రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విత్తడానికి ముందే.. విత్తనం చరిత్రను తెలుసుకునే వెసులుబాటును రైతుకు కల్పిస్తున్నది. ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు విత్తనం పుట్టు పూర్వోత్తరాలన్నీ అరచేతిలో ఉంటాయి. అప్పుడే రైతు ఆ విత్తనాలను కొనాలా.. వద్దా.. అనేది నిర్ణయించుకోవచ్చు. దీనికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఈ వానాకాలం సీజన్ నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి, విత్తన ధ్రువీకరణ సంస్థ “సీడ్ ట్రేసబిలిటీ” విధానాన్ని అమలు చేస్తున్నది. సీడ్ ట్రేసబిలిటీకి అవసరమైన సాఫ్ట్ వేర్ ను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సొంతంగా అభివృద్ధి చేసింది. సీడ్ ట్రేసబిలిటీ విధానంలో భాగంగా ప్రతి విత్తన ప్యాకెట్ పై క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ ను ముద్రిస్తారు. స్మార్ట్ఫోన్ లో ఆ కోడ్ ను స్కాన్ చేయగానే మొత్తం సమాచారం వస్తుంది. ఆ విత్తనాన్ని ఏ కంపెనీ ఆధ్వర్యంలో ఎక్కడ పండించారు, ఎక్కడ శుద్ధి చేశారు.. నాణ్యతకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ప్రతి విత్తన ప్యాకెట్ పై తెలంగాణ విత్తన సంస్థ ధృవీకరించిన క్యూఆర్ కోడ్ ను ఖచ్చితంగా ముద్రిస్తారు. ఈ సంస్థ పత్తి విత్తనాలు మినహా దాదాపు అన్ని రకాల విత్తనాలను ధృవీకరిస్తుంది. ఈ వానాకాలంలో సుమారు 20 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నారు.
వానాకాలం సీజన్ సాగుకు అవసరమైన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మొత్తం 81 లక్షల ఎకరాలకు అవసరమైన 20,04,220 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇందులో అత్యధికంగా వరి విత్తనాలు 19.52 లక్షల క్వింటాళ్లు, కంది 2,700 క్వింటాళ్లు, పెసర్లు 800 క్వింటాళ్లు, వేరు శనగ 36 వేల క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లతో పాటు ఇతర విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు నాణ్యతను పెంచేందుకు సీడ్ ట్రేసబిలిటీ విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు..
Leave Your Comments