపపిండిని వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.
• వేప పిండి ఒకసారి వాడితే దాని ప్రభావం మరుసటి ఏడాది కూడా కనిపిస్తుంది.
• వేపపిండి వాడకం భూమిలో ఉండే సూక్ష్మజీవులకు, మిత్ర కీటకాలకు, పశుపక్ష్యాదులకు ఎలాంటి హాని కలిగించదు.
• ఒకటి కంటే ఎక్కువ సూక్ష్మజీవుల వల్ల కలిగే తెగుళ్లను కూడా వేపపిండి నియంత్రిస్తుంది.
• వేపపిండి ప్రభావం రసాయన మందుల వలే వెంటనే కనిపించదు. ఇది క్రమంగా భూమిలో మంచి వాతావరణాన్ని కల్పించి మొక్కలో నిరోధక శక్తిని పెంచుతుంది.
వివిధ పంటల్లో:
వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటల్లో: దమ్ము సమయంలో 100-150 కిలోలు, పంట నాటిన నెలలో 25-30 కిలోలు ఎకరాకు వేయాలి. దీనివల్ల నత్రజని సమర్థ వినియోగం, ఆకుముడత, తెల్లకంకి, కాండం తొలిచే పురుగు, పచ్చదోమ ఉద్ధృతి నియంత్రణ జరుగుతుంది.
చెరకు పంటలో: ఎకరాకు గడలు నాటే ముందు 80-150 కిలోలు,నాటిన తర్వాత 30 కిలోలు ఎరువుతో కలిపి వేస్తే నులిపురుగుల నియంత్రణ, ఎర్రనల్లి, పొలుసు పురుగు ఉద్ధృతి తగ్గుతుంది.
అరటి, బొప్పాయి, ద్రాక్ష, అపరాల పంటల్లో: నాటేటప్పుడు ఎకరాకు100-150 కిలోలు వేయాలి. దీనివల్ల నత్రజని సమర్థ వినియోగం, నులి పురుగుల నియంత్రణ, వడలు (విల్ట్) తెగులు ఉద్ధృతి తగ్గుతుంది.
వంగ, బెండ, ఉల్లి, టమాట, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప పంటల్లో: మెక్కలు నాటేముందు ఎకరాకు 100 నుంచి 150 కిలోలు వేయడం వల్ల నులిపురుగుల నియంత్రణ, తెగుళ్ల ఉద్ధృతిలో తగ్గుదల ఉంటుంది.
మామిడి, జామ, సపోటాలో: మూడేళ్ల వరకు పాదుకు కిలో నుంచి రెండు కిలోలు వేస్తే చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది. గజ్జి తెగులు నియంత్రణలో ఉంటుంది.
రైతులు అవగాహన పెంచుకోవాలి:
వేప ఉత్పత్తులతో పంటలకు ఎంతో మేలు జరుగుతుంది. వేప ఉత్పత్తులు, వాటి ఉపయోగాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వేప నూనె, వేప పిండి, వేప చెక్కతో పంటలకు మేలు జరుగడమే కాకుండా పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వేప ఆకు ఉపయోగపడుతుంది.
ఎం.డి.సాదిక్ పాషా, డా.జె. చీనా, డా.ఎ. నిర్మలా(పిజెటిఎస్ఏయు),
డా.ఎస్. మల్లేష్, కె. నాగరాజు,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం,
Also Read: Organic Farmer Kavita Success Story: నిరంతర ఆదాయంతో నిత్యావసరాలకు భరోసా. నెలకు 20 వేల ఆదాయం