ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష, ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు(అక్టోబర్ 28) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్ టెక్నాలజీ సెంటర్ లో ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కుసుమ, అవిసెల పంటలపై పరిశోధనలు చేస్తున్న150 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొని వివిధ పరిశోధన అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTAU), జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR) లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి .
* డా. టి. ఆర్. శర్మ ( ICAR -DDG, న్యూ ఢిల్లీ ) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రస్తుతం ఇండియా 1.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలని దిగుమతి చేసుకుంటుందని, దీనిని తగ్గించడానికి జాతీయ నూనె గింజల మిషన్ ని భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కావున మనం చేసే పరిశోధనలు నూనె గింజ పంటల సాగును పెంచి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ముళ్ళు లేని కుసుమ రకాలను వృద్ధి చేయాలన్నారు. అన్ని పరిశోధన సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం వల్ల కుసుమ, అవిసెలలో చాలా నూతన రకాలను వృద్ధి చేయడం జరిగిందని శర్మ వివరించారు.
* డా. సంజీవ్ గుప్త (ICAR-ADG, న్యూ ఢిల్లీ ) మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో కుసుమ, అవిసె పంటలకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా ఈ నూనె గింజల పంటలలో లినోలేనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ పంటల సాగు ఇంకా పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
* డా.మాథూర్ ( డైరెక్టర్, IIOR) గత సంవత్సరం కుసుమ, అవిసెలలో చేపట్టిన పరిశోదన ఫలితాలను క్లుప్తంగా వివరించారు.
* డా. జెల్లా సత్య నారాయణ ( డీన్ అఫ్ అగ్రికల్చర్, PJTAU ) మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా వరకు కుసుమ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం చీడ పీడలను తట్టుకునే రకాలను వృద్ధి చేయడమే కాకుండా కుసుమ నూనె కూడా ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కుసుమ, అవిసెలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. డా. సి. సుధాకర్ ( ప్రధాన శాస్త్రవేత్త ) సమన్వయ కర్తగా వ్యవహారించి ప్రారంభ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
Leave Your Comments