Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. వికారాబాద్ జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించేందుకు ఉద్యాన శాఖ అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. జిల్లాలో 31 వేల ఎకరాల్లో భూములు ఆయిల్ పామ్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించి వారి వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.
ఆయిల్ పామ్ మొక్కలు, సూక్ష్మసేద్య పరికరాలు సబ్సిడీపై సరఫరా
తెలంగాణలో మొత్తం 22 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రైతులకు భారీగా రాయితీలు ప్రకటిస్తున్నారు. ప్రతిఏటా ఎకరానికి రూ.4,200 వంతున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఇందుకు అనువైన భూమి ఉండి, ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలో 25 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనువైన భూములు ఉన్నాయని అధికారులు గుర్తించారు. రైతులకు 50 కిలోమీటర్ల పరిధిలోనే ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె తీసే పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి లో ఓ ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
Also Read: Telangana Agricultural Schemes: ఉపాధి హామీతో రైతుకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం
ప్రకృతి వైపరీత్యాల బెడద లేదు
ఆయిల్ పామ్ పంటకు ప్రకృతి వైపరీత్యాల బెడద లేనేలేదు. అంతే కాదు చీడపీడలు కూడా చాలా తక్కువ. ఒక్కసారి నాటుకుంటే నాలుగో ఏడాది నుంచి 30 ఏళ్లపాటు ఆయిల్ పామ్ దిగుబడి లభిస్తుంది. నాలుగో ఏడాది నుంచి ఎకరాకు సగటున రూ.50 వేల నుంచి రూ. లక్ష దాకా లాభం వచ్చే అవకాశం ఉంది.
రైతులు స్థిరమైన ఆదాయం పొందడం తో పాటు కూలీల సమస్య కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు.
నీటి అవసరం తక్కువ, రాబడి ఎక్కువ
వరి పంటతో పోల్చుకుంటే ఆయిల్ పామ్ సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. ఎకరా వరిసాగుకు అవసరం అయ్యే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ కూడా మద్దతు ధర ప్రకటించింది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా మొక్కలు సరఫరా చేయడంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా రాయితీ ధరలకు అందిస్తోంది. అంతేకాదు నాలుగేళ్ల పాటు సాగు ఖర్చులు కూడా రైతుల ఖాతాలో జమేస్తున్నారు. ఒక మొక్క ధర రూ.193 కాగా, రూ.173 ప్రభుత్వ సబ్సిడీ అందిస్తోంది. కేవలం రూ.20 ఒక్కో మొక్క అందిస్తున్నారు. ఒక ఎకరాకు 57 మొక్కలు నాటుకోవాలి. చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం రాయితీ లభిస్తుంది.
Also Read: Oil Palm Cultivation: మీకు తెలుసా? ఒక్కసారి నాటితే 40 సంవత్సరాలు దిగుబడి వచ్చే పంట