కూరగాయలు, పండ్లు త్వరగా వాడిపోయి, పండిపోకుండా అరికట్టడంతో పాటు రైతులు, చిరు వ్యాపారుల ఆదాయాన్ని పెంపొందించవచ్చు. చిన్న బ్యాటరీతో నడిచే ఒక గుడారం వంటి కోల్డ్ స్టోరేజ్ గదిని రూపొందించారు బీహార్ కు చెందిన నిక్కీ కుమార్, ఆయన సోదరి రేష్మి.
ఐఐటీ కాన్పూర్ నిపుణుల తోడ్పాటుతో రూపొందించిన ఈ గుడారం ఇథలిన్ విడుదలను నియంత్రించటం ద్వారా కూరగాయలు, పండ్లను మగ్గిపోకుండా చూస్తుంది. నేల మీద, తోపుడు బండి మీద కూడా పెట్టుకోవచ్చు. బరువు చాలా తక్కువ కాబట్టి దీన్ని మడత పెట్టి సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. విద్యుత్ లేని చోట్ల కూడా పెట్టుకోవచ్చు. ఇందులో భద్రపరిచిన కూరగాయలు, పండ్లు 3 నుంచి 30 రోజులపాటు చెడిపోకుండా నిల్వ ఉంటాయని చెబుతున్నారు. 200 కిలోలు పట్టే గుడారం ధర రూ. 10 వేలు, 500 కిలోలు పట్టే గుడారం ధర రూ.20 వేలు, 1000 కిలోలు పట్టే గుడారం ధర రూ. 40 వేలు.