Agriculture Minister: గ్రామంలో, వ్యవసాయ భూములలో ఎక్కడా కంపతార చెట్లు ఉండొద్దు. కంపతార చెట్లు లేకుండా చేస్తే పంచాయతీకి రూ. లక్ష అందిస్తా అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Telangana Agriculture Minister Niranjan Reddy) తెలిపారు.
ఎన్ని గ్రామ పంచాయతీలు ఇలా చేస్తే అన్నింటికీ రూ. లక్ష చొప్పున అందిస్తా అని.. ఊరికే కంపతార చెట్లను కొట్టేయడం కాదు .. వేర్లతో సహా తొలగించాలి అని నిరంజన్ రెడ్డి సమావేశంలో తెలిపారు. ప్రజల బతుకుదెరువు కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు, కార్యక్రమాలు లేవు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడారు.
గ్రామాల్లో ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీలకు నిధులు తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి ప్రకటించారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంల ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు రూ.8,500 వేతనాలు, పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్, ఆటోలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రస్తుతం నడుస్తున్నది చెప్పారు.
గ్రామాలు శుభ్రంగా ఉండడానికి 1588 మంది ఉన్న చిన్న అంకూరు గ్రామానికే రూ.62 లక్షల 45 వేల 780 డబ్బులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. ఏడు దశాబ్దాల్లో దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో నెలా నెలా నిధులిచ్చి గ్రామాలను బాగుచేసుకోమన్న పరిస్థితి లేదు. ఒక్క కేసీఆర్ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఉన్నదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అవసరమయిన అన్ని చోట్లా సీసీ రహదారులు వేయడం జరిగింది .. మిగిలిన చోట్ల సీసీ రహదారులు వేయిస్తాం కూడా వేయిస్తామని ప్రకటించారు. వైకుంఠధామాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంకూరులోని 556 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.3 కోట్ల 20 లక్షల 83 వేల 796 రూపాయలు లభించాయని తెలిపారు.
15 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరిగి అధికారులు, ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలం అంకూరు, పెద్దగూడెం గ్రామాల్లో, వనపర్తి పట్టణంలో కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
అంతకుముందు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 118 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.32,35,500 విలువైన చెక్కులను అందజేసి వారితో అల్పాహారం కూడా సేవించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.