ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించిన
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి.
- రాష్ట్ర పామాయిల్ రైతుల సంక్షేమం కోసం మంత్రి తుమ్మల రాసిన లేఖకు స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.
- ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ,సేంద్రియ వ్యవసాయం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంపామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి, దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం (04.11.2024) లేఖ ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎన్.ఎమ్.ఈ.ఒ.పి పథకంలో భాగంగా 64,040 హెక్టార్లలో ఆయిల్ పాం ప్లాంటేషన్ అత్యున్నత ప్రగతి సాధించినందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ పథకంలో జాతీయ స్థాయిలో లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించారు. 2024-25 సంవత్సరంలో ఒక లక్షఎకరాలకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఇప్పటివరకు 24,581 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తిచేసినందుకు మంత్రికి అభినందనలు తెలపారు. సమర్థ నాయకత్వంలో కొత్తగా పామాయిల్ సాగు చేయడానికి ముందుకువస్తున్న రైతులను ప్రొత్సహిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా తమ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పామాయిల్ గెలల ధరల విధానం విషయంలో కోరిన విధంగా కేంద్ర అధికారుల బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వంతో, పామాయిల్ రైతులతో సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కోరిన విధంగా దేశంలోని పామాయిల్ రైతుల సంక్షేమం కోసం, పామాయిల్ గెలల ధర పెరుగుదల కోసం ముడి పామాయిల్ పై ఎఫెక్టివ్ డ్యూటీని 27.5 శాతానికి పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
అదేవిధంగా ఎన్.ఎమ్.ఈ.ఒ.పి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. పామాయిల్ సాగులో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహాయ సహాకారాలకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు.
దిగుమతి సుంకాన్నిపెంచడంతో ఆశాజనక ధరలు:
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ గెలల ధరల విషయంలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లడంతో పాటు ఇటీవల కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటనకి వచ్చిన సందర్భంలో కూడా వివరించారు. మంత్రి తుమ్మల కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీని వల్ల పామాయిల్ రైతులకు అధిక ధర రావడంతో పాటు, కొత్తగా పామాయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహకరంగా మారింది. దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా, సరాసరి క్రూడ్ పామాయిల్ ధరలు అక్టోబర్ నెలలో రూ.1,19,000 లకు చేరి, పామాయిల్ గెలల ప్రస్తుత ధర రూ.19,144 లకు చేరింది. ఈ నవంబర్ నెల మాసంలో క్రూడ్ పామాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,25,000 గా నమోదవుతోంది. క్రూడ్ పామాయిల్ ధరలు ఇదేవిధంగా కొనసాగితే పామాయిల్ గెలల ధర రూ.20,000 లకు పైన ఉండే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్ ధరలను రూ. 1,25,000 తగ్గకుండా ఉండేందుకు దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, గతంలో దిగుమతి సుంకం 44 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తుచేశారు.
పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రిపేర్కొన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో
సహజ, సేంద్రీయ వ్యవసాయానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ !
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రీయ వ్యవసాయం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను రూ. 10 కోట్లతో ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి 2024సెప్టెంబర్ 18 న లేఖ రాశారు. దీనికి కేంద్ర మంత్రి స్పందిస్తూ భారత ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అఫ్ హార్టికల్చర్ (MIDH) పథకంలో భాగంగా సహజ,సేంద్రీయ వ్యవసాయం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ప్రమోట్ చేయడం జరుగుతుందన్నారు. నిర్ధేశించిన విధానాల ప్రకారం ద్వైపాక్షిక సహాకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు మంజూరవుతున్నాయన్నారు. అయితే ఈ రంగంలో అందుబాటులో ఉన్న నూతన, అత్యాధునికి సాంకేతికతను అందించడానికి ప్రైవేట్ వ్యవస్థాపకులకు వారి స్వంత నిధులతో ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందని తెలిపారు. MIDH నిబంధనల ప్రకారం ఈ కేంద్రాలలో ఉద్యానవన పంటలు చేపట్టే రైతులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన సహాయసహకారాలు అందించడం జరుగుతుందన్నారు.