TS Agri Minister Niranjan Reddy: హైదరాబాద్ బేగంపేట మేరి గోల్డ్ హోటల్ లో భారత జాతీయ విత్తన సంఘం నిర్వహించిన బయోటెక్నాలజీ ద్వారా పంటల అభివృద్ధిపై జరిగిన సదస్సులో ముఖ్యఅతిధిగా జూమ్ మీటింగ్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నూజీవీడు సీడ్స్ అధినేత ప్రభాకర్ రావు, దేశంలో ప్రముఖ విత్తన సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరైయ్యారు.
అమ్మకు, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచంలో ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది. కానీ, మనం తినే ఆహారం భూమి నుండే రావాలి .. రైతు మాత్రమే పండించాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. వ్యవసాయంతోనే సాధారణ పౌరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఆహార అవసరాలకు ఇతర దేశాల మీద ఆధారపడేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం పండ్లు, పూలు, పాల ఉత్పత్తులు, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రపంచస్థాయిలో గణనీయ అభివృద్ధి సాధించినప్పటికీ మరెంతో సాధించాల్సి ఉంది. వ్యవసాయ అభివృద్ధికి విత్తనం, దానియొక్క నాణ్యత ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచ విత్తన పరిశ్రమలో భారత్ ఐదో స్థానంలో ఉందని మంత్రి తెలిపారు.
70,80వ దశకంలో విత్తన పరిశ్రమ ప్రభుత్వరంగంలోనే ఉండేది .. ఆ తర్వాత ప్రభుత్వ తోడ్పాటుతో ప్రైవేటు రంగంలో విత్తన పరిశ్రమ వృద్ది చెంది వివిధ పంటల సంకర రకాలతో పాటు ముఖ్యంగా కూరగాయల విత్తనాలలో గణనీయ వృద్ది సాధించింది. దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆహార అవసరాల దృష్ట్యా విత్తన పరిశ్రమ మరెంతో వృద్ది చెందాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత వాతావరణ మార్పులు, రాబోయే కాల పోషకాహార అవసరాలు, ఉత్పాదకత పెంపు నేపథ్యంలో విత్తన రంగంలో పరిశోధనలు మరింత ముందుకుపోవాలి. ఆ దిశగా జరుగుతున్న ఇటువంటి సదస్సులు విత్తన కంపెనీలు, పరిశోధకులకు ఒక దిశను చూయిస్తాయని ఆశిస్తున్నాను. మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ప్రాంతం వాతావరణరీత్యా విత్తన పరిశోధనలు, విత్తనోత్పత్తికి అనుకూలమైన ప్రాంతం అని చెప్పారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం విత్తన కంపెనీలకు ఎల్లవేళలా సహకారం అందిస్తుంది.
దేశానికి అవసరమైన పత్తి విత్తనాలు 50 శాతం తెలంగాణ నుండే ఉత్పత్తి అవుతున్నందుకు గర్విస్తున్నాం. విత్తన కంపెనీలు, పరిశోధకులు దీనిని ఉపయోగించుకునేందుకు ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలి .. దానికి ప్రభుత్వం నుండి అన్నిరకాల సహకారం ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత విత్తనరంగం మీద ఉంది. నాణ్యమైన విత్తనంతో రైతుల అభివృద్ధి కూడా నాణ్యమైనదిగా ఉంటుంది అని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.