TS Agri Minister: వ్యవసాయం వృత్తి కాదు జీవితం. ఇది సంస్కృతిని నేర్పే ఆయుధం.. భూమికి, మట్టికి దూరం కావడం అంటే తల్లిదండ్రులకు దూరం అయినట్లే. రాబోయే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం నిలుస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు.
యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే దేశ భవిష్యత్ కు మేలు చేస్తుంది. ఈ రంగం వైపు ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. దార్శనిక నాయకులు మాత్రలు దిశను చూపగలుగుతున్నారు. దేశ రాజకీయాల్లో మొదటి నుండి దార్శనిక ఆలోచనల లోటు ఉన్నది. ప్రపంచ విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలి. నాణ్యమైన విత్తనం రైతుకు అందాలని మంత్రి అన్నారు.
నిరంతర పరిశోధనలతోనే ప్రగతి సాధ్యం. పరిశోధనల మూలంగానే చిన్న దేశమైనా ఇజ్రాయిల్ ప్రపంచదేశాలు తనను అనుసరించేలా చేస్తున్నది. విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు పెంచాలి. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుంది. కాలక్రమంలో పంటల సాగు విధానం మారింది.
ఒకప్పుడు వానాకాలం పండించే వేరుశెనగ ఇప్పుడు యాసంగిలో పండిస్తున్నారు .. తాజాగా పత్తి సాగు యాసంగిలో వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు అనే రైతు యాసంగిలో పత్తి సాగు చేసి 18 క్వింటాళ్లు సాధించారు. రైతును మించిన శాస్త్రవేత్తలు లేరు అనడానికి ఇది నిదర్శనం. శాస్త్రవేత్తలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి.
Also Read: Wanaparthy Tirumalayya Gutta: వనపర్తికి తలమానికం తిరుమలయ్య గుట్ట.!

TS Agri Minister
రాబోయే యాసంగిలో పెద్ద ఎత్తున పత్తి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మార్చి నెలకు ముందే యాసంగి వరి పంటలు కోతకు వచ్చేలా రైతులు చూసుకోవాలి .. మార్చి నెల దాటితే వడగళ్ల వానలు వస్తాయి. దాదాపు 20 దేశాలకు విత్తనాలను తెలంగాణ నుండి ఎగుమతి చేస్తున్నాం .. ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరాలి.
తెలంగాణ, ఆంధ్రలో దాదాపు ఏడు లక్షల మంది విత్తన రైతులు ఉన్నారు. విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కేంద్రం దృష్టి సారించడం లేదు. దేశం నుండి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఇతర దేశాల నుండి అనేక ఉత్పత్తులు అడ్డగోలుగా దిగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదు.
కేంద్రమంత్రికి మన్ను తెల్వదు, మట్టి తెల్వదు, విత్తనం తెల్వదు, పంట తెల్వదు .. కనీసం అధికారుల సలహాలు తీసుకోరు. తెలంగాణ ధాన్యం కొనమంటే నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి అన్నారు .. ఆరు నెలలు తిరగక ముందే ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టారు. నాలుగేళ్లు కాదు ఎనిమిదేళ్లు కరవొచ్చినా పంటలు పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ నిలిపారు.
భవిష్యత్ లో తెలంగాణ రైతులు పంటలు పండించండి అని కేంద్రం రైతుల కాళ్లు మొక్కే స్థితి వస్తుంది. ఆయిల్ పామ్ సాగుకు సహకారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. భవిష్యత్ లో ఏటా లక్ష కోట్ల నూనెలను దిగుమతి చేసుకునే భారం తగ్గుతుంది అని చెప్పాం. భారత ప్రజల ఆహార అవసరాలు తీర్చే స్థితికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు మూలంగా తెలంగాణ వాతావరణం మారుతున్నది. భూగర్భజలాలు, పచ్చదనం పెరిగి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విత్తన రంగ సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది.
రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన సీడ్స్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఏఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి రవికుమార్, కోశాధికారి చేరాలు, ఈడీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
సీడ్స్ మెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ యోగేశ్వరరావుకు విత్తనరంగ పితామహుడు బిరుదునిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందజేసారు. కరోనా విపత్తులో వ్యవసాయరంగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఉత్తర్వులు దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులనే మిగతా రాష్ట్రాలు అమలు చేశాయని సీడ్స్ మెన్ అసోసియేషన్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మూలంగా వ్యవసాయ రంగం , విత్తనరంగం సంక్షోభం వైపు వెళ్లకుండా చేశాయని అన్నారు.