Rythu Bandhu: ఇటీవల కురుస్తున్నవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి బాధలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వచ్చే నెల జూన్ నుండి రైతులకు రైతుబంధు పథకం కింద నగదును అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 59.26 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద నూతనంగా ప్రారంభించిన సచివాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రారంభ మూల్యాంకన సమావేశం జరిగింది, ఈ సందర్బంగా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రసంగించారు.
ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో ఒక కోటి 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచన వేయగా, మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. రైతులు మిగతా పంటలతో పాటు పత్తి, కంది సాగును కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అంతేకాకుండా వివిధ రకాల పంటల సాగుకు మొత్తం 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని మంత్రి గారు పేర్కొన్నారు.
Also Read: Summer Sunstroke in Cattles: వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండ ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.!
సేంద్రీయ సాగును ప్రోత్సహించడానికి మరియు భూసారాన్ని కాపాడుకోవడానికి, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్బంగా ప్రకటించారు. దీన్ని సులభతరం చేసేందుకు రూ. 76.66 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే, నానో యూరియా మరియు నానో డిఎపి ఎరువుల వాడకం దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి గారు సూచించారు. వీటితోపాటు వ్యవసాయంలో డ్రోన్‌ల ప్రాముఖ్యత మరియు వాటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి యువ రైతులకు అవగాహన కల్పించడానికి మరింత కృషి చేయాలని అధికారులను సూచించారు.
అయితే ఈ సమయంలో రైతుబంధు గురించి వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటనతో రైతుల ఆందోళనకు తెరపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నష్టం జరిగింది, ఇలాంటి కష్ట సమయాల్లో రైతుబంధు నగదు రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేస్తామన్న విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు రైతులను ఆదుకుంటూ వారికి కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తుందని రైతులకు భరోసానిచ్చారు.
Also Read: Amla Powder Benefits: ఉసిరి పొడి వల్ల కలిగే ఉపయోగాలు తెలుసా?