Thamara Purugu Effect: ప్రకృతి ప్రకోపంతో రైతన్నలు నిండా మునిగారు. అధిక వర్షాలకు తోడు, కొత్త కొత్త తెగుళ్లు మిర్చి రైతన్నను నట్టేటా ముంచేశాయి. అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు అవి తీర్చే దారిలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
గతేడాది కురిసిన అధిక వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతంగాన్ని కుదేలు చేశాయి. ముఖ్యంగా మిర్చిరైతులు తీవ్రంగా నష్టపోయారు. నల్లతామర కారణంగా మిర్చి పంట సమూలంగా దెబ్బతింది. కనీసం పెట్టుబడిలో సగం వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో అధికంగా మిరప పంట సాగు చేశారు. ప్రధానంగా బ్యడిగా, డబ్బి, సిజంటా, 5885, తేజ రకాలను ఎక్కువగా వేశారు. ఎకరాకు కనిష్ఠంగా లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు తెలిపారు. కానీ నల్లతామర తెగులు మిర్చి రైతులను తీవ్రంగా నష్టపరించింది. పూత రాలిపోయి దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. ఆకులు, కాయలు సైతం కుళ్లిపోతుండటంతో ఎకరాకు రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
Also Read: కుండీలో… పచ్చని మిర్చి
తామర తెగులు సహా ఇతర పురుగుల నివారణకు రైతులు పెద్దఎత్తున మందులు పిచకారీ చేయడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీ పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1.80 లక్షల హెక్టార్లలో మిరప పంట సాగు చేశారు. ప్రాంతాలకు అతీతంగా అన్నిచోట్ల మిర్చిపంట తెగుళ్ల బారీన పడింది. త్రిప్స్ పార్విస్పైనస్ గా పిలిచే కొత్తరకం తామర పురుగుల ప్రభావంతో మిరపకు అత్యధికంగా నష్టం జరిగింది. తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న పురుగుమందులన్నీ చల్లి అప్పులపాలయ్యామని గుంటూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లతామర పురుగు, తెల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో పంట 80శాతం మేర దెబ్బతిందని వాపోయారు. ఎన్నిరకాల మందులు కొట్టినా అప్పులు పెరిగాయి కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదన్నారు.
కృష్ణా జిల్లాలోనూ మిరప పంటను తామర పురుగు ఆశించి రైతుల్ని తీవ్రంగా నష్ట పరిచింది. వేల ఎకరాల్లోని పంటలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజయవాడలో రైతులు ఆందోళన బాట పట్టారు. మిరపతో పాటు సుబాబుల్, పత్తి, వరి ఇతర పంటలు సైతం బాగా దెబ్బతిన్నాయని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వెనక్కి వచ్చేలా లేవని రైతులు రోడ్డెక్కారు. తామర పురుగు వల్ల నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.
Also Read: అకాల వర్షాలతో మిర్చి రైతుల ఆందోళన