Drone Subsidy: అన్నదాతల కోసం, తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఆధునిక పోకడలను అలవరుచు కునేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున అన్నదాతలను ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రూ.1,500 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఈ క్రమంలోనే 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాల పంపిణీకి రెండు జిల్లాలో రూ.75 కోట్లతో రెండు పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇది విజయవంతం అయితే అన్ని జిల్లాలకు విస్తరించాలని యోచిస్తోంది. యాంత్రీకరణ లో భాగంగా రైతులకు తెలంగాణా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సబ్సిడీపై డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
యాంత్రీకరణ లో భాగంగా మొదటి దశ అనగా 2016 నుంచి 2018 వరకు తెలంగాణ సర్కారు 6 లక్షల 66 వేల 221 మంది రైతులకు రూ.951.28 కోట్ల సబ్సిడీతో ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను అందజేసింది. అనంతరం ఈ పథకం మూణాళ్ళ ముచ్చట గా చేశారు నిధుల కొరత వల్ల పథకం పూర్తిగా నిలిచిపోయింది. అయితే మరోసారి ప్రభుత్వం యాంత్రీకరణ రెండవ దశను ప్రారంభించింది.
Also Read: Polyhouse Rose Cultivation: పాలిహౌస్ లో గులాబి సాగు, లక్షల్లో ఆదాయం.!
సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు యంత్రాల వాడకం మరింత పెరిగింది. అన్నదాతల్లో 37 శాతం మంది యంత్ర పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో యంత్ర పరికరాల పంపిణీ పై దృష్టి సారించింది. పరికరాల కొనుగోలుకు 50 శాతం ప్రభుత్వం చెల్లిస్తే మిగిలిన 50 శాతం రైతులు భరించాలి. ముందుగా ఆయా జిల్లాల్లో వ్యవసాయ యంత్రాలు, పరికరాల ప్రదర్శన చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తరువాత రైతులకు ఈ పథకం వర్తింపజేస్తారు.
డ్రోన్ల పై ప్రత్యేక దృష్టి..
తెలంగాణలో రైతులు ఇతర పరికరాలతో పాటు కొత్తగా వచ్చిన డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. పురుగుల మందు పిచికారికి డ్రోన్ ను విపరీతంగా వాడుతున్నారు. అయితే డ్రోన్లను అందుబాటులోకి తీసుకు రావాలని వ్యవసాయ శాఖాధికారులు భావిస్తున్నారు. డ్రోన్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల వాటి కొనుగోలు, సబ్సిడీ, వినియోగం తదితర అంశాలపై క్షుణ్నంగా పరిశీలించి అమలు చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను తక్కువ ధరకే ఇచ్చేందుకు వీలుగా ప్రతీ మండలంలోనూ ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. వీటి బాధ్యతలను మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 552 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి గరిష్ఠంగా 30 లక్షల రూపాయలు అవసరం అవుతుండగా… పెట్టుబడి వ్యయంలో 25 శాతం సబ్సిడీగా ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని రుణంగా ఇప్పిస్తారు.
Also Read: Plant Nursery: అన్ని మొక్కలు లభించే చోటు నర్సరీ.!