ఇరి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ కోహ్లీ వెల్లడి… ఫిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఇరి)లో పనిచేస్తున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు ఆ సంస్థ పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ కోహ్లీ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన “భవిష్యత్తు బాగు కోసం వరి పరిశోధన” అనే అంశంపై ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సులో ముఖ్య వక్త గా పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ నుండి వచ్చిన ఆయన మంగళవారం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను, పరిశోధనా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ అజయ్ కోహ్లీ ప్రసంగించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ రూపొందించిన వరి రకాలతో ఆసియా ఖండంలో ఆహార భద్రత సాధ్యం అయిందని , అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుండి విడుదలైన ఐఆర్ -8, ఐ ఆర్ 64 రకాలు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ చేస్తున్నారు. తద్వారా భారత దేశంలో వరి దిగుబడి మరియు ఉత్పత్తి గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధనా సంస్థను మరియు ఇనిస్ట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంస్థలను ఆయన సందర్శించి శాస్త్రవేత్తలతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వరి పరిశోధన గురించి చర్చించారు. ఇక్కడ జరుగుతున్న పరిశోధనల పట్ల శాస్త్రవేత్తలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన సలహా ఇచ్చారు. రానున్న సంవత్సరాలలో వరి పరిశోధన లో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా నూతన వరి రకాలను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయ ని అన్నారు. ప్రస్తుతం వరిలో వాడుతున్న నత్రజనిని సగానికి సగం తగ్గించి దిగుబడులలో ఏమాత్రం తేడా రాకుండా పరిశోధనల ద్వారా ఈ నూతన వరి రకాలు అందుబాటులోకి వస్తే వరిలో యూరియా వినియోగం తగ్గడంతో పాటు భూమి నాణ్యత పెరుగు మెరుగుపడి , మానవుని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గ్రహీత డాక్టర్ సమరెండు మహంతి మాట్లాడుతూ ఆగ్నేయ ఆసియా దేశాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో వరి రకాల సాగును ప్రోత్సహించాలని, తద్వారా రైతుల ఆదాయంతో పాటు ఎగుమతులకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు. అధునాతన రైస్ మిల్స్ స్థాపించి మిల్లర్స్ కు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా రైతులకు ఆదాయం లభిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ మీనాక్షి సుందరం, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పరిశోధనా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆల్దాస్ జానయ్య తో కలిసి డాక్టర్ అజయ్ కోహ్లీ డాక్టర్ సమరెండు మహంతి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు ను సచివాలయంలో కలుసుకున్నారు.