Telangana Agricultural Schemes: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసింది. పండ్ల తోటలు సాగు చేసుకునే రైతులకు పండ్ల మొక్కలు రాయితీ ధరలకు సరఫరా చేయడంతోపాటు ఉపాధి హామీ ద్వారా కూలీలను కూడా ఉచితంగా అందించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో 600 ఎకరాల్లో పండ్ల తోటలు నాటించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
పండ్ల తోటలకు పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు
తెలంగాణ ప్రభుత్వం ఉధ్యాన రైతులకు భారీ రాయితీలు అందిస్తోంది. వికారాబాద్ జిల్లాలో మునగ తో పాటు, 500 ఎకరాల్లో పండ్ల తోటలకు రాయితీలు అందిస్తోంది. రైతులు ఎంచుకునే పండ్ల మొక్కలను బట్టి ప్రభుత్వ రాయితీలు అందిస్తోంది. ఒక్కో రకం పండ్ల తోటకు ఒక్కో రకంగా రాయితీలు నిర్ణయించారు. అందుబాటులో ఉన్న పండ్ల మొక్కలతోపాటు, సమీప ప్రాంతాల నుంచి కూడా పండ్ల మొక్కలు తీసుకుని రావచ్చని అధికారులు చెబుతున్నారు.
తోటలు నాటడానికి అవసరమయ్యే గుంతల తవ్వకం, ఎరువులు వేయడం, కలుపు తీయడం లాంటి పనులను ఉపాధిహామీ పథకం ద్వారా ఉచితంగా చేయించుకోవచ్చని ఉధ్యానశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో లక్షా 70 వేల మంది కూలీలు ఉపాధి హామీలో నమోదు చేసుకున్నారు. వీరంతా తోటల్లో పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Also Read: Tomato Cultivation: టమాటా సాగుతో భారీ లాభాలు, ఇలా చేస్తే లక్షల్లో ఆదాయం.!
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు రాయితీలు
హైదరాబాద్ సమీపంలో పండ్ల తోటలు సాగు చేసుకునే రైతులకు సువర్ణావకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకునే వారికి భారీగా రాయితీలు అందిస్తోంది. ఒక్కో రైతు 20 గుంటల్లో కూడా ఈ పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే రైతులు ఎకరాకు పది లక్షలు ప్రారంభ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం భారీగా రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే ఒక్కో రైతుకు మూడేళ్లలో రూ.2.50 లక్షలు చెల్లించనున్నారు.
గత ఏడాది జిల్లాల్లో 100 ఎకరాల్లో మునగ సాగైంది. ఈ ఏడాది కూడా వంద ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎకరాకు వెయ్యి మొక్కలను రైతులకు రాయితీ పై అందిస్తున్నారు. ఏడాది నిర్వహణకు రూ.1.25 లక్షలు చెల్లిస్తారు. పండ్ల తోటలు సాగు చేయాలను కుంటున్న రైతులు రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధనపు అధికారి స్టీవెన్ నిల్ సూచిస్తున్నారు.
ఖర్చు తక్కువ నికరాదాయం ఎక్కువ
పండ్ల తోటలు ఒక్కసారి పంటకు వస్తే 20 నుంచి 30 ఏళ్ల పాటు దిగుబడినిస్తూనే ఉంటాయి. నాలుగేళ్లు కష్టడితే ఇక మొత్తం రాబడే. తెలంగాణ ప్రభుత్వం కూడా తోట పంటలకు భారీగా రాయితీలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుని రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా తోటలు సాగు చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సలహా ఇస్తున్నారు.
Also Read: World’s Expensive Mango ‘Miyazaki’ : అతి ఖరీదైన మామిడి పండ్లు.. ధర తెలిస్తే షాకవుతారు.!