PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు రాజేంద్రనగర్ లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఇది మూడు రోజులపాటు జరగనుంది. విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, విస్తరణ విద్యాసంస్థ, వ్యవసాయ సమాచార కేంద్రం, ఎలక్ట్రానిక్ విభాగంలో పని చేసే శాస్త్రవేత్తలు అందరూ దీనిలో పాల్గొన్నారు. గత ఏడాది పనితీరుని సమీక్షించి 2023- 24 సంవత్సరంలో అమలు చేయవలసిన కార్యచరణ ప్రణాళికను దీనిలో రూపొందిస్తారు.
తొలుత వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి గత ఏడాది ప్రగతిని నివేదించారు. నిత్యం రైతులకి అవసరమైన సేవల్ని అందించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వర్సిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికీ 389 వీడియోలని అప్లోడ్ చేశామన్నారు. సుమారు 81 లక్షల మంది రైతులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని సుధారాణి వివరించారు. గత ఏడాది అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని రానున్న సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లకి సంసిద్ధంగా ఉండాలని పరిశోధనా సంచాలకులు డాక్టర్ వెంకటరమణ సూచించారు. అన్ని ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాలు, తృణధాన్యాల ప్రదర్శనశాలల్ని ఏర్పాటు చేయవలసిందిగా వెంకటరమణ సూచించారు.

State Level Conference of Extension Department to be held at PJTSAU for three days
Also Read: Coconut Plantations: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కొబ్బరి తోటల సాగు.!
కృషి విజ్ఞాన కేంద్రాలు గ్రామీణ విశ్వవిద్యాలయాలని రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో సాగు అద్భుత పురోగతిని సాధిస్తుందన్నారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. PJTSAU ప్రారంభమైనప్పటి నుంచి 15 పంటల్లో 61 రకాల్ని, 117 వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన విధానాల్ని రూపొందించామని వివరించారు. త్వరలోనే డ్రోన్ అకాడమీనీ ప్రారంభిస్తామని ప్రకటించారు.

PJTSAU Auditorium
గతం వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త సవాళ్లను తీసుకొచ్చాయని సుధీర్ కుమార్ అన్నారు. పంటల సీజన్ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కూడా సూచించారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కందులు, ప్రత్తి విస్తీర్ణం మరింత పెరగడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ తదితర నూతన టెక్నాలజీ అమలును విస్తృతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సుధీర్ కుమార్ సూచించారు. ఈ సదస్సులో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Also Read: Ponnaganti leaves Health Benefits: పొన్నగంటి కూరతో పుష్కలమైన లాభాలు మీ సొంతం!