తెలంగాణతెలంగాణ సేద్యంమన వ్యవసాయంవార్తలు

పత్తికి మంచి ధర దక్కాలంటే…పత్తి దూది తీత, నిల్వలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు

0

పత్తి దూది తీత, నిల్వలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు

పత్తిలో పూత వివిధ దశల్లో రావటం వల్ల పత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వస్తుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెల నుంచి జనవరి, ఫిబ్రవరి నెల వరకు పత్తి తీతలు జరుపుతారు. ఇదే కాలంలో మంచు కురియడం వల్ల పత్తి ఉదయం పూట తడిసి ముద్దగా అవుతుంది. కాబట్టి మంచు అరిన తర్వాతనే పత్తిని తీయాలి. అలాగేబాగా ఎండినటువంటి పత్తిని మాత్రమే గుల్లల నుంచి వేరు చేయాలి. పత్తి తీసేటప్పుడు ఎండిన ఆకులు, ఇతర మొక్కకు సంబంధించిన ఎండిన కొమ్మలు కల్వకుండా చూసుకోవాలి. పత్తి తీయగానే నీడలో గాలి తగిలే విధంగా ఆరవేయాలి.ఈవిధంగా చేయటం వల్ల పత్తి గింజ బాగా గట్టిపడటమే కాకుండా తేమ తగ్గి పత్తి రంగు మారకుండా ఉంటుంది. ఇలా కాకుండా ఎండలో ఆరబెట్టినట్లయితే దాంట్లో ఉన్న తేమ వల్ల వేడిఎక్కువై గింజలు ముడుచుకుపోయి పత్తి బరువు తగ్గటమే గాకుండా ముక్కుపురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది. తీసిన పత్తిని నిలువచేసేటప్పుడు తేమ తగలకుండా చూడాలి. దూది నాణ్యత ముఖ్యంగా పింజ పొడవు, పింజ గట్టితనం, పింజ మృదుత్వం, పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. దూది నాణ్యత అనేది జన్యు సంబందమైనది. అయితే దీని మీద వాతావరణం, చీడపీడల ప్రభావం కూడా కొంతవరకు  ఉంటుంది.

పింజ పొడవును బట్టి మార్కెట్ ధర:
పింజ పొడవు అనేది విత్తనం ఉపరితలం నుంచి పింజకొన వరకు ఉండే పొడవుని పింజ పొడవు అంటారు. పత్తి విత్తనం లావుగా ఉన్న వైపు పింజ పొడవుగా ఉంటుంది. అలాగే సన్నగా ఉండే వైపు పింజ పొడవు తక్కువగా ఉంటుంది. పత్తి ధరను నిర్ణయించేటప్పుడు పింజ పొడవు కూడా ఒక కొలామానం. ఈ పింజ పొడవును బట్టి పత్తిని పొట్టి పింజ, పొడవు పింజ అని వివిధ రకాలుగా విభజించారు. ప్రస్తుతం మనం పండించే పత్తి ఎక్కువగా పొడవు పింజ రకం కిందకు వస్తుంది. పూర్వం పండించిన దేశవాళీ పత్తి అతి తక్కువ పింజ పొడవు కలిగిన రకాలు. భారత ప్రభుత్వం ప్రస్తుత 2024-25 సంవత్సరానికిగాను అతి పొడవు పింజ (32.5 మి. మీ, ఆ పైన) కలిగిన రకాలకు రూ. 7721 నుంచి రూ. 8721, పొడవు పింజ రకాలకు (27.5 – 32.0 మి.మీ) రూ.7521, మధ్యస్థ పింజ రకాలకు (25.0 – 27.0 మి.మీ) రూ. 7121 మద్దతు ధరను ప్రకటించడం జరిగింది.

పింజ గట్టిదనం ఎక్కువుంటే మంచి దూది:  

  • పింజ మృదుత్వం పింజ వ్యాసం పైన ఆధారపడి ఉంటుంది. పింజ రెండు చివర్లలో ఎక్కువ మృదువుగా ఉండి, మధ్యలో కొంత తక్కువగా ఉంటుంది. మైక్రోనీర్ విలువను బట్టి పింజ మృదుత్వాన్ని వివిధ తరగతులుగా విభజించారు. మైక్రోనీర్ విలువ తక్కువగా ఉంటే పింజ మృదుత్వం ఎక్కువ అని తెలుసుకోవాలి. పూర్వం పండించిన దేశవాళి రకాలలో పింజ ముతకగా ఉంటుంది. అదే అమెరికన్, ఈజిప్షియన్ జాతి రకాల పింజ మృదుత్వం ఎక్కువగా ఉంటుంది. పింజ గట్టితనం ఎక్కువగా ఉంటే మంచి దూది అని గ్రహించాలి. నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా దారం తీసే పరిశ్రమలలో ఇది చాలా ముఖ్యమైనది.
    పింజ పరిపక్వత వర్షాధారంలో కన్నా నీటిపారుదల కింద సాగుచేసే పత్తి పంటలో పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. పింజలో పరిపక్వత చెందినవి, అపరిపక్వత చెందినవి, సగం పరిపక్వత చెందిన పోగులు ఉంటాయి. పోగులలో ఏ రకం ఎన్ని ఉన్నాయో చూసి పింజ పరిపక్వత సూచికను లెక్కకడతారు. సాధారణంగా పరిపక్వత ఎక్కువ ఉంటే దూది నాణ్యత బాగా ఉంటుంది.
  • పూర్తిగా పక్వానికి రాని కాయల నుంచి పత్తిని తీయకూడదు. ఎందుకంటే వీటి దూదిలో ఆపరిపక్వ పోగుల శాతం ఎక్కువగా ఉంటుంది.
  • పత్తి కాయలను గులాబి రంగు పురుగు ఆశించినప్పుడు పత్తి రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. ఇటువంటి పత్తిని మంచి పత్తితో కలిపి అమ్మితే ధర తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి మాసం తర్వాత వచ్చే పత్తికాయలన్నింటిలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల పత్తి విత్తిన ఆరు నెలల తర్వాత అంటే డిసెంబర్ లో పంటను తీసివేయడం మంచిది.
  • పత్తి బరువు పెంచడానికి మార్కెట్ కి తోలే ముందు బస్తాలపై నీటిని పిచికారి చేయడం వల్ల పత్తిలో తేమశాతం ఎక్కువై, నిలువ చేసినప్పుడు వేడి పెరిగి, బూజు వచ్చి రంగు మారి, నాణ్యత దెబ్బతింటుంది. తడిసిన పత్తి నుంచి జిన్నింగ్ మిల్లులో విత్తనం వేరు చేయటం కూడా కష్టం అవుతుంది.
  • పత్తిని యూరియా బస్తాలలో నిల్వ చేయడం వల్ల వాటిలో ఉండే పోగులు పత్తి దూదిలో కలిసి గింజలు వేరు చేసేటప్పుడు జిన్నింగ్ లో ఇబ్బందిగా మారుతుంది. కావున గోనెసంచులలో నిల్వచేసి మార్కెట్ కి తరలించడం మంచిది.
  • సింథటిక్ పైరిత్రాయిడ్స్ మందులను ఎక్కువగా వాడటం వల్ల రసం పీల్చే పురుగులైన పేను బంక, తెల్లదోమ ఎక్కువై అవి విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల పత్తి పైన బూజు ఏర్పడి నల్లగా మారుతుంది.
  • మన దేశంలో పండించే పత్తి పంటపై విచక్షణ రహితంగా పురుగుమందులను పిచికారి చేయడం వల్ల వీటి అవశేషాలు దూదిపై మిగిలి నాణ్యత తగ్గిపోతుంది. కనుక అవసరం మేరకే పురుగుమందులను పిచికారి చేయాలి.
  • పత్తిని తీసే సమయంలో పురుగుమందులను పిచికారి చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా పత్తిని తీసి తర్వాతనే మందులను పిచికారి చేయాలి.
  • పత్తిని గ్రేడింగ్ చేసి మంచి పత్తిని విడిగా అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది.
  • పత్తిని జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులకు తరలించేటప్పుడు దుమ్ము, దూళి సోకకుండా జాగ్రత్త వహించాలి. దీనివల్ల దూది పోగుల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
    ఈ విధంగా రైతులు పత్తి తీసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు, మార్కెట్ కు తరలించేటప్పుడు మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించినట్లయితే ధర ఎక్కువగా పలికే అవకాశం ఉంటుంది.

డా. వై. ప్రశాంత్, డా. జి. వీరన్న, డా. ఎస్. ఓంప్రకాష్,
డి. అశ్విని, డా. బి. ఏడుకొండలు, డా. ఆర్, ఉమా రెడ్డి
పత్తి పరిశోధన విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్.

Leave Your Comments

రబీ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి ?

Previous article

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

Next article

You may also like